Ponguleti Srinivasa Reddy: పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..
ఈ నెల 25న వీరు కాంగ్రెస్‌లో చేరాల్సింది. ఖమ్మంలో భారీ సభ నిర్వహించి, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలనుకున్నారు. రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడంతోపాటు వివిధ కారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు వచ్చే నెల 2న ఈ ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.
Ponguleti Srinivasa Reddy: పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జూపల్లి.. అనేక చర్చోపచర్చల తర్వాత కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. నిజానికి ఈ నెల 25న వీరు కాంగ్రెస్‌లో చేరాల్సింది. ఖమ్మంలో భారీ సభ నిర్వహించి, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలనుకున్నారు. రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడంతోపాటు వివిధ కారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. చివరకు వచ్చే నెల 2న ఈ ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.
జూలై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. రాహుల్ గాంధీ ఈ సభకు హాజరవుతారు. ఆయన సమక్షంలో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకొంటారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం (జూన్ 21) పొంగులేటి ఇంటికి వెళ్తున్నారు. హైదరాబాద్‌లోని పొంగులేటి నివాసానికి రేవంత్ వెళ్లి, ఆయనతో చర్చలు జరుపుతారు. పొంగులేటిని రేవంత్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారు. అనంతరం జూపల్లి ఇంటికి కూడా రేవంత్ వెళ్తారు. ఈ నెల 25న రాహుల్‌తో పొంగులేటి భేటీ అవుతారు. ఇద్దరినీ రేవంత్ ఢిల్లీ తీసుకెళ్తారు. అక్కడ రాహుల్‌తో చర్చించిన తర్వాత ఈ అంశంపై ఇద్దరి నుంచి ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.
భారీ సభకు ఏర్పాట్లు
ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పొంగులేటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. జూలై 2న జరిగే సభలో పొంగులేటి, జూపల్లితోపాటు.. పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు జడ్పీ చైర్మన్లు, సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరుతారు. వ్యాపారవేత్త అయిన పొంగులేటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టుంది. జూపల్లికి మహబూబ్ నగర్ జిల్లా నేతగా రాజకీయ అనుభవం ఉంది. గతంలో మంత్రిగానూ పని చేశారు. రెండు జిల్లాల్లో కీలకమైన నేతలు పార్టీలో చేరడంతో కాంగ్రెస్ మరింతగా బలపడే అవకాశం ఉంది. వీరిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ కూడా ప్రయత్నాలు చేసింది. అయితే, ఇద్దరూ కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపారు. గతంలో ఇద్దరూ బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. అయితే, వీరికి పార్టీ ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆ పార్టీపై తిరుగుబాటు చేశారు. చివరకు బీఆర్ఎస్ తమ పార్టీ నుంచి ఇటీవలే సస్పెండ్ చేసింది. దీంతో కాంగ్రెస్ బాటపట్టారు.