PM MODI: ఢిల్లీ వెళ్లి మోదీని కేసీఆర్ ఏం అడిగారు..? ఇన్నాళ్లకు నిజం బయటపెట్టిన ప్రధాని..!
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మోదీ తన విమర్శలతో చీల్చిచెండాడారు. గతంలో ఎప్పుడూ లేనంతగా కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ కుటుంబంపై, బీఆర్ఎస్ పాలనపై, కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
PM MODI: తన కొడుకు కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్ తనను అడిగారని, తాను దీనికి అంగీకరించలేదన్నారు ప్రధాని మోదీ. మీరేమైనా రాజులా.. యువరాజును సీఎం చేయడానికి అంటూ ప్రశ్నించానని మోదీ చెప్పారు. నిజామాబాద్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మోదీ తన విమర్శలతో చీల్చిచెండాడారు. గతంలో ఎప్పుడూ లేనంతగా కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ కుటుంబంపై, బీఆర్ఎస్ పాలనపై, కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్.. కుటుంబస్వామ్యంగా మార్చిందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఎన్డీయే కూటమిలో చేరుతానని కేసీఆర్ అన్నారని, తాము కూటమిలో చేర్చుకోబోమని తేల్చిచెప్పామని ప్రధాని మోదీ తెలిపారు. “ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సాకారమైంది. అయితే, రాష్ట్ర ప్రజల సంపదను ఒకే కుటుంబం దోచుకుంటోంది. తెలంగాణ ఏర్పడిన ఫలితాన్ని ఒక కుటుంబమే అనుభవిస్తోంది. ఒక కుటుంబం ప్రజల ఆకాంక్షల్ని కబ్జా చేసింది. కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, కుటుంబమే బాగుపడింది. తెలంగాణ యువత బీఆర్ఎస్‌కు మళ్లీ ఇంకో అవకాశం ఇవ్వొద్దు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు కేసీఆరే నాకు స్వాగతం పలికేవారు. కేసీఆర్ నన్ను పొగిడేవారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. జీహెచ్ఎంసీ మేయర్ పదవి బీజేపీకి ఇస్తానని కేసీఆర్ ఢిల్లికి వచ్చి నాకు చెప్పారు. తన కొడుకు కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తానని, దీనికి ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారు. మీరేమైనా రాజులా.. యువరాజును సీఎం చేయడానికి అని అడిగా.
వారసుడికి అధికారం అప్పగించడం సరికాదన్నా. అలాగే మరోసారి ఢిల్లీ వచ్చి ఎన్డీయేలో కూడా చేరుతామన్నారు. దీనికి మేం అంగీకరించలేదు. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాం అని చెప్పా. ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌ను ఎన్డీయేలో చేర్చుకోబోమని తేల్చిచెప్పాం. కేసీఆర్ అవినీతి బాగోతాన్ని నేను చెప్పా. ఆ తర్వాత నుంచి కేసీఆర్ నన్ను కలవడం లేదు. కుటుంబ పాలనలో అంతా తమవారికే లబ్ధి కలిగేలా చూసుకుంటారు. కేసీఆర్.. ప్రజాస్వామ్యాన్ని లూఠీస్వామ్యంగా మార్చారు. తెలంగాణ కోసం కేంద్రం భారీగా నిధులు ఇస్తే బీఆర్ఎస్ వాటిని లూటీ చేసింది. సర్దార్ పటేల్ తెలంగాణకు నిజాం నుంచి విముక్తి కల్పించారు. ఇప్పుడు మరో గుజరాతీ.. తెలంగాణ సమృద్ధికి కృషి చేస్తున్నారు” అన్నారు.
అధికార దాహంతో కాంగ్రెస్
“కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో ఉంది. దక్షిణ భారత దేశాన్ని ఆ పార్టీ మోసం చేయాలనుకుంటోంది. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి కలిసి మహిళా బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించింది. బిల్లుకు మద్దతు ఇస్తున్నాం అని బయటకు చెబుతూనే.. లోపల బిల్లు పాస్ కాకుండా కుట్రలు చేశారు. కానీ, దేశ మహిళలు ఇచ్చిన శక్తివల్లే నేను మహిళా బిల్లు పాస్ చేయగలిగా. బీఆర్ఎస్.. కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయం. కర్ణాటక ఎన్నికల తరహాలో బీఆర్ఎస్ డబ్బులు కుమ్మరించాలని చూస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలే.. కాంగ్రెస్‌కు డబ్బులు సమకూర్చారు. దక్షిణ భారత దేశాన్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఆలయాల సంపదను తీసుకుంటున్నారు. మైనారిటీ ప్రార్థనా స్థలాల జోలికిమాత్రం వెళ్లరు” అని మోదీ అన్నారు.