UNDI POWER FIGHT : ఉండిలో పవర్ ఫైట్.. RRR, పీవీఎల్, శివరామరాజు

ఏపీ హాట్ సీట్లల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ రఘు రామకృష్ణ రాజు పోటీలో ఉండటమే ఇందుక్కారణం. బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ సీటుకు పోటీ చేయాల్సిన RRR… అత్యంత నాటకీయ పరిస్థితుల్లో చివరి నిమిషంలో టీడీపీలో అసెంబ్లీ సీటు దక్కించుకున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి ఎంపీగా నిలబడిన రాఘురామ... జగన్ పై నిత్యం తూటాలు పేలుస్తూ వార్తల్లో నిలిచారు. వైసీపీ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేయడం... టార్చర్ పెట్టడం లాంటి సంఘటనలు జరిగాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 9, 2024 | 02:00 PMLast Updated on: May 09, 2024 | 2:00 PM

Power Fight In Undi Constituency Rrr Pvl Sivaramaraju

ఏపీ హాట్ సీట్లల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ రఘు రామకృష్ణ రాజు పోటీలో ఉండటమే ఇందుక్కారణం. బీజేపీ నుంచి నరసాపురం ఎంపీ సీటుకు పోటీ చేయాల్సిన RRR… అత్యంత నాటకీయ పరిస్థితుల్లో చివరి నిమిషంలో టీడీపీలో అసెంబ్లీ సీటు దక్కించుకున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి ఎంపీగా నిలబడిన రాఘురామ… జగన్ పై నిత్యం తూటాలు పేలుస్తూ వార్తల్లో నిలిచారు. వైసీపీ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేయడం… టార్చర్ పెట్టడం లాంటి సంఘటనలు జరిగాయి. అయితే ఉండిలో అధికార వైసీపీ… తమ పార్టీ అభ్యర్థి పీవీఎల్ కంటే… టీడీపీ రెబల్ అభ్యర్థి శివరామరాజుకే ఎక్కువ ప్రోత్సాహం ఇస్తోంది. టీడీపీ కంచుకోట ఉండిలో ఆ పార్టీ ఓట్లు చీల్చాలని చూస్తోంది. RRR, పీవీఎల్, శివరామరాజు మధ్య ఉండిలో పవర్ ఫైట్ ఎలా ఉండబోతుంది… చూద్దాం.

ఏపీలో టీడీపీ కంచుకోటల్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఒకటి. ఈసారి ఇక్కడ త్రిముఖ పోటీ నడుస్తోంది. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి రఘురామ కృష్ణరాజు పోటీలో ఉన్నారు. YCP తరపున పీవీఎల్ నరసింహరాజు, టీడీపీ టిక్కెట్ ఆశించి విఫలమైన మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ఇండియన్ ఫార్వార్డ్ బ్లాక్ నుంచి బరిలో ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 24 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. నియోజకవర్గంలో ఉండి, ఆకివీడు, పాలకోడేరు, కాళ్ళ మండలాలు ఉన్నాయి. కీలక సామాజిక వర్గాల్లో కాపులదే పైచేయి. 46 వేల ఓట్లు కాపు వర్గానికి ఉంటే… శెట్టి బలిజలు 28 వేలు, క్షత్రియలు 24 వేలు, ఎస్సీలు 28 వేలు, తూర్పు కాపులు 22 వేల ఓట్లు ఉన్నాయి.

గతంలో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘు రామకృష్ణ రాజు ఇప్పుడు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ తరపున బరిలో ఉన్నారు. సీఎం జగన్ అవినీతి, అక్రమాలపై పోరాడుతూ రెబల్ గా మారిన రఘురామ… బీజేపీలో చేరి మళ్ళీ నరసాపురం లోక్ సభ సీటుకు పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ బీజేపీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వలేదు. RRR తరపున టీడీపీ నాయకత్వం పైరవీ చేసినా… వర్కవుట్ కాలేదు. దాంతో టీడీపీ RRR ను ఉండి అసెంబ్లీ నుంచి నిలబెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఒప్పించి ఈ టిక్కెట్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జనసేన, బీజేపీ అండతో ఉండి అసెంబ్లీ బరిలో ఉన్నారు RRR. ఉండికి చెందిన మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు టీడీపీ రెబల్ అభ్యర్థి. టిక్కెట్ ఆశించి భంగపడిన ఆయన మొదట వైసీపీలో చేరాలని అనుకున్నారు. సీఎం జగన్ ను కూడా కలిశారు. కానీ టీడీపీ ఓట్లు చీల్చడానికి ఆయన్ని స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచించింది. దాంతో శివరామరాజు ఇండియన్ ఫార్వార్డ్ బ్లాక్ నుంచి బరిలోకి దిగారు. వైసీపీ నుంచి పీవీఎల్ నరసింహరాజు నిలబడ్డారు.

ఉండి నియోజకవర్గం ఆక్వా రంగానికి ప్రసిద్ధి. నాలుగు మండలాల్లో కూడా చేపలు చెరువులు ఉన్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగానికి అనుకున్న స్థాయిలో ప్రోత్సాహం రాలేదని స్థానికులు చెబుతారు. మేత ధరలు పెరిగిపోవడం, విద్యుత్ ఛార్జీల మోత, పెట్టుబడులు తడిసిమోపెడు అవడంతో రొయ్య సాగు గిట్టుబాటు అవడం లేదు. దాంతో రైతుల చాలామంది నష్టపోయారు. ఉండిలో కాలువలు, డ్రైయిన్లను పునరుద్ధరణ చేయకపోవడం, మంచినీటికి జనం ఇబ్బందులు లాంటి సమస్యలు ఉన్నాయి.

ఫార్వార్డ్ బ్లాక్ నుంచి నిలబడ్డ టీడీపీ రెబల్ అభ్యర్థి శివరామరాజు ఎవరి ఓట్లు చీలుస్తాడన్నది ఉత్కంఠగా మారింది. ఆయన ఉండి నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో టీడీపీ ఓట్లు చీలుతాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ కు పక్కలో బల్లెంలా తయారైన రఘురామ రాజును ఎలాగైనా ఓడించాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికార పార్టీ అభ్యర్థి నరసింహరాజు పెద్దగా ప్రచారం చేయడం లేదని అంటున్నారు. అభ్యర్థుల బలా బలాలు పరిశీలిస్తే… టీడీపీ అభ్యర్థి రఘురామరాజుకు ఉండిలో ఆ పార్టీ ఓట్ బ్యాంక్ బాగా కలిసొస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు మద్దతు కూడా ఉండటం ప్లస్ పాయింట్. గతంలో జగన్ ప్రభుత్వం RRRను వేధించడంతో జనంలో కొంత సానుభూతి ఉంది. అయితే రఘురామ రాజుకు టీడీపీ ఆలస్యంగా టిక్కెట్ ప్రకటించింది. దీనికితోడు వైసీపీ ఇబ్బందులు తట్టుకోలేక నాలుగేళ్ళుగా ఆయన ఢిల్లీ, హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. స్థానికంగా లేకపోవడం… కొంత మైనస్ అయ్యే ఛాన్సుంది.

వైసీపీ అభ్యర్థి నరసింహరాజు… సౌమ్యడు అని పేరుంది. ఆర్థికంగా ఉన్న వ్యక్తి. కానీ జనంలోకి రాడని అంటారు. పేరుకు వైసీపీ టిక్కెట్ ఇచ్చినా… ఆయనకు పెద్దగా ప్రోత్సాహం లభించడంలేదు. టీడీపీ రెబల్ కేండిడేట్ శివరామరాజును ప్రోత్సహిస్తోంది. శివరామరాజు బలాలు, బలహీనతలు చూస్తే… ఉండిలో వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా ఆయన సేవా కార్యక్రమాలు చేశారు. అందరితో కలిసిపోతారన్న పేరుంది. పైగా రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శివరామరాజుకు కలిసొచ్చే ఛాన్సుంది. కాకపోతే నాలుగేళ్ళుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో వైసీపీని సంప్రదించడం… టీడీపీ ఓట్లు చీల్చేందుకే బరిలో నిలవడం… ఉండి ప్రజలు గమనిస్తున్నారు. ఓట్లు చీల్చడం ద్వారా రఘురామను ఓడించడమే లక్ష్యంగా… జగన్ అండతో పోటీకి దిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.

జగన్ పై విమర్శలతో నిత్యం వార్తల్లో ఉండే రఘురామకృష్ణ రాజును ఉండి జనం గెలిపిస్తారా ? ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తే… ఆయన అన్నట్టుగా నిజంగా అసెంబ్లీ స్పీకర్ అవుతారా ? ఉండిలో ఓట్లు చీలిపోయి… వైసీపీ లేదా టీడీపీ రెబల్ అభ్యర్థిల్లో ఎవరైనా విజయం సాధిస్తారా అన్నది చూడాలి.