PV Narasimha Rao: తెలుగోడికి భారతరత్న.. పీవీ గురించి ఎవరికీ తెలియని విషయాలు..
పదిహేడు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి. ఒక వ్యక్తి ఇలా ఎదగడం సాధ్యమా.. అనే అనుమానాలకు పీవీ పేరు చెప్తే.. సాధ్యమే అనిపిస్తుంది. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి దేశాన్ని ఏలడం.. అదీ దక్షిణాది రాష్ట్రానికి చెందిన ఒక నేత దే శరాజకీయాలను శాసించడం అంటే మాటలు కాదు.

PV Narasimha Rao: పాములపర్తి వెంకట నరసింహరావు.. అలియాస్ పీవీ. ఇది పేరు మాత్రమే కాదు.. ఆర్ధిక సుడిగుండంలో చిక్కుకున్న భారత్‌కు దివిటీ ఇది. పీవీ అంటే.. ఓ గర్వం, ఓ ఎమోషన్. మాజీ ప్రధానిగా మాత్రమే ఆయన తెలుసు. ఆయన జీవితంలో ప్రతీ పేజీ నేటి తరానికి ఓ పాఠం. ఆయనలో ఎన్ని కోణాలు. ఎన్ని పార్శ్వాలు.. ఒకటి కాదు రెండు కాదు.. పదిహేడు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి. ఒక వ్యక్తి ఇలా ఎదగడం సాధ్యమా.. అనే అనుమానాలకు పీవీ పేరు చెప్తే.. సాధ్యమే అనిపిస్తుంది.
PV Narasimha Rao: మన పీవీ.. భారతరత్నం.. చరణ్ సింగ్, స్వామినాథన్‌లకు కూడా..
ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి దేశాన్ని ఏలడం.. అదీ దక్షిణాది రాష్ట్రానికి చెందిన ఒక నేత దే శరాజకీయాలను శాసించడం అంటే మాటలు కాదు. ఆషామాషీ అసలే కాదు. అలాంటి పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం.. తెలుగు జాతికే గర్వకారణం. ఓ దేశభక్తుడు ప్రధాని అయితే ఎలా ఉంటుందో.. ఆ పాలన ఎలా ఉంటుందో.. ఆ విజన్ ఎలా ఉంటుందో.. తీసుకునే నిర్ణయాలు, తీసుకొచ్చే మార్పులు ఎలా ఉంటాయో.. చూపించిన నిజమైన భారతరత్నం పీవీ. రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత.. అనూహ్యంగా ప్రధాని అయ్యారు. 1991 నుంచి 1996 వరకు భారత ప్రధానిగా పనిచేశారు. ఈ సమయంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఆర్థిక సంస్కరణలను అమలులోకి తెచ్చారు. అప్పటి వరకూ కూలిపోయే దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు.. తన మేథస్సుతో ఊతమిచ్చి దేశం ఆర్థికంగా పతనం కాకుండా పీవీ చేసిన కృషి.. భారత్ ఎప్పటికీ మర్చిపోదు. కుల ప్రాబల్యం లేని, ప్రాంతం కలసిరాని చోటు నుంచి వచ్చిన పీవీ.. తన మేధస్సుతోనే అందలం ఎక్కారనడంలో ఎలాంటి అనుమానం లేదు. కేవలం దేశ రాజకీయాలు మాత్రమే కాదు.
అంతర్జాతీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా.. నాడు ప్రముఖుల ప్రశంసలు పొందాయి. కాశ్మీర్ తీవ్రవాదులు ప్రముఖులను కిడ్నాప్ చేసినప్పుడు.. వారి డిమాండ్లకు ఏమాత్రం లొంగకుండా వారిని విడిపించింది మన పీవీనే. అలాంటి లౌక్యుడు. ఇజ్రాయిల్ దౌత్య సంబంధాలతో పాటు తీవ్రవాదానికి పాకిస్థాన్ ఇస్తున్న బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడంతో పాటు ఆగ్నేసియాదేశాలతో సంబంధాలను మెరుగుపర్చుకోవడం కూడా అంతర్జాతీయంగా ఆయనకున్న దృష్టి కోణానికి ఒక నిదర్శనం. పంజాబ్‌లో తీవ్రవాదాన్ని సమర్థంగా అణచివేసిన వ్యక్తి. అధికారాలను వ్యక్తిగత ఆడంబరాలకు ఏనాడూ వాడని వ్యక్తి పీవీ. పదవిలో ఉండగా.. సొంత పిల్లలను కూడా ప్రధాని కార్యాలయంలోకి రానివ్వలేదు. కేసుల విచారణ కోసం సొంత ఆస్తులు అమ్ముకున్న నాయకుడు ఎవరైనా ఉంటే.. అది బహుశా పీవీ ఒక్కరేనేమో!