వార్‌జోన్‌లో సైనికుడిలా పుతిన్ ఎంట్రీ, ఉక్రెయిన్ కాదు అగ్రరాజ్యంపైనే గురి
కాల్పుల విరమణ ఒప్పందానికి జెలెన్‌స్కీ ఓకే చెప్పారు. పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక్కటే పెండింగ్. ఒకవేళ పుతిన్ అంగీకరించకపోతే ఆంక్షలతో మాస్కో అంతు చూస్తా'. ట్రంప్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇవి. కట్‌చేస్తే..

కాల్పుల విరమణ ఒప్పందానికి జెలెన్‌స్కీ ఓకే చెప్పారు. పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఒక్కటే పెండింగ్. ఒకవేళ పుతిన్ అంగీకరించకపోతే ఆంక్షలతో మాస్కో అంతు చూస్తా’. ట్రంప్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇవి. కట్‌చేస్తే.. పుతిన్ మిలిటరీ డ్రెస్ వేసుకున్నారు. వార్‌జోన్‌లో అడుగుపెట్టారు. సుదీర్ఘ యుద్ధంలో ఒక్కసారి కూడా వెళ్లని కర్స్క్ రీజియన్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఉక్రెయిన్ లెక్క తేల్చే వ్యూహాలను సైనిక జనరళ్లతో కూర్చుని సిద్ధంచేశారు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక గూఢచారి యుద్ధభూమిలో అడుగు పెడితే ఎలా ఉంటుందో ఉక్రెయిన్‌తో పాటు అగ్రరాజ్యం అమెరికాకూ క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపించారు. అయితే, నెల రోజుల కాల్పుల విరమణకు జెలెన్‌స్కీ ఓకే చెప్పిన వేళ.. పుతిన్ మిలిటరీ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? వార్‌జోన్‌లో అడుగుపెట్టడం ద్వారా ఉక్రెయిన్, అమెరికాకు ఇచ్చిన క్లియర్ కట్ మెసేజ్ ఏంటి? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
ఇదీ ట్రంప్ యాక్షన్‌కు పుతిన్ రియాక్షన్. ఉక్రెయిన్ దాడులు మొదలైన తర్వాత తొలిసారి కర్స్క్ రీజియన్‌లో పుతిన్ అడుగు పెట్టారు. ఇందులో అంత ప్రత్యేకత ఏముంది అనుకోకండి. చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. ట్రంప్ ఆ రేంజ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మాస్కో నుంచి రావాల్సిన రియాక్షన్.. డిమాండ్లు వినిపించడం. మాస్కో నుంచి డిమాండ్ల లిస్టు వాషింగ్టన్‌కు చేరింది. కాకపోతే ఆ డిమాండ్లు ఏంటనేది మాత్రం బయటకు వెల్లడించలేదు. మూడు వారాల నుంచి అమెరికా-రష్యా అధికారులు వర్చువల్ విధా నంలో చర్చలు జరుపుతున్నారు. అయితే, మాస్కో పంపిన డిమాండ్లలో చాలావరకు గతంలో ఉక్రెయిన్‌కు అందించినవే ఉన్న ట్లు తెలుస్తోంది. వీటిలో కీవ్‌కు నాటో సభ్యత్వం ఇవ్వకపోవడం, విదేశీ దళాలను ఉక్రెయిన్‌లోకి అనుమతించకపోవడం, క్రిమియా, మరో నాలుగు ప్రావిన్స్‌లు రష్యాకు చెందుతాయని అంగీకరించడం వంటివి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతోపాటు అసలు యుద్ధానికి మూల కారణమైన నాటో తూర్పువైపు విస్తరణ అంశం కూడా పరిశీలించాలని కోరే అవకాశం ఉందని అంచనా వేశారు.
మరోవైపు.. 30 రోజుల కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పుతిన్ స్పందన కోసం వేచి చూస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో మిలిటరీ డ్రెస్ వేసుకుని కర్స్క్‌లో ఎంట్రీ ఇచ్చారు పుతిన్. కర్క్స్‌లోని రష్యా దళాల కంట్రోల్ సెంటర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా యుద్ధ భూమిలోని పరిస్థితులను రష్యన్ జనరల్ స్టాఫ్ హెడ్ వలెరీ జెరసిమోవ్.. పుతిన్‌కు వివరించారు. ఆ తర్వాత ట్రంప్ ఎదురుచూసిన పుతిన్ రియాక్షన్ వచ్చింది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల ఒప్పందానికి పుతిన్ అనుకూలంగా మాట్లాడారు. అయితే ఈ కాల్పుల విరమణ అనేది శాశ్వత శాంతికి దారితీయాలని, సంఘర్షణలకు మూల కారణాలను పరిష్కరించాలన్నారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేసినప్పటికీ.. ఒప్పందం ఇంకా కార్యరూపం సంతరించుకోలేదని అన్నారు. సో.. ఈ చర్చలు కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నమాట. ఇక పుతిన్ ఆర్మీ డ్రెస్ వేసుకుని కర్స్క్‌కు ఎందుకు వెళ్లారన్న ప్రశ్నకే వస్తే.. ఉక్రెయిన్ 2024 ఆగస్టులోనే రష్యాలోని కర్స్క్ ప్రాంతంలోకి చొరబాట్లను ప్రారంభించి, ఆ ప్రాంతంలోని అధిక భాగాన్ని స్వాధీనం చేసుకుంది. 2024 చివర్లో రష్యన్ దళాలు కర్స్క్‌లో భారీ విజయాలు సాధించాయి. ఉక్రెనియన్ దళాలను వెనక్కి నెట్టాయి.. కానీ వాటిని పూర్తిగా తరిమికొట్టడంలో మాత్రం విజయం సాధించలేకపోయాయి. దీంతో ఉక్రెయిన్ సేనలు క్రమంగా కర్స్క్‌లోకి చొచ్చుకుపోతూ రష్యాని సవాల్ చేశాయి. అయితే, ఆ పరిస్థితులు ఇటీవల మారాయి.
ఇదీ ప్రస్తుతం కర్స్క్ రీజియన్‌లో సిట్యువేషన్. జెడ్డా వేదికగా శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే కర్స్క్‌లో ఉక్రెయన్ దళాలను లక్ష్యంగా చేసుకుంది. ఫలితంగా కర్స్క్ నుంచి ఉక్రెయన్ దళాలు పారిపోతున్నాయి. వాస్తవానికి కర్స్క్ భూభాగాలను అడ్డుపెట్టుకుని.. రష్యాను దారిలోకి తెచ్చుకోవా లనేది జెలెన్‌స్కీ స్ట్రాటజీ. అంటే కర్స్క్‌ను అడ్డుపెట్టుకుని రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాల్ని వెనక్కి తీసుకోవాలని భావించారన్నమాట. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే తమ భూభాగాలను తిరిగిచ్చేస్తే కర్స్క్‌ను విడిచిపెడతాం అని కండిషన్ పెడతారన్నమాట. అదంతా జరగాలంటే పుతిన్ సేనలను ఓడిం చి కర్స్క్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. అందుకోసం జెలెన్‌స్కీ విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితాలు మాత్రం అనుకూలంగా రాలేదు. అందుకుఉదాహరణే ఉక్రెయిన్ దళాల లొంగుబాటు దృశ్యం.
కర్స్క్‌లో ఇంకా 10 వేల మంది కీవ్ దళాలు ఉన్నట్టు మాస్కో గుర్తించింది. కర్స్క్ రీజియన్‌లో చాలా గ్రామాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇక మిగిలింది.. ఉక్రెయిన్ దళాలను లొంగదీసుకోవడమే. ఆ లెక్క సరిచేయడానికే పుతిన్ కర్క్స్‌లోని రష్యా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్లారు. రష్యన్ జనరల్ స్టాఫ్ హెడ్ వలెరీ జెరసిమోవ్..కొంతమంది ఉక్రెయిన్ సేనలు తమకు లొంగి పోయినట్లు పుతిన్‌కు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్రాంతం నుంచి కీవ్ దళాలను తరిమికొట్టాలని అధ్యక్షుడు ఆదేశించారు. కట్‌చేస్తే.. కర్స్క్ రీజియన్‌లోని అతిపెద్ద పట్టణం సుడ్జాను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. సో.. కర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ దళాల కథ ముగియడానికి ఇక ఎంతో సమయం లేదన్నమాట. తమ భూభాగాలను తిరిగివ్వమని డిమాండ్ చేసే అవకాశం జెలెన్‌స్కీకి లేకుండా చేయడమే. ట్రంప్ చర్యలతో యుద్ధం ముగిసినా.. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలు మాస్కోకే చెందుతాయన్నమాట. కానీ, ఇందుకు జెలెన్‌స్కీ అంగీకరించకపోవచ్చు.. కాబట్టి ఈ యుద్ధానికి ముగింపు అంత ఈజీ కాదు. ఒక్కముక్కలో ఉక్రెయిన్ యుద్ధం మరో మలుపు తిరబోతోంది.