Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి.. ఖమ్మంలో రాహుల్ సమక్షంలో చేరిక.. ముహూర్తం ఖరారు!
అందరూ అనుకున్నట్లుగానే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అక్కడ కాంగ్రెస్ సాధించిన విజయం.. బీజేపీ ఓటమి ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసింది.
Ponguleti Srinivasa Reddy: పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరతారు అంటూ ఇంతకాలం జరిగిన చర్చకు తెరపడింది. ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. అందరూ అనుకున్నట్లుగానే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం జూపల్లి, పొంగులేటి కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అక్కడ కాంగ్రెస్ సాధించిన విజయం.. బీజేపీ ఓటమి ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసింది. ఈ నెల 20 లేదా 25న ఖమ్మంలో రాహుల్ గాంధీ బహిరంగ సభ జరుగుతుంది.
ఈ సభలోనే పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకొంటారు. ఇది కచ్చితంగా తెలంగాణలో బీజేపీకి ఎదురుదెబ్బగానే చెప్పాలి. కొంతకాలంగా పొంగులేటి, జూపల్లి చేరిక గురించి తీవ్ర చర్చ జరిగింది. కాంగ్రెస్‌లో చేరతారని ఒకసారి.. బీజేపీలో చేరతారని మరోసారి.. ఇలా ప్రచారం జరిగింది. ఇరు పార్టీలకు చెందిన నేతలతోనూ జూపల్లి, పొంగులేటి చర్చలు జరిపారు. ఇటీవల బీజేపీ తరఫున ఈటల కూడా చర్చించారు. కానీ, వీళ్లు మాత్రం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. కర్ణాటక ఫలితాల నేపథ్యంలో బీజేపీ బలహీనపడుతోంది. కాంగ్రెస్ పుంజుకుంటోంది. పైగా వీళ్లిద్దరి జిల్లా అయిన ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉంది. అసలు బీజేపీకి పెద్దగా పట్టులేదు. దీంతో బీజేపీలో చేరడం కంటే.. బలపడుతున్న కాంగ్రెస్‌లో చేరితేనే మంచిది అని ఇద్దరూ ఒక నిర్ణయానికొచ్చారు. వీళ్లకు అవసరమైతే కమ్యూనిస్టులు కూడా తోడయ్యే అవకాశాల్ని కొట్టిపారేయలేం.
చాలా కాలం నుంచి పొంగులేటి, జూపల్లిని తమ పార్టీలో చేర్చుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నిస్తున్నార. రేవంత్ రెడ్డితోపాటు ఇతర నేతలు కూడా ఇదే అంశంపై పలుసార్లు చర్చలు జరిపారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం వీరి చేరికకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెలలోనే కాంగ్రెస్‌లో చేరేందుకు ఇద్దరూ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 20 లేదా 25న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ, ఇతర నేతల సమక్షంలో ఇరువురూ పార్టీలో చేరుతారు. ఈ విషయంపై ఇద్దరూ తమ అనుచరులకు ఇప్పటికే సమాచారం అందించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఇండియా తిరిగొచ్చిన తర్వాత ఖమ్మం సభపై నిర్ణయం తీసుకుంటారు.
బీజేపీకి షాక్!
పొంగులేటి, జూపల్లిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఇది గట్టి షాక్ అనే చెప్పాలి. మొన్నటిదాకా బలంగా కనిపించిన బీజేపీ.. కర్ణాటక ఫలితాలతో డీలా పడినట్లు కనిపిస్తోంది. అంతకుముందు వరకు బీజేపీవైపు చూసిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇటీవలి కాలంలో బీజేపీలో పేరున్న నేతలెవరూ చేరలేదు. తెలంగాణలో ఎన్నికలు మరో ఆరు నెలలే ఉన్న నేపథ్యంలో పెద్ద నేతలు చేరితేనే బీజేపీ బలపడే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఎవరూ బీజేపీలో చేరేందుకు సిద్ధంగా లేరు. పైగా పార్టీలో ఉన్న వాళ్లైనా ఎన్నికల దాకా ఉంటారా.. అంటే అనుమానమే. దీంతో చాలా మంది బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పొంగులేటి ఖమ్మంలో బలమైన నేత. ఆర్థికంగా కూడా పార్టీకి అండగా నిలబడగలడు. జూపల్లికి రాజకీయ అనుభవం ఉంది. ఆర్థికంగానూ బాగున్నారు. అలాంటిది వీళ్లిద్దరూ బీజేపీలో చేరితే ఆ పార్టీ మరింత బలపడేది. కానీ, కాంగ్రెస్ వైపు వెళ్తుండటంతో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. పొంగులేటి, జూపల్లి చేరికతో కాంగ్రెస్ మరింత బలపడే అవకాశం ఉంది. మరింతమంది బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది.