యూరప్‌ను యుద్ధంలోకి లాగిన జెలెన్‌స్కీ న్యూక్లియర్ బాక్స్ బయటకు తీసిన పుతిన్
ఈ నెల 24తో ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి మూడేళ్లు పూర్తవుతాయి. ట్రంప్ ఎంట్రీతో ఈ సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పడుతుందని చాలాదేశాలు నమ్ముతున్నాయి.

ఈ నెల 24తో ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి మూడేళ్లు పూర్తవుతాయి. ట్రంప్ ఎంట్రీతో ఈ సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పడుతుందని చాలాదేశాలు నమ్ముతున్నాయి. కానీ, ప్రస్తుత పరిణామాలు మాత్రం యుద్ధం ముగింపు మాట దేవుడెరుగు.. మరింత ఉధృతం కాబోతోందన్న సంకేతాలే ఇస్తున్నాయి. దీనికి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ. అమెరికా మద్దతు లేకుండా పుతిన్‌ను ఆపడం ఇంపాజిబుల్ అన్న జెలెన్‌స్కీ యూరోపియన్ ఆర్మీ అన్న బలమైన పదాన్ని ప్రయోగించారు. ఆ ప్రతిపాదనే ఉక్రెయిన్ వార్‌జోన్‌లో అణు ప్రకంపనలు రేపుతోంది. ఇంతకూ, సౌదీలో సింగిల్ సిట్టింగ్‌లో యుద్ధానికి ఎండ్‌కార్డ్ వేస్తానని ట్రంప్ ప్రకటించిన వేళ.. జెలెన్‌స్కీ యూరోపియన్ దేశాలను ఎందుకు రెచ్చగొడుతున్నాడు? ఈ పరిణామాలు యుద్ధభూమిలో ఎలాంటి ప్రకంపనలు
మిస్టర్ జెలెన్‌స్కీ.. నా పర్సనల్ ఫోన్ నెంబర్ ఇస్తున్నా.. మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు.. లిఫ్ట్ చేస్తా మాట్లాడుతా.. ఇదీ ఇటీవల జెలెన్‌స్కీకి ట్రంప్ చెప్పిన మాట. అప్పుడే రష్యా అధినేత పుతిన్‌తోనూ మాట్లాడారు. మనం సౌదీ అరేబియాలో త్వరలోనే కలవబోతున్నాం యుద్ధం సంగతి, ఉక్రెయిన్ సంగతీ తేల్చేద్దామని చెప్పారు. ఈ ఇద్దరితో ట్రంప్ మాటలు చూస్తే ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ట్రంప్ ఎలా డీల్ చేస్తున్నారో అందరికీ అర్ధమవుతుంది. ఎవరిని వెనకేసుకొస్తున్నారు.. ఏం చేయబోతున్నారన్నది కూడా ఓ క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ జెలెన్‌స్కీకి కూడా వచ్చింది. పైగా రష్యాతో ట్రంప్ జరుపుతానంటున్న చర్చల్లో ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకపోవడం ఆయనకు సినిమా మొత్తం అర్ధమయ్యేలా చేసింది. కాస్త డీటెయిల్డ్‌గా చెప్పాలంటే యుద్ధం ముగింపుకోసం ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్.. పుతిన్‌కే అనుకూలంగా ఉన్నారు. జెలెన్‌స్కీని కనీసం లెక్క చేయడం లేదు కూడా. ఇది గుర్తించాడు కాబట్టే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్యూహం మారుస్తున్నాడు.
రీసెంట్‌గా జెలెన్‌స్కీ NBCకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో కీలక వ్యాఖ్యలు చేశాడు. అమెరికా సపోర్ట్ లేకుండా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ మనుగడ సాధించడం కష్టమేననీ, అసాధ్యం కూడా అని పేర్కొన్నాడు. అమెరికా సపోర్ట్ లేకుండా తాము జీవించే అవకాశాలు చాలా తక్కువని సంచలన వ్యాఖ్యలు చేశాడు. యుద్ధాన్ని ముగించాలని పుతిన్ కోరుకోవడం లేదన్నారు. విరామ సమయంలో మరింత బలంగా సిద్ధం కావడం, సైనిక బలగాల శిక్షణ,మాస్కోపై విధించిన కొన్ని ఆంక్షలను ఎత్తివేయించుకోవడం కోసం పలు ఒప్పందాలు చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడే జెలెన్‌స్కీ ఎవరూ ఊహించని ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. NBCకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కొన్ని గంటల ముందు మ్యూనిక్‌లో జరిగిన భద్రతా సదస్సులో యూరోపియన్ యూనియన్ ముందు ఎవరూ ఊహించని ప్రతిపాదన పెట్టారు. రష్యాతో యూరప్‌కు కూడా ప్రమాదం పొంచి ఉందని.. యూరప్ ఇప్పటికైనా మేల్కొని, సొంతంగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలనేది జెలెన్‌స్కీ ప్రతిపాదన. అంతేకాదు.. గతంలోలా యూరప్‌కు అమెరికా అండగా నిలవదనీ.. త్వరలో యూరప్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందన్నారు.
యూరోపియన్ దేశాలు ఉమ్మడిగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాల్సిన టైం వచ్చిందని జెలెన్‌స్కీ ప్రతిపాదించడం వెనుక చాలా పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. తమకు అమెరికా నుండి సహాయం అందడం ఇక కష్టమే అని జెలెన్‌స్కీ డిసైడ్ అయిపోయాడు. ట్రంప్ యుద్ధాన్ని ముగించినా అది రష్యాకు ఫేవర్‌గానే ఉంటుందనీ ఒక నిర్ణయానికి వచ్చేశాడు. దీంతో అనూహ్యంగా యూరప్ ఆర్మీ వ్యూహాన్ని తెరపైకి తెచ్చాడు. యూరోపియన్ యూనియన్‌కు ఉమ్మడిగా ఒక ఆర్మీ ఉంటే, తమలో ఎవరిపై శత్రువు దాడి చేసినా అంతా ఏకమై ఓడించొచ్చు అనేది జెలెన్‌స్కీ ఆలోచన. అందుకు ఇప్పటికే నాటో ఉంది. కానీ, దానికి అమెరికా బాస్‌గా వ్యవహరిస్తోంది. పైగా ట్రంప్ నాటోను లైట్ తీసుకుంటున్నారు. ఇటీవలే ప్రపంచంలో ఎవరినైనా తాము ఒంటరిగా ఎదుర్కోగలం అని ప్రకటించారు. కాబట్టి అమెరికా ఇకపై ఎవరి రక్షణకూ సహకరించదని అనుకోవచ్చు. అందుకే, జెలెన్‌స్కీ యూరప్ ఆర్మీని ప్రతిపాదించారు. కానీ, జెలెన్‌స్కీ చెప్పినంత మాత్రాన యూరోపియన్ యూనియన్ దీనికి ఆమోదం తెలుపుతుందా? అన్నది అసలు ప్రశ్న.
అమెరికా, యూరోపియన్ యూనియన్ మిత్రులే.. ఐతే, ట్రంప్ ఎంట్రీ తర్వాత సీన్ మారింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్న ట్రంప్.. మిత్రదేశాలపైనా టారిఫ్ అస్త్రాన్ని సంధిస్తున్నారు. ట్రంప్ టారిఫ్ బాధితితుల్లో యూరప్ కూడా ఉంది. ఈ విషయంలో ఇటీవలే ఈయూ మండిపడింది. అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25శాతం టారిఫ్ విధిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు.
ఆ మరుసటి రోజే 27 దేశాల ఈయూ కూటమి ఘాటుగా స్పందించింది. అర్ధరహిత టారిఫ్‌లతో దుందుడు కుగా వ్యవహరిస్తున్న అమెరికాకి తగిన సమాధానం చెప్తామని యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులావాన్ డీర్ లియాన్ ప్రకటించారు. అమెరికా తమకు మరో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తే ఈయూ మొత్తం ఏకతాటిమీదకొచ్చి ఐక్యంగా నిలబడుతుందనీ. అప్పుడు అంతిమంగా ఆర్థికయుద్ధం మొదలై ఇరువైపులా దాని విపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ పరిణామంతో ఈయూ అమెరికా మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌ను ఉపయోగించుకునే అమెరికాకి యూరప్‌ను దూరం చేసి తనకి మద్దతుగా మార్చుకోవాలనేది జెలెన్‌స్కీ ప్లాన్. కానీ, ఇది వర్క్‌ఔట్ అవ్వడం ఇంపాజిబుల్.
జెలెన్‌స్కీ నుంచి ఎప్పటికైనా ఇలాంటి ప్రతిపాదన ఒకటి వస్తుందని పుతిన్‌కు తెలుసు. అందుకే, ట్రంప్ గెలిచినవెంటనే పుతిన్ వ్యూహం మార్చారు. 2024నవంబర్ 19న ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ క్షిపణి దాడులను అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణించాలని నిర్ణయించారు. అందుకు వీలు కల్పించేలా దేశ అణు విధానానికి సవరణ కూడా చేశారు. దాని ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి, అమెరికా, యూరప్‌పై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ నిర్ణయాల ఉద్దేశం. ఇది తెలిసి కూడా యూరోపియన్ దేశాలు పుతిన్‌తో పెట్టుకోవాలనుకుంటే అది మూడో ప్రపంచ యుద్ధమే అవుతుంది. కాబట్టి జెలెన్‌స్కీ ప్లాన్ వర్క్‌ఔట్ అయ్యే ఛాన్సే లేదు. ఒక్కటిమాత్రం నిజం. మూడేళ్ల సుదీర్ఘ యుద్ధంలో జెలెన్‌స్కీ దారుణంగా ఓడిపోబోతున్నాడు.