PM MODI: ఇండియా ఎప్పటికీ ప్రతిపక్షంలోనే.. విపక్ష కూటమిపై మోదీ ఘాటు వ్యాఖ్యలు..
మణిపూర్‌లో ప్రభుత్వం వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సభ సాగడం లేదు. సభాకార్యకాలాపాలకు అంతరాయం కలుగుతుండటంతో ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదని, ప్రతిపక్షాల తీరు మారలేదని విమర్శించారు.
PM MODI: ఇండియా పేరుతో ఒక్కటైన ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదని, ప్రతిపక్షాల తీరు మారలేదని విమర్శించారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అయితే, ఒక్కరోజు కూడా సభ సజావుగా సాగలేదు. మణిపూర్ అంశం, ఢిల్లీ ఆర్డినెన్స్ వంటి వివిధ అంశాలపై ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు చేస్తూ, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.
మణిపూర్‌లో ప్రభుత్వం వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సభ సాగడం లేదు. సభాకార్యకాలాపాలకు అంతరాయం కలుగుతుండటంతో ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించేందుకు మంగళవారం పార్లమెంటు లైబ్రరీ హాల్‌లో బీజేపీపీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ చేరుకోగానే నేతలంతా చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. “ఒక లక్ష‌్యం లేకుండా ముందుకెళ్లే ప్రతిపక్షాలను ఇంతవరకు చూడలేదు. ప్రతిపక్షాలు ఇండియా అని పేరు పెట్టుకొన్నంత మాత్రాన వారి తీరు మారుతుందా..? గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్, పీఎఫ్ఐ వంటి పేర్లలో కూడా ఇండియా ఉంది. ప్రతిపక్షాలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇండియా అనే పదాన్ని ఉపయోగించాయి.
అలసిపోయి, నిస్సహాయ స్థితిలో ఉన్న ఇండియా కూటమికి ఒకటే ఎజెండా.. అదే మోదీని వ్యతిరేకించడం. సభకు ఆటంకం కలిగించడం వల్ల ప్రతిపక్షాలు ఎప్పటికీ విపక్షంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. దశా,దిశ లేకుండా ప్రతిపక్షాలు ముందుకెళ్తున్నాయి” అని మోదీ వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అవసరమైతే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాయి.