Cheetah: ‘మోదీజీ.. మీ పబ్లిసిటీ పిచ్చి మూడు చీతాలను చంపేసింది’! ప్రతిపక్షాల ఆరోపణలో నిజమెంత?
మూడు నెలల్లో మూడు చీతాలు చనిపోయాయి. కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి చెందడంతో బీజేపీ టార్గెట్‌గా అన్నీవైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చీతాలొచ్చేశాయ్.. అని తెగ ఆనంద పడ్డాం..!అక్కడెక్కడో దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు చీతాలోస్తే..మన ఇంట్లో వాళ్లు ఫారిన్ నుంచి వచ్చినంతా సంతోషించాం.. చీతాలను చూసి మురిసిపోయాం. చీతాలు పరిగెడుతుంటే.. మన ఇంట్లో పిల్లలే ఉరుకులు, పరుగులు తీస్తున్నాట్లు ఊహించుకున్నాం.. చీతాలు ఇక్కడ మనుగడ సాగించలేవని ముందుగానే హెచ్చరించిన వాళ్లని దేశద్రోహులన్నాం.. ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పుకున్నాం..! సీన్ కట్ చేస్తే..చీతాలు వరుస పెట్టి చనిపోతున్నాయి..! ఒకటి కాదు రెండు కాదు..మూడు నెలల వ్యవధిలో మూడు చీతాలు మరణించడం నిజంగా బాధాకరం.
ఎంతగా సెలబ్రేట్ చేసుకున్నాం.. ఇలా జరిగిందేంటి? :
మోదీ బర్త్ డే స్పెషల్ అంటూ గతేడాది సెప్టెంబర్ 17ప దేశంలోకి చీతాలు ఎంట్రీ ఇచ్చాయి. దాదాపు 70 ఏళ్ల కింద భారత్‌లో అంతరించిన చీతా జాతి మళ్లీ దేశంలోకి అడుగు పెట్టింది.తన పుట్టినరోజు సందర్భంగా స్వయంగా ప్రధాని మోదీనే వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో పార్కులోకి వదిలిపెట్టారు. నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో ఎనిమిది చీతాలను మోదీ చేతుల మీదగా నేషనల్ పార్కులోకి దూకాయి. ఇక దేశవ్యాప్తంగా ఒక్కసారిగా మోదీ భజన మొదలైంది.. మోదీ వల్లే ఇది సాధ్యమైందని కొందరు డప్పు కొట్టారు. ఆయనే ఒక చీతా అంటూ కొందరు ఎప్పటిలానే అతి చేశారు. సింహం చీతాలను పార్కులో ప్రవేశపెట్టిందంటూ ఎలివేషన్లు ఇచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ మధ్యలో దూరింది. అనసవరంగా మోదీకి క్రెడిట్లు ఇస్తున్నారని.. ఇది 2009లో మేం తీసుకున్న నిర్ణయామేనని వాదించింది. అయితే మూడు నెలల గ్యాప్‌లో మూడు చీతాలు చనిపోయిన విషయంలో మాత్రం క్రెడిట్లు తీసుకోడానికి ఏ పార్టీ ముందుకు రాకపోవడం విడ్డూరం.
ముందుగానే హెచ్చరించారు:
నిజానికి చీతాలు భారత్‌లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చినప్పటి నుంచే పర్యావరణ వేత్తలు దీనిపై అభ్యంతరం చెప్పారు. ఆ పార్కులోని స్థలం చీతాల ఆహార వేటకు సరిపోదని ముందుగానే చెప్పారు. ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన చీతాలు ఇక్కడి పార్కు వాతావరణంలో మనుగడ సాగించలేవని కూడా చెప్పారు. చీతాలకు బదులుగా అంతరించి పోయే ప్రమాదమున్న మిగిలిన జంతువులను పరిరక్షించే ప్రాజెక్టును చేపట్టడం బెటర్ అని సూచించారు కూడా..అయితే అవేమీ పట్టని కేంద్రం తన పని తాను చేసుకుపోయింది. పరోక్షంగా ఇప్పుడు మూడు చీతాల చావుకు కారణమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా మరణించిన చీతా ఇతర చీతాలతో గొడవ పడి.. ఆ ఘర్షణలో చనిపోయిందన్న ప్రచారం జరుగుతోంది.
పబ్లిసిటీ విలువ @చీతాల ప్రాణాలు:
పబ్లిసిటీ లేనిదే రోజు గడవని రాజకీయ నాయకులున్న కాలమిది. ఏం చేయాలన్న పబ్లిసిటీ మస్ట్! క్రెడిట్లు తీసుకోకపోతే ముద్ద దిగని నేతలు కూడా ఉన్నారు. ఇలాంటి లీడర్లే మనల్ని పాలిస్తున్నారన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఇటు చీతాల విషయంలో కూడా కేంద్రానికి ముందు చూపు లేదన్న విషయాన్ని అటు పర్యావరణ వేత్తలు కూడా పాయింట్ అవుట్ చేస్తున్నారు. చెప్పింది వినకుండా పబ్లిసిటీ కోసం మూగ జీవాలను చంపేశారంటూ అటు జంతు ప్రేమికులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కునో జాతీయ పార్కు వాతావరణం చీతాలకు అనుకూలమైనది కాదని జంతు శాస్త్రవేత్తల ముందుగానే హెచ్చరించినా.. అవేవీ పట్టని కేంద్రం గొప్పలకు పోయింది. ప్రాజెక్ట్ చీతా కోసం రూ.100 కోట్లు ఖర్చు పెట్టిన కేంద్రం కనీసం వాటి మనుగడ ఇక్కడ సాధ్యమా కదా అన్న విషయాన్ని ఆలోచించలేకపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.