Raghunandan Rao: వివాదాస్పద వ్యాఖ్యలు.. మీడియాతో చిట్‌చాట్‌లో అడ్డంగా దొరికిపోయిన రఘునందన్ రావు..
బీజేపీలో రఘునందన్ రావు అనుభవం కలిగిన నేత. క్రమశిక్షణతోనే మెలిగాడు.ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడుతారు. కేసీఆర్, కేటీఆర్ వంటి నేతలకు ప్రశ్నలు సంధిస్తారు. మీడియాలో ఆయన ఇంటర్వ్యూలకు అంత డిమాండ్, ఫాలోయింగ్ ఉంటుంది. ఇంత వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి కలిగిన రఘునందన్ రావు మాత్రం తాజాగా మీడియాకు, పార్టీకి దొరికిపోయారు.
Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యవహారం సంచలనం రేపుతోంది. బీజేపీ అధిష్టానంపై, బండి సంజయ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో కాకరేపుతున్నాయి. అయితే, అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఎంతగా చెప్పుకొంటున్నప్పటికీ లాభం లేకపోయింది. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని రఘునందన్ రావు వాటిని ఖండించారు. ఆలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. పుండు మీద కారం చల్లినట్లు ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో మీడియాలో లీకైంది. దీంతో రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు నిజమేనని తేలింది. ఈ విషయంలో పాపం రఘనందన్ రావు ఏం చేయాలో పాలుపోక ఇబ్బందిపడుతున్నారు.
బీజేపీలో రఘునందన్ రావు అనుభవం కలిగిన నేతే. క్రమశిక్షణతోనే మెలిగాడు. ఏ విషయంలోనూ తొందరపడింది లేదు. అనేక విషయాల్లో ఆయనకు అసంతృప్తి ఉన్నా గతంలో పెద్దగా బయటపడలేదు. ఇక ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో, ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడటంలో ఆయన దిట్ట. ఏ చర్చలోనైనా లాజికల్‌గా మాట్లాడుతూ ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెడతారు. ఆయన వ్యాఖ్యలకు ఎప్పుడూ పార్టీ నుంచి, నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్సే వచ్చేది. ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడుతారు. కేసీఆర్, కేటీఆర్ వంటి నేతలకు ప్రశ్నలు సంధిస్తారు. మీడియాలో ఆయన ఇంటర్వ్యూలకు అంత డిమాండ్, ఫాలోయింగ్ ఉంటుంది. ఇంత వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి కలిగిన రఘునందన్ రావు మాత్రం తాజాగా మీడియాకు, పార్టీకి దొరికిపోయారు. తొందరపాటు, ఆవేశంతో చేసిన వ్యాఖ్యలు ఆయనకు చెడ్డపేరు తెచ్చాయి. రఘునందన్ రావు అలా అన్నారో.. లేదో.. మీడియా ఆయన మాటల్ని హైలైట్ చేసింది. దీనిపై బీజేపీ నాయకత్వంతోపాటు, పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో తన మాటలు ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఉన్నాయని అర్థం చేసుకున్న రఘునందన్ రావు వాటిని ఖండించారు. ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని, ఇదంతా దుష్ప్రచారమన్నారు. పార్టీకి కట్టుబడి ఉంటానన్నారు. కానీ, ఆయన మాటల్ని ఎవరూ నమ్మలేదు. పైగా మీడియాతో ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆడియో క్లిప్ లీకైంది.
సరాదాగా మాట్లాడుతూనే..
నిజానికి రఘునందన్ రావు అధికారిక ప్రెస్‌మీట్‌లో ఈ మాటలు అనలేదు. కొందరు మీడియా ప్రముఖులతో సరదాగా సాగిన సంభాషణల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. వాటిని ఎవరో రికార్డు చేసి, విడుదల చేశారు. దీంతో బీజేపీ నేతలు రఘునందన్‌పై మండి పడుతున్నారు. బీజేపీలో లేని, కాంగ్రెస్ తరహా సంస్కృతిని రఘునందన్ పార్టీలోకి తెస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఆయనపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ ఆయనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్యలు తీసుకునే అవకాశం కూడా లేదు. బీజేపీలో రఘునందన్ రావు కచ్చితంగా కీలకమైన నేతే. అసలే ఇప్పుడున్న వారిలో ఎవరు పార్టీలో ఉంటారో.. ఎవరు వెళ్తారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో రఘునందన్‌పై చర్యలు తీసుకోవడానికి అధిష్టానం సాహసించకపోవచ్చు. చర్యలు తీసుకోకపోయినప్పటికీ ఈ విషయాన్ని అధిష్టానం సీరియస్‌గానే తీసుకుంటుంది. పదవుల కేటాయింపు సమయంలో వీటి ప్రభావం ఆయనపై పడొచ్చు.
ఇంతకీ ఏమన్నారంటే
పార్టీలో ఎంతకాలం నుంచో కష్టపడుతున్నా తనకు సరైన గుర్తింపు ఇవ్వడ లేదని అసంతృప్తితో ఉన్న రఘునందన్ రావు పార్టీ అధిష్టానం, బండి సంజయ్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. ”పదేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా. నాకు తగిన పదవి కావాలి. తెలంగాణ అధ్యక్ష పదవి.. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పదవి.. జాతీయ అధికార ప్రతినిధి పదవి.. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఇవ్వాలని కోరుతున్నా. నేను అధ్యక్ష పదవికి ఎందుకు అర్హుడిని కాను. కొన్నిసార్లు నా కులమే శాపంగా మారింది. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా దుబ్బాక నుంచి గెలుస్తా. దుబ్బాకలో అమిత్ షా వచ్చి ప్రచారం చెయ్యలేదు. నాకు ఎన్నికలో ఎవరూ సాయం చేయలేదు. నేను పార్టీలోనే ఉండాలనుకుంటున్నా. మునుగోడులో వంద కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా బీజేపీ గెలవలేకపోయింది. నేను దుబ్బాకలో సొంతంగానే గెలిచా. అదే.. వంద కోట్లు నాకు ఇచ్చి ఉంటే తెలంగాణను దున్నేసేవాడిని. అమిత్ షా.. రాజగోపాల్ రెడ్డి భుజంపై చేయి వేసి రాజీనామా చెయ్ గెలిపిస్తానని హామీ ఇచ్చారు. ఐతే చివరికి గెలిపించలేకపోయారు. కేసీఆర్‌ను కొట్టే మొనగాడిని నేనే అని జనాలు నమ్మారు. దుబ్బాకలో నన్ను చూసే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. బీజేపీని చూసి కాదు. ఒకప్పుడు పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన బండికి ఇప్పుడు వంద కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. నేను ఉప ఎన్నికల్లో గెలిచినందువల్లే ఈటెల బీజేపీలో చేరారు. బండి సంజయ్ మార్పుపై వస్తున్న వార్తలు నిజమే. ఇంతకాలం నాకంటే ఎక్కువగా పార్టీ కోసం ఎవరూ కష్టపడలేదు. నా సేవలకు ప్రతిఫలం దక్కకపోతే నద్దాపై మోదీకి ఫిర్యాదు చేస్తా” అంటూ మాట్లాడారు.
మీడియాకు దూరంగా
గతంలో తరచూ మీడియాలో కనిపించే రఘునందన్ రావు కొంతకాలం నుంచి సైలెంట్ అయ్యారు. అందులోనూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మీడియాకు అస్సలు చిక్కడం లేదు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చినప్పటికీ మీడియా ముందుకు రాలేదు. తన దుబ్బాక నియోజకవర్గంలో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన, బాధితుల పరామర్శకు వెళ్తున్న రఘునందన్ రావును మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు కూడా ఆయన మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. తాజా వివాదంపై స్పందించడం లేదు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలనుకుంటున్నారేమో అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.