పోరాటాలే పొన్నం ప్రభాకర్ ఊపిరి, ఎన్ఎస్ యుఐ టు రవాణా శాఖ మంత్రి
మూడున్నర దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ అనుబంధం...అంచెలంచెలుగా ఎదిగారు. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా రాణించాడు. పార్టీలో గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
మూడున్నర దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ అనుబంధం…అంచెలంచెలుగా ఎదిగారు. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా రాణించాడు. పార్టీలో గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి అడుగులోనే ఏకంగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. సొంత పార్టీ ఎంపీలే కుల్లుకునేలా…ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ గా పని చేశారు. ఆయనెవరో కాదు…ప్రస్తుత రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ పార్టీతో 35 ఏళ్లకుపైగా అనుబంధం ఉంది. ఇంతింతై వటుడింతై అన్నట్లు కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ రాజకీయాల్లో ఎదిగారు. 1987లో NSUI ద్వారా హస్తం పార్టీతో బంధాన్ని ఏర్పరచుకున్నారు. 1987-1988 మధ్యకాలంలో కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలలో…చదువుకునే రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత NSUI అధ్యక్షుడిగా పని చేశారు. అదే సమయంలో 1987-1989 మధ్యకాలంలో NSUI జిల్లా ప్రధాన కార్యదర్శిగా, కరీంనగర్ జిల్లా కళాశాలల కన్వీనర్ గా పనిచేశారు. 1989-1991 మధ్యకాలంలో ఎన్ఎస్ యుఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1992-1998 మధ్యకాలంలో NSUI జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టారు. తెలుగుదేశం పార్టీ హయాంలో…విద్యార్థుల సమస్యలపై అవిశ్రాంతంగా పోరాటం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడంలో సక్సెస్ అయ్యారు. పొన్నం పనితనాన్ని గుర్తించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ…1999-2002 మధ్యకాలంలో NSUI రాష్ట్ర అధ్యక్షున్ని చేసింది. అక్కడి నుంచి పొన్నం ప్రభాకర్ వెనుదిరిగి చూసుకోలేదు.
2002లో విద్యార్థి సంఘం నుంచి యువజన కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు పొన్నం ప్రభాకర్. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా పని చేశారు. ఇక్కడ కూడా తన పని తీరుతో అధిష్ఠానం నుంచి అభినందనలు అందుకున్నారు. 2002-2004 మధ్యకాలంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ సమన్వయకర్తగా వ్యవహరించారు. 2004లో అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించినా రాలేదు. అలా అని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేయలేదు. పొన్నం ప్రభాకర్ పోరాటాలను…అంకితభావాన్ని గుర్తించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి…2005లో ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ గా నియమించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే ఫలితం ఉంటుందనడానికి…పొన్నం ప్రభాకర్ జీవితమే నిదర్శనం. 2009లో లోక్‌సభకు పోటీచేసే వరకు డిసిఎంఎస్ అధ్యక్షుడుగా పని చేశారు.
ఐదేళ్లు గడచిన తర్వాత అసెంబ్లీ కాదు…ఏకంగా పార్లమెంట్ సీటు వెతుక్కుంటూ వచ్చింది. ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. 2009-2014 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్‌గా పని చేశారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ నుంచి ఎంపీగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడు పొన్నం. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసినా…ఆయన్ను పరాజయాలే పలుకరించాయి. అయినప్పటికి వెనుకంజ వేయలేదు. రాజకీయాల నుంచి తప్పుకోలేదు. కాంగ్రెస్ పార్టీనే ప్రాణంగా జీవించారు. 2018 సెప్టెంబరులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నిమమితులయ్యారు. 2023లో హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి…తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 35 ఏళ్లకుపైగా కాంగ్రెస్ లో ఉన్న పొన్నం…ఏనాడు పదవుల కోసం పని చేయలేదు. పార్టీ కోసం పని చేశారు. కష్టేఫలి అన్నది పొన్నం ప్రభాకర్ సిద్ధాంతం.