PM Modi Tour: మోదీ టూర్… డోంట్ కేర్ అంటున్న బీఆర్ఎస్… సై అంటే సై అంటున్న పార్టీలు!

ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తుండటం పొలిటికల్ వేడిని మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో బలప్రదర్శనకు ఇటు కమలం.. అటు కారు.. సిద్ధమవుతున్నాయి. మోదీ సభను విజయవంతం చేసేందుకు కాషాయ పార్టీ రెడీ అవుతోంటే.. ఇదే రోజు సింగరేణి ప్రాంతాల్లో బీఆర్ఎస్‌ ఆందోళనకు పిలుపునిచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2023 | 01:36 PMLast Updated on: Apr 08, 2023 | 1:36 PM

Pm Modi Tour Creating Political Heat In Telangana War Between Brs And Bjp

PM Modi Tour: తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ నువ్వా.. నేనా అన్నట్లు సాగుతోంది. నేతల విమర్శలు, ప్రతి విమర్శలు, కేసులు, అరెస్టులతో తెలంగాణ అట్టుడుకుతోంది. ఇలాంటి వాతావరణంలో ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తుండటం పొలిటికల్ వేడిని మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో బలప్రదర్శనకు ఇటు కమలం.. అటు కారు.. సిద్ధమవుతున్నాయి. మోదీ సభను విజయవంతం చేసేందుకు కాషాయ పార్టీ రెడీ అవుతోంటే.. ఇదే రోజు సింగరేణి ప్రాంతాల్లో బీఆర్ఎస్‌ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత భారీ స్థాయిలో ఉందని.. మోదీ బహిరంగసభ ద్వారా అది ప్రజలకు తెలియజేస్తామని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు.

సీఎం కేసీఆర్ దూరం
వందేభారత్‌ రైలును హైదరాబాద్‌లో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో మాట్లాడతారు. ప్రధాని మోదీ అధికారిక పర్యటన చేస్తున్నా.. తెలంగాణ రాజకీయాలపై మాట్లాడుతారని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. బీఆర్ఎస్‌ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పరోక్షంగా వాగ్భాణాలు సంధించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ పర్యటనకు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు ఆహ్వానం అందినప్పటికీ ఈసారి కూడా దూరంగా ఉండనున్నారు. ప్రభుత్వం తరఫున సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. గత తేడాది నవంబర్ 12న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి.. ప్రధాని తెలంగాణకు వచ్చారు. అప్పుడు కూడా మంత్రి తలసానే మోదీకి స్వాగతం పలికారు.

PM Modi

బీఆర్ఎస్ ఆందోళన
అధికారిక కార్యక్రమాలకు ప్రొటోకాల్‌ ప్రకారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ని ఆహ్వానించారు. ప్రధాని హోదాలో ఎవరున్నా స్థానిక ప్రభుత్వాధినేతగా అధికారిక కార్యక్రమాల్లో సీఎం పాల్గొనడం సంప్రదాయంగా వస్తోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌, ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ లాంటి వీవీఐపీలు రాష్ట్రానికి వస్తే సీఎం హోదాలో స్వాగతం పలకడం ఆనవాయితీ. కానీ, రెండు పార్టీల మధ్య రాజకీయం విభేదాలు ఉండటంతో సీఎం కేసీఆర్‌ వీటికి దూరంగా ఉన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రొటోకాల్ ఉల్గంఘనకు పాల్పండింది నరేంద్రమోదీ అని గుర్తు చేశారు. కొవిడ్‌ సమయంలో తెలంగాణకు వచ్చిన మోదీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు అధికారికంగా ఆహ్వానం పంపలేదన్నారు. ప్రధానమంత్రికి స్వాగతం పలికే సాంప్రదాయాన్ని కేసీఆర్ విస్మరిస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది.

దీంతో మరోసారి బీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రోటోకాల్ రగడ మొదలైంది. మరోవైపు ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్న రోజే ఆందోళనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జంగ్‌ సైరన్‌ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతోంది గులాబీ పార్టీ. అదే సమయంలో ప్రధాని హైదరాబాద్‌ వస్తున్నారు. తెలంగాణలో ఎండల కంటే పార్టీల మధ్య మంటలే సెగలు పుట్టిస్తున్నాయ్. బీఆర్ఎస్‌, బీజేపీ మాటలయుద్ధంతో పాలిటిక్స్‌ పీక్‌ స్టేజ్‌‌కు చేరుకున్నాయి. పేపర్‌ లీక్‌లపై రెండు పార్టీలు రాజేసిన రచ్చ ఇంకా చల్లారలేదు. ఇంతలోనే ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తుండటంతో కారు, కమలం పార్టీలు బలప్రదర్శనకు రెడీ అవుతున్నాయ్. మంచిర్యాల, భూపాలపల్లి, రామగుండం కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ధర్నాలు చేయాలని సూచించారు. సింగరేణి ప్రాంతంలోని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడారు.

సింగరేణిపై కేంద్రం కుట్ర?
సింగరేణి ప్రైవేటీకరణ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని దెబ్బతీసి, తద్వారా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కరెంట్‌ లేకుండా చేయాలని కుట్ర చేస్తోందన్నది బీఆర్ఎస్‌ ఆరోపణ. తెలంగాణకు సింగరేణి ఆర్థిక, సామాజిక జీవనాడి అని.. ప్రైవేటీకరణపై వ్యతిరేకంగా జంగ్‌ సైరన్‌ మోగిస్తున్నట్లు బీఆర్ఎస్‌ ప్రకటించింది. సింగరేణి బొగ్గు గనుల వేలంపై కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో భారీ స్థాయిలో ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రాష్ర్టానికి కొంగుబంగారమైన సింగరేణిని ప్రైవేటీకరించి, తెలంగాణను దెబ్బకొట్టాలన్న దురుద్దేశంతో కేంద్రం కుట్రలు చేస్తోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. సింగరేణి సంస్థ సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారతదేశ థర్మల్‌ విద్యుదుత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందనే సంగతి ప్రధానికి తెలియదా అని ప్రశ్నిస్తోంది. కేంద్రం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలను తెలంగాణ బలంగా అడ్డుకోవడంతోనే దొడ్డిదారిలో సింగరేణిపై కన్నేసిందని బీఆర్ఎస్‌ నేతలు మండిపడుతున్నారు. ఏది ఏమైనా అటు ప్రధాని పర్యటన.. ఇటు బీఆర్ఎస్ ఆందోళనతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి.