POLL MANAGEMENT: తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ సరే..! అసలు సంగతి ఆలోచించారా..?
పోల్ మేనేజ్ మెంట్ కోసం ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జులు ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంటారు. ఈమధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అయితే.. ఈ పోల్ మేనేజ్‌మెంట్ చాలా పకడ్బందీగా అమలు చేసింది బీఆర్ఎస్.
POLL MANAGEMENT: ఏ సర్వే చూసినా.. ఏ నలుగురు మాట్లాడుకున్నా ఒకటే మాట.. కాంగ్రెస్ పుంజుకుంది.. ఈసారి అధికారంలోకి వస్తుందన్న ఊహాగానాలే. కాంగ్రెస్ లీడర్లు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. రాష్ట్రమంతటా నియోజకవర్గాల్లో గట్టిగా ప్రచారం చేస్తున్నారు. తమ గెలుపు గ్యారెంటీ అని బాగా నమ్మకం పెట్టుకున్నారు. కానీ అసలు సంగతి మర్చిపోయారు. దాని మీద ఏ మాత్రం దృష్టిపెట్టకపోయినా.. కాంగ్రెస్ ఆశలు అడియాసలు అయినట్టే. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగబోతున్నాయి.
REVANTH REDDY: పదేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదు: రేవంత్ రెడ్డి
గత రెండు సార్లుగా బీఆర్ఎస్ అధికారంలో కొనసాగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తుంది. క్లాస్, మాస్.. తటస్థులు ఎవరినైనా కలుపుకుపోయేలా పోలింగ్ బూత్ లెవల్లోనే ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ పోల్ మేనేజ్ మెంట్ కోసం ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జులు ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంటారు. ఈమధ్య జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అయితే.. ఈ పోల్ మేనేజ్‌మెంట్ చాలా పకడ్బందీగా అమలు చేసింది బీఆర్ఎస్. 100 గ్రామాలకు 100 మంది లీడర్లను రంగంలోకి దించింది. సరే.. ఇప్పుడు రాష్ట్రమంతటా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి.. ఇలా పెద్ద సంఖ్యలో లీడర్లను అన్ని చోట్లా మోహరించలేని పరిస్థితి ఉంది. పోల్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా.. ఏ బూత్‌లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే వివరాలు సేకరిస్తారు. తర్వాత ఆ బూత్‌లోని ఓటర్ల లిస్టులో పేజీల వారీగా ఓటర్లను విభజించుకుంటారు బీఆర్ఎస్ లీడర్లు. ఒక్కో పేజీకి ఒక్కో లీడర్ బాధ్యత వహిస్తాడు. గతంలో గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ కూడా ఇలాగే పన్నా ప్రముఖ్ పేరుతో పకడ్బందీగా వ్యూహరచన చేసింది. ఇలా పేజీల వారీగా ఓటర్లను పంచుకొని.. వాళ్ళని పోలింగ్ తేదీ నాడు బూత్‌ల దాకా తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తారు.
ఎవరూ మిస్ కాకుండా ముందు నుంచే ఫాలో అప్ చేస్తుంటారు. హైదరాబాద్ లేదా మరో చోట ఉన్న వాళ్ళని కూడా ఛార్జీలు పెట్టి, ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మరీ రప్పించుకుంటారు. ఇలాంటి వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే కాదు.. ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లోనూ బీఆర్ఎస్ ఫాలో అవుతోంది. వేవ్ ఉంది.. వేవ్ ఉంది.. మేమే అధికారంలోకి వస్తున్నాం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కి ఇలాంటి బలమైన పోల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఉందా అంటే డౌటే. ఓటర్లను ఫాలో అప్ చేసుకొని.. పోలింగ్ బూత్ దాకా తెచ్చే కేడర్‌ను గ్రామస్థాయిలో పెట్టుకోకపోతే కాంగ్రెస్ ఆశలు అడియాసలు అయ్యే అవకాశాలున్నాయి. నిజానికి గ్రామస్థాయిలో కూడా కాంగ్రెస్‌కి బలమైన కేడర్ ఉంది. కానీ వాళ్ళను ఎవరు మేనేజ్ చేయాలి..? BRSలో అంటే.. అధిష్టానం లెవల్లోనే ఈ ఏర్పాట్లు చేస్తారు. కానీ కాంగ్రెస్‌లో ఏ నియోజకవర్గానికి అక్కడి అభ్యర్థే అన్నీ చూసుకోవాలి. సెకండ్ లెవల్ లీడర్ల నుంచి గ్రామస్థాయి, బూత్ లెవల్ దాకా ఇంఛార్జులను పెట్టుకోవాలి.
వీళ్ళల్లో టిక్కెట్ రాలేదని అసంతృప్తిగా ఉన్న నేతలు, వారి కేడర్.. పనిచేస్తున్నట్టు నటిస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. అసలే ఎన్నికలకు ఎంతో టైమ్ లేదు. మొన్న మొన్నటి దాకా టిక్కెట్లు, బీఫామ్స్ తెచ్చుకోడానికే టైమ్ సరిపోయింది. ఇప్పుడిప్పుడే నియోజకవర్గంలో ఓటర్లను కలుస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థులు. మరి ఈ పోల్ మేనేజ్‌మెంట్ గురించి ఆలోచించే టైమ్ ఉందా వాళ్ళకు. ఒక వేళ ఆలోచించినా ప్రాక్టికల్‌గా ఎంత వరకూ వర్కవుట్ అవుతుందన్నది సందేహమే. అందుకే తెలంగాణలో వేవ్ ఉంది అనుకున్నంత మాత్రాన సరిపోదు. ఆ వేవ్‌ని క్యాష్ చేసుకునే బూత్ లెవల్ పోల్ మేనేజ్‌మెంట్ కూడా కావాలి మరి. ఈ కోణంలో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుందా అన్నది చూడాలి.