PM MODI: మోదీ పాలనలో సంస్కరణలు.. ప్రజల ఆలోచనల్ని మారుస్తున్న సర్కారు..

మోడీ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా.. దేశం మొత్తం ప్రభావితమవుతోంది. దేశంపై తమ ముద్ర వేయాలనే పట్టుదల మోడీ ప్రభుత్వంలో కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 7, 2023 | 03:14 PMLast Updated on: Sep 07, 2023 | 3:21 PM

Pm Modi Govt Changing Indian Policies But People Are Not Developing

PM MODI: మోడీ ప్రధాని అయ్యాక గత తొమ్మిదేళ్లలో చాలా మార్పులొచ్చాయి. దేశం మొత్తం ప్రభావితమయ్యేలా నిర్ణయాలు ఉంటున్నాయి. మోడీ ప్రధాని కాక ముందు భారత్‌కు.. ఇప్పటి భారత్‌కు తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నోట్ల రద్దు నుంచి దేశం పేరు మార్పు వరకూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు తీసుకోవడం కామన్. కానీ ప్రజలందర్నీ ప్రభావితం చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండటం గమనార్హం.
దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన నిర్ణయం నోట్ల రద్దు. సడెన్‌గా గంటల వ్యవధిలో పెద్ద నోట్లు రద్దవుతాయన్న ప్రకటనతో దేశం స్తంభించినంత పనైంది. వంద కోట్ల మంది సొంత డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుల ముందు క్యూ కట్టాల్సి వచ్చింది. ఈ నిర్ణయంతో జరిగిన మేలేంటనే చర్చ పక్కనపెడితే.. దేశంలో నోట్లు రద్దయ్యాయనే విషయం జనం జన్మలో మర్చిపోలేనంతగా ఆ నిర్ణయం ప్రభావం చూపింది. ఆ తర్వాత వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో వచ్చిన జీఎస్టీ కూడా.. కొద్ది కాలంలో జన జీవితంలో భాగమైపోయింది. పన్ను విధానం గురించి దేశమంతా మాట్లాడుకోవడం అరుదనే చెప్పాలి.
ఇక ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేసిన మరో అంశం డిజిటల్ కరెన్సీ. నోట్ల రద్దు, కరోనాలాంటి కారణాలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో.. డిజిటల్ కరెన్సీ చాలా వేగంగా విస్తరించింది. డిజిటల్ ఇండియా థీమ్ తీసుకున్నా.. మిగతా విషయాల కంటే డిజిటల్ కరెన్సీ మాత్రం ఊహించని విప్లవంలా వెల్లువెత్తింది. అసలు ఇండియా లాంటి దేశంలోఈ రేంజ్‌లో డిజిటల్ కరెన్సీని ఎవరూ ఊహించలేదు. నోట్లు రద్దయ్యాక.. ఫిజికల్ కరెన్సీ కంటే డిజిటల్ కరెన్సీ బెటర్ అనే ధోరణి జనాల్లో వచ్చింది. కరోనా దీన్ని మరింత ప్రోత్సహించింది.
మోడీ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా.. దేశం మొత్తం ప్రభావితమవుతోంది. దేశంపై తమ ముద్ర వేయాలనే పట్టుదల మోడీ ప్రభుత్వంలో కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే బిల్లు 2019 జులైలో పార్లమెంటులో ఆమోదం పొందింది. దాంతో తలాక్ పేరుతో తక్షణ విడాకులు తీసుకునే ముస్లిం పురుషులకు మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య సమస్యకు కూడా కోర్టు తీర్పుతో పరిష్కారం చూపింది మోడీ సర్కారు. ఆర్టికల్ 370 రద్దుతో.. అసలు రాజ్యాంగం కశ్మీర్ గురించి ఏం చెప్పిందా అని దేశ ప్రజలంతా ఆసక్తిగా తెలుసుకున్నారు.
మతం, ప్రాంతం, సంస్కృతితో ముడిపడిన అంశాలను తేల్చటం అంత తేలిక కాదు. రామజన్మభూమి వివాదం చూస్తే.. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అనే స్థితి. పైగా అధికారంలో ఉన్న పార్టీ ఓ వర్గానికి అనుకూలమనే ప్రచారం. కోర్టు తీర్పు కూడా అలాగే ఉంటుందనే చర్చ. ఇలాంటి సమయంలో కోర్టు తీర్పు వచ్చాక లా అండ్ ఆర్డర్ అదుపు తప్పకుండా చూడటం చాలా కష్టం. అలాంటి క్లిష్ట పరిస్థితిని కూడా తెలివిగా హ్యాండిల్ చేశారు మోడీ. మొదట సమస్య నుంచి మతం కోణాన్ని తప్పించి.. భూ సమస్యగా చూడటంతో చాలా టెన్షన్లు పోయాయి. ఆర్టికల్ 370 రద్దు చేసే దాకా కశ్మీర్ విషయంలో భిన్న వాదనలున్నాయి. అది ద్వైపాక్షిక సమస్య అని కొందరు.. కాదు అంతర్జాతీయ సమస్య అని మరికొందరు వాదిస్తూ వచ్చారు. అదేం కాదు అది మన అంతర్గత విషయమే అని తేలిపోయింది. ఎన్నికల వ్యవస్థనే సమూలంగా మార్చేలా.. జమిలి ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఒకేసారి అన్ని ఎన్నికలు జరిగితే ప్రభుత్వాలన్నీ పరిపాలనపైన దృష్టి పెట్టవచ్చుననేవి జమిలి ప్రతిపాదనకు అనుకూలమైన అంశాలు.
రాజ్యాంగంలో ఎప్పుడో ప్రస్తావించిన కామన్ సివిల్ కోడ్‌ను కూడా హఠాత్తుగా తెరపైకి తెచ్చారు. ఇండియాలో ప్రస్తుతం మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించి, వాటి స్థానంలో ఒకే ఒక్క చట్టాన్ని తీసుకురావడమే యూనిఫామ్ సివిల్ కోడ్. రాజ్యాంగం ఆర్టికల్​ 44లో ఈ ఉమ్మడి పౌర స్మృతిని ప్రస్తావించారు. దేశ ప్రజల ఉమ్మడి పౌర స్మృతి కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొన్నారు. అయితే.. ఈ అంశంలో ఉన్న సున్నితత్వాన్ని గ్రహించిన రాజ్యాంగ రూపకర్తలు.. యూసీసీని అమలు చేసే విషయంలో ప్రభుత్వానికే స్వేచ్ఛనిచ్చారు. ఈ చట్టం ద్వారా మహిళలకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని సున్నితమైన, వివాదాస్పదమైన అంశాలను సైతం తొలగించవచ్చు.
అమృతకాలంలో వలసవాద పాలన గుర్తులుండకూడదని కొత్త వాదన ఎత్తుకుంది మోడీ సర్కారు. దానికి అనుగుణంగా ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ పేర్లు మార్చారు. ఓ రకంగా భారతీయీకరించారంటున్నాయి విపక్షాలు. ఎవరేమనుకున్నా భారతీయతను ప్రతిబింబించేలా మార్పులుండాలంటోంది మోడీ సర్కారు. కేంద్రంలో బలమైన సర్కారు ఉన్నప్పుడు కచ్చితంగా ఇలాంటి నిర్ణయాలుంటాయనేది మరో వాదన. గతంలో ఇందిర పాలనను కొందరు గుర్తచేస్తున్నారు. కానీ ఇందిర కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ మొత్తం దేశంలో ఉన్న వ్యవస్థల్ని సమూలంగా మార్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మోడీ ఆ పని చేస్తున్నారు.