Rahul Gandhi: మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారన్న రాహుల్.. కౌంటర్ ఇచ్చిన స్మృతి ఇరానీ
మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీపై విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ నుంచి గట్టి కౌంటర్ ఎదురైంది.
Rahul Gandhi: లోక్‌సభలో మణిపూర్ అంశంపై చర్చ వాడివేడిగా సాగుతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ నుంచి గట్టి కౌంటర్ ఎదురైంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్‌కు ధీటుగా బదులిచ్చారు.
మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీపై విరుచుకుపడ్డారు. “భారత్ జోడో యాత్రకు ముందు నాలో అహంకారం ఉండేది. ఈ యాత్రతో అహంకారం కరిగిపోయింది. యాత్రలో ప్రజల కష్టాలను దగ్గరుండి చూశాను. పాదయాత్ర ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. నేను మణిపూర్ వెళ్లాను. కానీ, ప్రధాని అక్కడికి వెళ్లలేదు. ఆయన దృష్టిలో మణిపూర్ లేదు. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టారు. అక్కడి పునరావాస కేంద్రంలో మహిళలతో మాట్లాడాను. ఒక మహిళ బిడ్డను తన కళ్లెదుటే చంపేశారు. ఆమె రాత్రంతా తన బిడ్డ శవం దగ్గరే ఉంది. చివరకు ఆమె కట్టుబట్టలతో అక్కడ్నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇలా ఎందరికో అన్యాయం జరిగింది. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారు. దేశం ప్రాణం తీశారు. భారత్ ఓ గొంతు.. అది ప్రజల హృదయ స్పందన. దానిని మీరు చంపేశారు.
మీరు దేశ ప్రేమికులు కాదు.. దేశ ద్రోహులు. అందుకే ప్రధాని మణిపూర్ వెళ్లడం లేదు. భారత సైన్యం ఒక్క రోజులోనే మణిపూర్‌లో శాంతిని తేగలదు. కానీ, మీరు అలా చేయడం లేదు. మోదీ దేశ హృదయ స్పందన వినడం లేదు. ఆయన ఇద్దరి మాటలు మాత్రమే వింటారు. ఒకరు అమిత్ షా. రెండోది అదానీ. లంకను రావణుడి అహంకారమే కాల్చివేసింది. ఇప్పుడు మీరు దేశంలో కిరోసిన్ చల్లుతున్నారు. మణిపూర్‌లో చల్లారు. తర్వాత హరియాణాలో చల్లుతున్నారు” అంటూ రాహుల్ ప్రసంగించారు. మోదీ లక్ష్యంగా రాహుల్ ప్రసంగం సాగింది. మోదీని రావణుడితో పోల్చారు. రాహుల్ ప్రసంగానికి అధికార పక్షం అనేకసార్లు అడ్డుపడింది. స్పీకర్ కూడా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రాహుల్ ప్రసంగంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ చేసిన తప్పులకు రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు. తన ప్రసంగానికి బీజేపీ నేతలు పదేపదే అడ్డుతగలడంతో రాహుల్ తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి, సభనుంచి వెళ్లిపోయారు.
రాహుల్ వ్యాఖ్యలను జాతి క్షమించదు: స్మృతి ఇరానీ
సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ వ్యాఖ్యలను జాతి క్షమించదన్నారు. “రాహుల్ భారతీయుడు కాదు. రాహుల్ వ్యాఖ్యలను జాతి క్షమించదు. భరతమాతను చంపేశారని సభలో ఇప్పటివరకు ఎవరూ అనలేదు. మణిపూర్ రెండుగా చీలలేదు. మణిపూర్‌ను ఎవరూ ముక్కలు చేయలేరు. అది దేశంలో అంతర్భాగం. మీరు (ప్రతిపక్షాలు) ఇండియా కాదు. అవినీతికి ప్రతిరూపం. మణిపూర్‌లో శాంతికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. మణిపూర్ అంశంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాం. మణిపూర్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కశ్మీర్‌లో పండిట్లపై జరుగుతున్న దారుణాలు మీకు కనిపించడం లేదా? ఆర్టికల్ 370 తీసుకురావాలని ప్రతిపక్షం మళ్లీ కోరుకుంటోంది. కశ్మీర్‌లో జరుగుతున్న దారుణాలపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉంటోంది?” అని స్మృతి వ్యాఖ్యానించారు. ఈ చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్రవాగ్వాదం నడిచింది. మోదీ లక్ష్యంగా రాహుల్ చెలరేగితే.. రాహుల్‌కు స్మృతి ఇరానీ గట్టి కౌంటర్ ఇచ్చారు. మణిపూర్ అంశంపై మరో రోజు కూడా చర్చ కొనసాగుతుంది.