Priyanka Gandhi Vadra: 2024లో మోడీతో ప్రియాంక ఢీ..? వారణాసి నుంచి ప్రియాంక పోటీ..!

యూపీ కాంగ్రెస్‌పై ప్రియాంకా గాంధీ క్రమంగా తన పట్టును పెంచుకుంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అజయ్ రాయ్‌కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పోస్టును కేటాయించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 19, 2023 | 07:23 PMLast Updated on: Aug 19, 2023 | 7:23 PM

Priyanka Gandhi Contests Varanasi Seat Pm Modi Will Go Back To Gujarat And Never Return

Priyanka Gandhi Vadra: ఉత్తరప్రదేశ్.. ఇది దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలకు నెలవైన రాష్ట్రం మాత్రమే కాదు..!! ఎంతో మందిని ప్రధానమంత్రి పీఠంపైకి పంపిన రాజకీయ విప్లవ ఖిల్లా!! ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ కూడా గత (2019) సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచే గెలిచారు. 4.79 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో మోడీ గ్రాండ్ విక్టరీ సాధించారు. ఇటువంటి కీలకమైన వారణాసి స్థానం నుంచి వచ్చే లోక్‌సభ పోల్స్‌లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. “లోక్‌సభకు పోటీ చేసేందుకు అవసరమైన అన్ని అర్హతలు ప్రియాంకకు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పరిశీలిస్తుందని ఆశిస్తున్నా” అని ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఇటీవల కామెంట్ చేశారు. ఆ తర్వాతే దీనిపై శివసేన, కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని వివిధ పార్టీల నేతలు మీడియా ముందు మాట్లాడటం పెరిగింది.
వారణాసిపై పట్టు కోసం ప్రియాంక సన్నాహాలు..
యూపీ కాంగ్రెస్‌పై ప్రియాంకా గాంధీ క్రమంగా తన పట్టును పెంచుకుంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అజయ్ రాయ్‌కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పోస్టును కేటాయించారు. అజయ్ రాయ్‌కి ఈ పోస్టు దక్కడం వెనుక ప్రియాంకా గాంధీ ప్రధాన సహకారం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి అజయ్ రాయ్ పొలిటికల్ కెరీర్ బీజేపీలోనే మొదలైంది. 1996, 2002, 2007 యూపీ అసెంబ్లీ పోల్స్‌లో ఆయన వారణాసి లోక్‌సభ స్థానం పరిధిలోని కొలాస్ల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2009లో వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని అజయ్ రాయ్ భావించగా బీజేపీ జాతీయ నాయకత్వం నో చెప్పింది. అప్పట్లో వారణాసి లోక్‌సభ పోల్స్‌లో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి టికెట్ ఇవ్వగా ఆయన గెలుపొందారు. సమాజ్ వాదీ పార్టీ టికెట్‌తో అజయ్ రాయ్ బరిలోకి దిగినా గెలువలేకపోయారు. అదే ఏడాది కొలాస్ల అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరిగిన బై పోల్‌లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసి అజయ్ రాయ్ గెలిచారు. 2012లో యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న దిగ్విజయ్ సింగ్ చొరవతో అజయ్ రాయ్ హస్తం పార్టీలోకి ఎంటర్ అయ్యారు. ఈవిధంగా వారణాసి లోక్‌సభ స్థానంపై మంచి పట్టున్న అజయ్ రాయ్‌కి యూపీ పీసీసీ చీఫ్ దక్కేలా చేయడం ద్వారా.. తాను పోటీ చేయబోయేది వారణాసి నుంచే అనే సిగ్నల్స్‌ను ప్రియాంక జనంలోకి పంపారు.
ఆ మూడు.. నాడు.. నేడు..
2019 సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోడీపై పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కు 1.52 లక్షల ఓట్లు, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిని శాలినీ యాదవ్ కు 1.95 లక్షల ఓట్లు పోలయ్యాయి ఇద్దరూ కలిసి దాదాపు 4 లక్షల ఓట్లు సాధించారు. ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో సమాజ్ వాదీ పార్టీ కూడా ఉంది. ఈ పరిణామం ప్రియాంకా గాంధీకి ప్లస్ పాయింట్‌గా మారనుంది. అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా వారణాసిలో గణనీయంగా ఓటుబ్యాంక్ ఉంది. 2014 లోక్ సభ పోల్స్‌లో ప్రధాని మోడీపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసి అత్యధికంగా 2 లక్షలకుపైగా ఓట్లు పొందారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కు 75వేలకుపైగా ఓట్లు, సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి కైలాష్ చౌరాసియాకు 45వేలకు పైగా ఓట్లు పోల్ అయ్యాయి. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను కలిపి లెక్కేస్తే.. ప్రధాని మోడీ సాధించిన 3.71 లక్షల ఓట్ల మెజారిటీకి దరిదాపుల్లోనే ఉంది. ఒకవేళ అప్పుడే ఈ పార్టీలు కూటమిగా ఏర్పడి ఉంటే.. వారణాసి నుంచి తొలిసారి ప్రధాని మోడీ గెలుపు కష్టతరమై ఉండేది. ఈసారి ముఖ్యమైన ఈ మూడు పార్టీల కలయికకు.. ప్రియాంకా గాంధీ అభ్యర్థిత్వం తోడైతే వారణాసి నుంచి కాంగ్రెస్ గెలుపు ఖాయమైనా ఆశ్చర్యం లేదు!!