ఏపీ బస్సుల్లో ఇక క్యూఆర్ కోడ్…!
దేవాలయాలకు వెళ్లే భక్తులు, ఆర్టీసీ ప్రయాణికులు, ఆసుపత్రులకు వచ్చే రోగుల నుంచి కూడా వారికి అందుతున్న సేవలపై అభిప్రాయం తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ ను తీసుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
దేవాలయాలకు వెళ్లే భక్తులు, ఆర్టీసీ ప్రయాణికులు, ఆసుపత్రులకు వచ్చే రోగుల నుంచి కూడా వారికి అందుతున్న సేవలపై అభిప్రాయం తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ ను తీసుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లు, ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికుల అభిప్రాయాలను వేగంగా తెలుసుకుని తదనుగుణంగా ఆర్టీసీ పనితీరు మెరుగుపరుకోవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. బస్సు సమయానికి వచ్చిందా లేదా.? బస్సు డ్రైవర్, కండక్టర్లు, సమాచార, ఇతర సిబ్బంది ప్రవర్తన సంతృప్తిగా ఉందా లేదా అనే దానిపై ఈ క్యూఆర్ కోడ్‌ల ద్వారా అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్రంలోని దేవాలయాల్లో కూడా క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ముందుగా ఏడు పెద్ద దేవాలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి, అక్కడి పరిసరాల పరిశుభ్రత, మౌలికసదుపాయాలు, నిర్ణీత వేళకు దర్శనం, క్యూలైన్ల నిర్వహణ, ప్రసాదాల నాణ్యత ఎలా ఉందనే అంశాలపై భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆసుపత్రుల్లో కూడా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి రోగులకు అందే సేవలపై అభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. ముఖ్యంగా వైద్యులు అందుబాటులో ఉన్నారా, మందులు ఆసుపత్రిలో ఇచ్చారా లేక బయట కొనుగోలు చేశారా, ఆసుపత్రిలో పరిశుభ్రత ఎలా ఉంది అనే ప్రశ్నల ద్వారా అభిప్రాయాలను సేకరించాలని సూచించారు.