Top story: హరీష్ పని ఫినిష్, పూర్తిగా తొక్కేసిన కేసీఆర్
ఒకప్పుడు ఆయన గులాబీ పార్టీలో క్రైసిస్ మేనేజర్. పార్టీలో ఏ సంక్షోభం వచ్చినా ఆయన పరిగెత్తుకు రావాల్సిందే. మనసులో ఎంత క్షోభ ఉన్నా.. పార్టీ విధానాల కోసం చావడానికి సిద్ధమయ్యే పొలిటీషియన్.
ఒకప్పుడు ఆయన గులాబీ పార్టీలో క్రైసిస్ మేనేజర్. పార్టీలో ఏ సంక్షోభం వచ్చినా ఆయన పరిగెత్తుకు రావాల్సిందే. మనసులో ఎంత క్షోభ ఉన్నా.. పార్టీ విధానాల కోసం చావడానికి సిద్ధమయ్యే పొలిటీషియన్. అలాంటి వాడు తెలంగాణ రాజకీయ యవనికపై ఉనికి కోసం కిందా మీదా పడుతున్నాడు. భాయ్ సాబ్ నా ప్రెస్‌మీట్ కాస్త ఇవ్వండి అంటూ మీడియా వాళ్లను బతిమాలుతున్నాడు. ఎప్పటికైనా తెలంగాణ సీఎం అవుతానని కలలు కన్నవాడిని ఎందుకు కేసీఆర్, కేటీఆర్ కలిసి తొక్కేస్తున్నారు ?
రాజకీయాల్లో శతృవులు ఎదురుగా ఉండరు. పక్కనే ఉంటారు. ఈ సూత్రం భారత రాజకీయాల్లో ఎన్నోసార్లు రుజువయ్యింది. 1995 లో ఎన్టీఆర్‌ని చంద్రబాబు వెన్నుపోటు పొడవడాన్ని చూసిన కేసీఆర్ అదే ప్రమాదం తనకు రాకుండా అడుగడుగునా జాగ్రత్త పడుతూ వచ్చాడు. తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం మేనల్లుడు తన్నీరు హరీష్ రావును వెన్నంటే పెట్టుకున్నాడు. ఉద్యమానికి కావాల్సిన నిధులు, వ్యూహాలు, చేరికలు అన్నీ హరీషే చేసేవాడు. 2004 లో కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు మంత్రి కూడా అయ్యాడు. రాజకీయం రుచి మరిగిన వాడు కావడంతో.. జనం మనిషిగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. హరీష్ రావు వచ్చాడు అంటే సిద్దిపేటలో కోళ్లు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేంత ప్రచారం చేసుకున్నాడు. అందరినీ మర్యాదగా అన్నా అని పిలుస్తూ మాటలతో ఆకట్టుకున్నాడు. కేసీఆర్ , కేటీఆర్, కవిత అహంకారంతో పోల్చినప్పుడు హరీష్ చాలా సౌమ్యుడిగా అనిపిస్తాడు. కానీ వాళ్ల ముగ్గురి కంటే హరీషే ప్రమాదకారి అని బాగా దగ్గర వాళ్లు అంటారు. అందుకే హరీష్‌కి సమాంతరంగా కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత, సంతోస్‌రావు లను పెంచి పోషించాడు. 2014 నుంచి 2018 వరకు హరీష్ మాట పార్టీలో, ప్రభుత్వంలో బాగా నడిచింది.
హరీష్.. ఈటెల రాజేందర్, కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లతో కలిసి ఆర్థికంగా బాగా ఎదుగుతున్నాడని వేల కోట్లు సంపాదించాడని కేసీఆర్‌కి సమాచారం ఉంది. పైకి పార్టీకి, మేనమామకి విధేయుడిగా ఉన్నట్టు కనిపించినా.. తెలంగాణ పాలిటిక్స్‌లో సమాంతర శక్తిగా ఎదిగిపోయాడు హరీష్ రావు. ఇదే కేసీఆర్‌కి ఇదే కేసీఆర్ కాళ్లో ముళ్లు గుచ్చుకుటోంది. 2018 లో రెండో సారి ప్రభుత్వం ఏర్పడ్డాక హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వలేదు. పైగా కేటీఆర్‌ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు. హరీష్ ఫోన్‌పై నిఘా పెట్టాడు కేసీఆర్. ఈటెల రాజేందర్, హరీష్ తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారనే పక్కా సమాచారంతో హరీష్‌కి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చాడు కేసీఆర్. ఇరిగేషన్ మంత్రిగా హరీష్ ఆర్థికంగా ఎక్కడికో ఎదిగిపోయాడని బినామీలతో వ్యవహారాలు నడిపిస్తున్నాడని గుర్తించాడు. 2018 లో మంత్రి పదవి దక్కకపోయినా హరీష్ ఎక్కడా పెదవి విప్పలేదు. కేసీఆర్‌కు విధేయుడిగానే ఉన్నాడు. ఓర్పుకు మారుపేరు హరీష్ అన్నట్టు వ్యవహరించాడు. యేడాది తరువాత మళ్లీ మంత్రి పదవీ ఇచ్చాడు కేసీఆర్. కానీ ప్రశాంత్ రెడ్డితో పాటు మరి కొందరిని సమాంతరంగా పెంచి పోషించాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా హరీష్ రావు బీఆర్ఎస్‌కు దెబ్బ కొట్టి వెళ్లిపోయినా పార్టీకి నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డాడు. కేటీఆర్ క్రమంగా పార్టీపై పట్టు సంపాదించాడు. నిజానికి కేటీఆర్ చాలా అహంకారి. కానీ దాన్ని ఆత్మవిశ్వాసంగా చెప్పుకొంటాడు. కేటీఆర్‌కు ఇప్పటికీ తెలంగాణ పొలిటికల్ జాగ్రఫీ మీద పూర్తి పట్టు లేదు. సిటీ లీడర్‌గా కనిపిస్తాడు. సంక్షోభం వస్తే కార్పొరేట్ CEO లా వ్యవహరిస్తాడే తప్ప.. పొలిటికల్ లీడర్‌లా సమస్యని పరిష్కరించలేడు. హరీష్ వ్యూహాలు వేరుగా ఉంటాయి. తెలంగాణ గ్రామీణ వ్యవస్థపై పట్టు ఉన్నవాడు. అతని మనసుకి మాటకు సంబంధం ఉండదు.
అదే అతనికి అడ్వాంటేజ్. ఈటెల రాజేందర్‌తో కలసి హరీష్ కుట్ర చేస్తున్నాడని గ్రహించి తొలుత ఈటెలని తెలివిగా పార్టీ నుంచి వెళ్లగొట్టాడు కేసీఆర్. సొంత పార్టీ పెట్టి సత్తా చూపిస్తానన్న ఈటెల చివరికి స్వీయ రక్షణ కోసం బీజేపీ పంచన చేరాల్సి వచ్చింది. తనను ఎదిరిస్తే ఏమవుతుందో ఈటెల ఎపిసోడ్ ద్వారా హరీష్ రావుకు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు కేసీఆర్. ఆ తరువాత హరీష్ రావు చాలా జాగ్రత్త పడ్డాడు. ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీకి, కేసీఆర్‌కి విధేయుడిగానే ఉన్నట్టు ప్రతి క్షణం కనిపిస్తాడు. విధేయత, ఓపిక.. ఈ రెండు ఉంటేనే రాజకీయాల్లో మనుగడ అన్న ఫార్ములా బాగా వంట పట్టించుకున్నవాడు హరీష్. టీఆర్ఎస్‌ని బీఆర్ఎస్‌గా మారిస్తే దెబ్బతింటామని తెలుసు. అయినా నోరు విప్పలేదు హరీష్. 2023 ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినా ఎక్కడా నోరు విప్పలేదు. 2024 లోక్ సభ ఎన్నికల్లో దారుణ ఓటమి గురించి తెలిసినా మౌనంగానే అన్నీ ముందుండి నడిపించాడు. కవిత అరెస్ట్ అయినప్పుడు సైతం కేటీఆర్‌తో కలిసి ప్రతీ సందర్భంలో అండగా నిలబడ్డాడు. ఇన్ని చేసినా కేసీఆర్ మాత్రం హరీష్‌ని నమ్మడంలేదు. హరీష్ బీజేపీ అధినాయకత్వంతో అంతర్గత సంబంధాలు పెట్టుకున్నాడని.. అందుకే కేటీఆర్, కవితపై అవినీతి ఆరోపణలు, అరెస్ట్ బెదిరింపులు వస్తున్నాయే తప్ప హరీష్ రావుపై రావడంలేదని కేసీఆర్ అనుమానం. బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు హరీష్‌తో మాట్లాడుతున్నారని కేసీఆర్ బలంగా నమ్మాడు. కవిత అరెస్ట్ తరువాత కేటీఆర్ మరింత వేగం పుంజుకున్నాడు. హరీష్‌ని పూర్తిగా పక్కన పెట్టి పార్టీ బాధ్యతలు మొత్తం తానే తలకెత్తుకున్నాడు. విపరీతంగా రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు.
ఎవరూ లేకపోయినా పార్టీ నడపాలని స్థిర నిశ్చయంతో ఉన్నాడు. కేటీఆర్ ఇలా సూపర్ యాక్టివ్ అవ్వడానికి వెనుక పెద్ద వ్యవహారమే జరిగింది. బీఆర్ఎస్‌ను విలీనం చేయాలంటూ.. బీజేపీ నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు హరీష్ విలీనం వైపే మొగ్గు చూపాడట. అన్ని సమస్యలకు విలీనం ఒక్కటే మార్గమని గట్టిగా చెప్పాడట. కానీ హరీష్ మనసులో ఉన్నది వేరు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయ్యాక దానిని వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి బయట పడాలన్నది హరీష్ రావు ప్లాన్. తెలంగాణ అస్తిత్వం నినాదంతో ఈటెలతో కలసి కొత్త పార్టీ పెడితే సక్సెస్ అవుతానని హరీష్ ఊహ. హరీష్‌కు నిధులకు కొరత లేదు. సొంత వర్గం ఉండనే ఉంది. పార్టీ వీడినా తెలంగాణ వాదులను మళ్లీ వెనక్కి తీసుకురావచ్చు. ఇంత భారీ ప్లాన్ సిద్దం చేసుకున్నాడు హరీష్ రావు. ఇందుకు దాదాపు రంగం సిద్ధం అయింది. కేసీఆర్‌కు ఉన్న సొంత నిఘా వ్యవస్థ ద్వారా ఇదంతా తెలిసింది. విలీనానికి ససేమిరా అన్నాడు. అవసరమైతే 2028లో బీజేపీతో పొత్తుకి వెళ్దాం అన్నాడు. బీజేపీ అధినాయకత్వానికి ఇదే సమాచారం పంపారు. కేటీఆర్ మరింత జోరు పెంచాడు. రేవంత్ సర్కార్‌పై నిత్యం మాటల దాడి చేస్తున్నాడు. కేటీఆర్‌లో మార్పుని హరీష్ గమనించాడు. అతనిలో అభద్రత మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్ కంటే ముందే అదే విషయంపై కేటీఆర్ కంటే ముందే రియాక్డ్ అవ్వడం, ముందే ప్రెస్‌మీట్లు పెట్టడం ద్వారా తన ఉనికి చాటుకోవడం. మొదలెట్టాడు. ఇదే విషయంపై పార్టీలోనూ, కెసిఆర్ ఫ్యామిలీలోనూ చర్చ జరిగింది. కేటీఆర్ హైదరాబాదులో సాయంత్రం నాలుగు గంటలకి ప్రెస్ మీట్ పెడుతున్నట్లు అనౌన్స్ చేస్తే, మధ్యాహ్నం 12 గంటలకి హరీష్ సిద్దిపేటలోనూ, పెద్దపల్లిలోనూ ప్రెస్‌మీట్‌లు పెట్టేస్తున్నాడు. ఎంత వీలైతే అంత రేవంత్ సర్కారును ఎండగట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎప్పుడు ఏ వివాదం దొరుకుతుందా అని వేటగాడిలా ఆవురావురుమంటున్నాడు. ఎక్కడ వెనుకబడితే పార్టీ తనను వదిలేస్తుందో అనే భయం కనిపిస్తుంది. పాత నాయకులు తప్ప కొత్త నాయకులు, కేడర్ కేటీఆర్ వైపు వచ్చేసాయి. కేటీఆర్‌కు తెల్లారి లేచిన దగ్గర నుంచి టార్గెట్ రేవంత్ అనే ఆపరేషన్‌పైనే ఉంటాడు. ట్వీట్లు, ప్రెస్‌మీట్లు, టూర్లతో.. అప్పుడే ఎన్నికలు వచ్చేస్తున్నాయి అన్నంత హడావుడి చేస్తున్నాడు. రేవంత్ సర్కార్‌పై వీలైనంత ప్రజా వ్యతిరేకత సృస్టించాలి అన్నదే కేటీఆర్ టార్గెట్. ఒక పక్క కేసీఆర్ తనను దూరం పెట్టినా, కేటీఆర్ స్పీడ్ పెంచినా, లీడర్స్ తనతో రాకపోయినా.. ఓపికగా పని చేస్తున్నాడు హరీష్. ఈ లోపే హరీష్‌కు వ్యతిరేకంగా మరో స్ట్రోక్ ఇచ్చాడు కేసీఆర్. తీహార్ జైలు నుంచి విడుదలై ఇప్పటివరకు ఇంటికే పరిమితమైన కవితని జనంలోకి వదిలాడు. దీనికి కారణం, కేటీఆర్ కనుక ఫార్ములా ఈ రేసులో ఆరెస్ట్ అయితే… పార్టీని, కేడర్‌ని ఆందోళన బాట పట్టించడం, పార్టీ బాధ్యతలు భుజాలకు ఎత్తుకోవడం ఇవన్నీ మళ్లీ హరీష్ రావుకు అప్పజెప్తే కొంప మునిగినట్టే. అందుకే కవితని ముందు జాగ్రత్తగా జనంలోకి వదిలాడు కేసీఆర్.
2028 లో తిరిగి అధికారం లోకి రావడం ఎంత ముఖ్యమో.. హరీష్ ఎదగకుండా అడ్డుకోవడం అంతే ముఖ్యం కేసీఆర్‌కి. కవిత, కేటీఆర్ మధ్య ఇప్పటికే అవగాహన కుదిరింది. కవిత జైలు నుంచి విడుదల అయ్యాక కేటీఆర్‌తో కూర్చొని అన్ని వ్యవహారాలు సెటిల్ చేసుకుంది. అధికారం కుటుంబాన్ని దాటి పోగూడదు అంటే ముందు తామిద్దరు కలసి ఉండాలని డిసైడ్ అయ్యారు. కేటీఆర్ అరెస్ట్ అయిన రెండో క్షణం నుంచి కవిత సూపర్ యాక్టివ్ అవుతుంది. ఇప్పుడు ఆమె ట్రయల్స్ చేస్తోంది. ఇవన్నీ హరీష్ గమనిస్తున్నాడు. ఓపికతో అన్నీ భరిస్తూ వేచి చూస్తున్నాడు. తన బలం తాను అంచనా వేయకుండా దూకితే కాళ్లు విరుగుతాయి. అందుకే ఓపికగా వెయిట్ చేస్తున్నాడు. తన చరిత్ర ఎన్టీఆర్‌లా కాకూడదని ముందే కేటీఆర్‌ని, కవితని అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చాడు కేసీఆర్. అంతే కాదు వేల కోట్ల వ్యక్తిగత ఆస్తులు, పార్టీ అకౌంట్‌లో 15 వందల కోట్ల రూపాయలు, మంది మార్బలం అంతకంటే తరువాత తరానికి ఏం ఏం కావాలి. అది ఎన్టీఆర్ చేయకపోవడంవల్లే ఆయన కొడుకులు చివరికి జోకర్స్‌గా మిగిలారు. కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అయితే హరీష్ రావు ఎప్పటికీ పల్లికి మోసే బోయగానే మిగిలిపోతాడు.