PM Modi Vs CM Gehlot: మోదీ వర్సెస్ అశోక్ గెహ్లాట్.. రెడ్ డైరీ కాదు.. టమాటాల గురించి చూడమంటూ గెహ్లాట్ సలహా
రాజస్థాన్‌లోని సీకర్‌లో గురువారం జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ అవినీతిపై విరుచుకుపడ్డారు. ఇటీవల బయటపడ్డ రెడ్ డైరీలోని రహస్యాలు రాజస్థాన్ కాంగ్రెస్‌ను నాశనం చేయడం ఖాయమని వ్యాఖ్యానించారు.
PM Modi Vs CM Gehlot: రాజస్థాన్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా రాజకీయం సాగుతోంది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రాజస్థాన్‌లో పర్యటించిన ప్రధాని మోదీ సీఎం అశోక్ గెహ్లాట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ డైరీ వ్యవహారం కాంగ్రెస్‌ను ముంచడం ఖాయమన్నారు.
ఇటీవల రాజస్థాన్‌లో సీఎం అశోక్ గెహ్లాట్ అవినీతిపై ఆ పార్టీకి చెందిన మంత్రి ఆరోపణలు చేశారు. ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ నేతల అవినీతికి సంబంధించిన వివరాలు తన దగ్గరున్న రెడ్ డైరీలో ఉన్నాయని ఆ మంత్రి వ్యాఖ్యానించారు. దీంతో ఆ మంత్రిని తొలగించారు సీఎం. ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి కారణమైంది. రాజస్థాన్‌లోని సీకర్‌లో గురువారం జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ అవినీతిపై విరుచుకుపడ్డారు. ఇటీవల బయటపడ్డ రెడ్ డైరీలోని రహస్యాలు రాజస్థాన్ కాంగ్రెస్‌ను నాశనం చేయడం ఖాయమని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు బీజేపీ కట్టుబడి ఉందని, రాబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయమన్నారు. ఈ సభకు సీఎం కూడా హాజరు కావాల్సింది. కానీ, అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. అయితే, సభలో మోదీ చేసిన వ్యాఖ్యలపై అశోక్ గెహ్లాట్ స్పందించారు. “ప్రధాని ఒక కల్పిత రెడ్ డైరీని చూస్తున్నారు.
కానీ, అదే రెడ్ కలర్‌లో ఉన్న టమాటాలు, సిలిండర్లు కనిపించడం లేదు. ధరల భారంతో ఎర్రగా మారిపోయిన సామాన్య ప్రజల ముఖాలు కూడా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రధానికి రాజస్థాన్ ప్రజలు రెడ్ డైరీ చూపిస్తారు” అని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజస్థాన్ రాజకీయాల్లో రెడ్ డైరీ అంశం సంచలనంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ దీనిపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి.