Political Posters: తెలంగాణలో పొలిటికల్ పోస్టర్స్ వార్..!

అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ పోటాపోటీగా ఇలా పోస్టర్ల వార్ సాగిస్తున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే కనిపించిన పోస్టర్లు.. ఇప్పుడు బీఆర్ఎస్ కూ పాకడంతో సరికొత్త పొలిటికల్ వార్ మొదలైందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 18, 2023 | 04:06 PMLast Updated on: Mar 18, 2023 | 4:06 PM

Political Posters Appears In Hyderabad

తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. రెండు పార్టీలూ ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు. అన్ని అంశాల్లో నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మద్యం కేసులో కవిత, TSPSC పేపర్ లీకేజ్ ఇష్యూలలో అధికార బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ ఎలా వాడుకుంటోందో చెప్పే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. రెండు పార్టీలూ బహిరంగంగానే కాక సోషల్ మీడియాలో ఈ అంశాలపై ఫైట్ చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రెండు పార్టీల ఫ్లెక్సీలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

ఢిల్లీ మద్యం కేసులో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈడీ విచారణకోసం ఢిల్లీ వెళ్లిన సమయంలో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోస్టర్లు, హోర్డింగులు వెలిశాయి. అప్పట్లో ఇవి సంచలనం కలిగించాయి. ఇప్పుడు మరోసారి భాగ్యనగరంలో పొలిటికల్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోస్టర్లు వెలిశాయి. వీటిని బీఆర్ఎస్ వర్గాలే ఏర్పాటు చేశాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే కవితకు వ్యతిరేకంగా కూడా పోస్టర్లు దర్శనమీయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బేగంపేటలోని మెట్రో పిల్లర్లపై కవితకు వ్యతిరేకంగా ఈ పోస్టర్లు కనిపించాయి. కల్వకుంట్ల దొంగల ముఠా.. కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేసీఆర్.., కవిత అంటే పద్యం అనుకుంటివా.. లే.. మద్యం.. కవితక్కా నీకు కావాలి సారా దందాలో 33శాతం వాటా.. దానికోసమే ఆడుతున్నావ్ 33 శాతం మహిళా రిజర్వేషన్ ఆట… తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకుని ఢిల్లీలో కవితక్క చేస్తోంది దొంగ సారా దందా.. అని వివిధ రంగుల్లో పోస్టర్లు వెలిశాయి. ఇది కచ్చితంగా బీజేపీ పనే అని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ పోటాపోటీగా ఇలా పోస్టర్ల వార్ సాగిస్తున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే కనిపించిన పోస్టర్లు.. ఇప్పుడు బీఆర్ఎస్ కూ పాకడంతో సరికొత్త పొలిటికల్ వార్ మొదలైందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. అయితే ఈ పోస్టర్లలో ఎక్కడా ఎవరు వీటిని వేస్తున్నారో ప్రకటించలేదు. పేర్లు లేకుండా ఇరు పార్టీలూ జాగ్రత్త పడుతున్నాయి.