PM Vishwakarma: మోదీ చేతుల మీదుగా పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభం.. రూ.3 లక్షల రుణానికి ఎవరు అర్హులంటే..
ఈ పథకం ద్వారా అర్హులకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా మూడు లక్షల రూపాయల వరకు రుణాలను అందజేస్తుంది. మూడు లక్షలకుపైగా రుణం కావాలనుకుంటే.. నామమాత్రపు వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకం కోసం రూ.13,000 నుంచి 15,000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది.
PM Vishwakarma: ప్రధాని మోదీ తన జన్మదినం రోజున కొత్త కేంద్ర పథకాన్ని ప్రారంభించారు. సంప్రదాయ కళాకారులు, చేతివృత్తుల వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ‘పీఎం విశ్వకర్మ’ అనే పథకాన్ని ప్రారంభించారు. ఆదివారం విశ్వకర్మ జయంతి కూడా కావడంతో ఈ పథకాన్ని అమలులోకి తెచ్చారు. గత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆగష్టు 15న, ఈ పథకాన్ని ఎర్రకోట వేదికగా మోదీ ప్రకటించారు. సంప్రదాయ కళలు, కళాకారులను, చేతివృత్తుల వారిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకమిది. ఈ పథకం ద్వారా అర్హులకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా మూడు లక్షల రూపాయల వరకు రుణాలను అందజేస్తుంది. మూడు లక్షలకుపైగా రుణం కావాలనుకుంటే.. నామమాత్రపు వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. ఈ పథకం కోసం రూ.13,000 నుంచి 15,000 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది.
రుణం ఎలా పొందాలి..?
‘పీఎం విశ్వకర్మ’ పథకం కింద రుణాలను పొందాలనుకునే వారు తొలుత బయోమెట్రిక్ ఆధారిత పీఎం విశ్వకర్మ పోర్టల్‌లో లాగిన్ కావాలి. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా లబ్ధిదారులు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శిల్పులు, బుట్ట/చాప/చీపురు తయారీదారులు, స్వర్ణకారులు, పడవ తయారీదారులు, క్షురకులు, కుమ్మరి, కంసాలి, చర్మకారులు, తాపీ పనివాళ్లు, వడ్రంగి, సంప్రదాయ బొమ్మల తయారీదారులు, పూలదండల తయారీదారులు, చాకలి, టైలర్, చేపలు పట్టే వల తయారీదారులు వంటి 18 రకాల చేతివృత్తుల వాళ్లు ఈ పథకానికి అర్హులు. దీని ద్వారా రూ.3 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. అర్హులైన లబ్ధిదారులకు రుణంతోపాటు ఇతరత్రా సాయం కూడా అందుతుంది. అంటే పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్, ఐడీ కార్డు అందజేస్తారు.
స్కిల్స్ పెంచేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కూడా ఇస్తారు. అలాగే రూ.15,000 విలువైన టూల్‌కిట్ ఇన్సెన్టివ్, రూ.లక్ష వరకూ కొలేటరల్ క్రెడిట్ సపోర్ట్, ఐదు శాతం కన్సెషనల్ వడ్డీరేటుతో రూ.2 లక్షల వరకూ రుణ సదుపాయం కల్పిస్తారు. డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తారు. దేశీయ మార్కెట్‌తో పాటు, అంతర్జాతీయ వాణిజ్యం పెరిగేలా చేయూతనందిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ”మన విశ్వకర్మ పార్టనర్స్‌ను గుర్తించి, వారికి అన్ని విధాలా చేయూతనందించనున్నాం. విశ్వకర్మ పార్టనర్ల అభివృద్ధికి మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ పథకం కింద 18 వేర్వేరు రంగాల వారి అభ్యున్నతికి కృషి చేస్తాం” అని మోదీ చెప్పారు.