Telangana: తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు.. ఎన్నికల వేళ ఎవరి పండుగ వారిదే.. పోటీ పడి నిర్వహిస్తున్న పార్టీలు!

ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో పార్టీలు పోటీ పడిమరీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నాయి. అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఈ వేడుకల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హైదరాబాద్‌లోనే కాకుండా నియోజకవర్గ స్థాయిలోనూ కార్యక్రమాలు నిర్వహించాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 2, 2023 | 01:42 PMLast Updated on: Jun 02, 2023 | 1:42 PM

Political Parties Celebrating Telangana Formation Day In High Mode

Telangana: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్ని ఈసారి గతంలో ఎన్నడూ లేనంత ఘనంగా నిర్వహిస్తున్నాయి పార్టీలు. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో పార్టీలు పోటీ పడిమరీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నాయి. అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఈ వేడుకల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హైదరాబాద్‌లోనే కాకుండా నియోజకవర్గ స్థాయిలోనూ కార్యక్రమాలు నిర్వహించాయి. జాతీయ పతాకావిష్కరణ, అమరులకు నివాళులు వంటి కార్యక్రమాలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
కొత్తగా ప్రారంభించిన సచివాలయంలో బీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, గోల్కొండ కోటలో బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వేడుకల్ని నిర్వహించగా, కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ దశాబ్ది వేడుకల్ని నిర్వహించింది. అన్ని పార్టీలూ తెలంగాణ ఏర్పాటు విషయంలో క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నాయి. బీఆర్ఎస్ తెలంగాణ సాధించిన పార్టీగా చెప్పుకొంటూ ఉండగా.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. మరోవైపు తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చిందనే విషయన్ని బీజేపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. జనసేన కూడా తెలంగాణ అవతరణ దినోత్సవంపై శుభాకాంక్షలు తెలిపింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో కూడా ఆవిర్భావ వేడుకలు జరగగా, ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

మొత్తానికి ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రాధాన్యం లభించింది. కారణం.. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటమే. దీంతో ప్రతి పార్టీ తెలంగాణ ఉద్యమ క్రెడిట్ కోసం ప్రయత్నిస్తోంది. వేడుకల్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ రోజు తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే హడావుడి కనిపించింది. మరోవైపు అమరులకు సరైన న్యాయం జరగలేదని శ్రీకాంతాచారి తల్లి ఆరోపించింది. ఈ వేడుకల సందర్భంగా పార్టీలన్నీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి.
తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు గర్వంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు. మరోవైపు కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ఒక కుటంబం చేతిలో బందీ అయిందని విమర్శించారు. తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనే అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సోనియమ్మ కారణంగానే తెలంగాణ ఏర్పాటైందని, ఈ ఘనత తమదేనని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. ఎలక్షన్స్ ఫీవర్‌తో పార్టీలకు తెలంగాణ ఆవిర్భావం ప్రాధాన్యం ఏంటో తెలిసొచ్చింది.