ప్రొఫెసర్ టు ప్రధాన మంత్రి, ఆర్థిక సలహదారు నుంచి ఆర్థిక మంత్రి

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్... అంచెలంచెలుగా జీవితంలో ఎదిగారు. యుకేలో అర్ధశాస్త్రంలో డి.లిట్ చేసిన ఆయన లైఫ్ లో ఊహించని మలుపులు ఉన్నాయి. ఆర్థిక శాఖలో సలహదారుగా చేరిన మన్మోహన్ సింగ్...అదే శాఖను ఆదేశించే స్థాయికి ఎదిగారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2024 | 09:29 AMLast Updated on: Dec 27, 2024 | 9:29 AM

Professor To Prime Minister Economic Advisor To Finance Minister

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్… అంచెలంచెలుగా జీవితంలో ఎదిగారు. యుకేలో అర్ధశాస్త్రంలో డి.లిట్ చేసిన ఆయన లైఫ్ లో ఊహించని మలుపులు ఉన్నాయి. ఆర్థిక శాఖలో సలహదారుగా చేరిన మన్మోహన్ సింగ్…అదే శాఖను ఆదేశించే స్థాయికి ఎదిగారు. ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ పోయారు. దేశాన్ని ప్రగతిపథంలో ముందుకు నడిపించే ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటీ నుంచి 1962లో అర్ధశాస్త్రంలో డి.ఫిల్ చేసిన మన్మోహన్ సింగ్…లండన్ లోనే ఉండిపోకుండా ఇండియాకు తిరిగి వచ్చేశారు. 1971లో కేంద్ర .ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. అక్కడి నుంచి 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖకు షిఫ్టయ్యారు. ఆర్థిక శాఖకు ప్రధాన ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. మన్మోహన్ సింగ్…1982-85 మధ్య రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేశారు. 1991లో తొలిసారి రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1991లో పెద్దల సభకు ఎన్నికయ్యారు. 1991-96 మధ్య అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో ఆర్థికమంత్రిగా…దేశాన్ని సంస్కరణలో పరుగులు పెట్టించారు. ఆర్థికమంత్రిగా ఎల్‌పీజీ సంస్కరణలు దిగ్విజయంగా అమలు చేశారు. ఆర్థిక రంగంలో తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చూపించారు.

33 ఏళ్ల పాటు రాజ్యసభకు ఎంపీగా పనిచేసిన మన్మోహన్ సింగ్…ప్రతిరోజు 18 గంటలపాటు పనిచేసేవారు. కుటుంబాని కంటే ఎక్కువగా పనికే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఏ పదవిలో ఉన్నా…తన మార్క్ చూపించడానికి తపన పడేవారు. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులను శక్తిమంతంగా తీర్చిదిద్దడంలో మన్మోహన్ సింగ్ పాత్ర మరువలేనింది. ప్రధాన మంత్రి పని చేసిన దశాబ్ద పాలనలో చిరస్మరణీయ విజయాలు అందుకున్నారు. 2005లో విప్లవాత్మక సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. 2005లో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి…కూలీలకు బాసటగా నిలిచారు. అది కూడా కరువు జిల్లా అనంతపురంలో ప్రారంభించి…వ్యవసాయ కూలీలకు అండగా నిలిచారు. మన్మోహన్ హయాంలోనే అత్యధిక జీడీపీ వృద్ధిరేటు నమోదు చేసింది. 10.8శాతంతో రికార్డు నెలకొల్పింది. ఆయన హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27 శాతం సీట్లు కేటాయింపులు జరిగాయి. ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగా…మన్మోహన్ సింగ్ రికార్డు సృష్టించారు.

మన్మోహన్ సింగ్.. ఉన్నత విద్యావంతుడు, ప్రఖ్యాత ఆర్థికరంగంలో నిష్ణాతుడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించిన ఆర్థిక మేధావి. దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ప్రసిద్ధి చెందారు. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ…పెద్దల సభకు వచ్చి ఓపిగ్గా సభ్యుల ప్రసంగాన్ని విన్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిశ్శబ్దంగానే వైదొలగినప్పటికీ…దేశ ఆర్థిక రంగానికి వేసిన బలమైన పునాదులు మరవలేనివి. మన్మోహన్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1987లో పద్మవిభూషణ్‌ ప్రదానం చేసింది. 2017లో మన్మోహన్‌ సింగ్‌ను ఇందిరా గాంధీ బహుమతి వరించింది. 1993, 94 ఉత్తమ ఆర్థికమంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు మన్మోహన్. 2010లో ఆయనకు వరల్డ్‌ స్టేట్స్‌మెన్ అవార్డు వచ్చింది. ఫోర్బ్స్‌ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్‌కు చోటు కూడా దక్కించుకున్నారు.