BJP: మాట నిలబెట్టుకున్న మోదీ.. కేసీఆర్‌కు సూపర్ ఝలక్.. జోష్‌లో బీజేపీ..!
తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ.. బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. కీలక హామీలు ఇవ్వడంతో పాటు.. వాటి అమలులో ఇప్పుడు కీలక అడుగు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న తెలంగాణపై.. కేంద్రం వరాల జల్లు కురిపించింది.
BJP: మూడు రోజుల గ్యాప్‌లో రెండుసార్లు తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ.. బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. కీలక హామీలు ఇవ్వడంతో పాటు.. వాటి అమలులో ఇప్పుడు కీలక అడుగు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న తెలంగాణపై.. కేంద్రం వరాల జల్లు కురిపించింది. నిజామాబాద్‌లో ప్రధాని మోదీ ఇచ్చిన వరాలకు.. కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు ప్రకటించిన 2వందల రూపాయల రాయితీకి అదనంగా మరో వంద రూపాయలు రాయితీగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు మోదీ సిద్ధం అవుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో పసుపు బోర్డుతో పాటు సమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జల వివాదాలను దృష్టిలో పెట్టుకొని.. కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాలపై రెండు తెలుగు రాష్ట్రాల వాటా తేల్చడంతో పాటు వివాదాల పరిష్కారానికి టైబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి కొత్తగా తమ వాటా తేల్చాలని తెలంగాణ ఎప్పటినుంచో పట్టుపడుతోంది. దీంతో ప్రస్తుత, భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పెద్దలు చెప్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనది.. పసుపు బోర్డు. గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన ధర్మపురి అర్వింద్.. బీజేపీని గెలిపిస్తే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని రైతులకు బాండ్ రాసిచ్చారు.
తర్వాత స్పైస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని మాత్రమే ఏర్పాటు చేయడంతో.. బీజేపీపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐతే ఇప్పుడు ఎన్నికలకు ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పసుపు బోర్డుకు కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. నిజానికి బీజేపీ మీద బీఆర్ఎస్ ప్రధానంగా.. కృష్ణా ట్రైబ్యునల్, విభజన హామీ అయిన గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు మీదే.. విమర్శలు గుప్పించేది ఇన్నాళ్లు. ఈ మూడింటిని నిజం చేస్తూ.. కేసీఆర్‌కు సూపర్ ఝలక్ ఇచ్చారు మోదీ. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. తెలంగాణలో బీజేపీ జోష్ మరింత పెరగడం ఖాయం.