Ponguleti Srinivas Reddy: పొంగులేటి అనూహ్య నిర్ణయం.. బీజేపీ, కాంగ్రెస్‌కు బిగ్ షాక్!
పొంగులేటి కీలక నిర్ణయం తీసుకున్నారంటూ మరో కొత్త ప్రచారం తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. బీజేపీలోకి వెళ్తారని ఒకసారి.. కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అయిందని మరోసారి ప్రచారం జరుగుతున్న వేళ రెండు పార్టీలకు ఝలక్ ఇచ్చేలా పొంగులేటి నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జోరందుకుంది.
Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు ఇద్దరి చుట్టే తిరుగుతోంది. వాళ్లే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. ఇద్దరూ ఎక్కడికి వెళ్తారు? ఏ పార్టీ ఇద్దరిని దగ్గర చేసుకుంటుంది? అనే చర్చ సాగుతోంది కొన్ని రోజులుగా! జూపల్లి చుట్టూ రాజకీయం తిరుగుతుంటే.. పొంగులేటి మాత్రం రాజకీయాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇదే అవకాశం అనుకున్నారో.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారో కానీ.. పొలిటికల్ అటెన్షన్ అంతా తన మీదే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు పొంగులేటి.
నెక్ట్స్ ఏ పార్టీలో చేరుతున్నారన్న దానిపై లీక్‌లు ఇస్తూ అందరి అటెన్షన్ తన మీదే ఉండేలా చూస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య.. పొంగులేటి కీలక నిర్ణయం తీసుకున్నారంటూ.. మరో కొత్త ప్రచారం తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. బీజేపీలోకి వెళ్తారని ఒకసారి.. కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అయిందని మరోసారి.. ఇలా పొంగులేటి భవిష్యత్ అడుగులపై జరుగుతున్న డిస్కషన్ అంతా ఇంతా కాదు. ఐతే ఈ రెండు పార్టీలకు ఝలక్ ఇచ్చేలా పొంగులేటి నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జోరందుకుంది. అనుచరుల అభిప్రాయం మేరకే తన నిర్ణయం ఉంటుందని పదేపదే చెప్తున్న పొంగులేటి.. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోజుకో నియోజకవర్గం చొప్పున ప్రతీ గ్రామంలోనూ పర్యటిస్తూ అనుచరుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లో పొంగులేటి చేరడం అనుచరులకు ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. దీంతో పొంగులేటి ఏ పార్టీలో చేరే అవకాశాలు లేవనే చర్చ జరుగుతోంది. తానే కొత్త పార్టీ ఏర్పాటు చేసే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది.
తెలంగాణ నుంచి ఈ మధ్యే ఒక కొత్త పార్టీ ఎన్నికల కమిషన్ దగ్గర రిజిష్టర్ అయింది. ఆ పార్టీ పేరు తెలంగాణ రైతు సమాఖ్య. షార్ట్‌కట్‌లో చెప్పాలంటే టీఆర్ఎస్.. అంటే బీఆర్ఎస్ పార్టీ పాత పేరు. తెలంగాణ రైతు సమాఖ్య.. టీఆర్ఎస్ పేరును పొంగులేటి అనుచరులే రిజిష్టర్ చేయించారని టాక్. ఇదే పార్టీని ఫైనల్ చేసి.. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 45నియోజకవర్గాలలో తన అనుచరులను ఎన్నికల బరిలోకి దించాలని పొంగులేటి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలవారీగా పొంగులేటి సమీక్షలు నిర్వహించారు. మే 15న అనుచరులతో మరోసారి సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఆ మీటింగ్‌లో తన రాజకీయ ప్రయాణం, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే.. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త పార్టీని లాంచ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇదే జరిగితే.. బీజేపీ, కాంగ్రెస్‌కు భారీ షాక్ తగలడం ఖాయం. అనుచరులపరంగా, ఆర్థికంగా.. పొంగులేటి సూపర్‌స్ట్రాంగ్. ఆయనను పార్టీలో చేర్చుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలం పెంచుకోవాలని బీజేపీ ప్లాన్ చేసింది. చేరికల కమిటీ చైర్మన్ ఈటల.. ఓ పెద్ద బ్యాచ్ వేసుకొని వెళ్లి మరీ పొంగులేటిని కలిసివచ్చారు. దీంతో పొంగులేటి బీజేపీలో చేరడం ఖాయం అని లెక్కలు కూడా వేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన కొత్త పార్టీ అంటే.. బీజేపీకి ఝలక్ ఖాయం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు కూడా నష్టమే ! ఓట్లు చీలిపోయి.. ఉన్న సీట్లు నెగ్గడం కూడా హస్తం పార్టీకి కష్టం అవడం ఖాయం.