Rahul Gandhi: అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ.. స్మృతి ఇరానీని ఓడిస్తారా..?
గతంలో రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే, అక్కడ రాహుల్‌ను 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ ఓడించారు. 55 వేల ఓట్ల మెజారిటీతో ఆమె రాహుల్‌ను ఓడించారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని అమేథీ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ యూపీ అధ్యక్షుడు అజయ్ రాయ్ వెల్లడించారు. అజయ్ యూపీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తాజా వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ప్రస్తుతం కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలో రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే, అక్కడ రాహుల్‌ను 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేత స్మృతి ఇరానీ ఓడించారు. 55 వేల ఓట్ల మెజారిటీతో ఆమె రాహుల్‌ను ఓడించారు. దీంతో ఆమెకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మళ్లీ అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు యూపీ కాంగ్రెస్ నేత వెల్లడించారు.
అమేథీ లోక్‌సభ స్థానం గతంలో కాంగ్రెస్.. అందులోనూ సోనియా కుటుంబానికి కంచుకోటగా ఉండేది. రాహుల్‌కు ముందు ఇక్కడ ఆయన తల్లి సోనియా గాంధీ ఎంపీగా కొనసాగే వారు. తనయుడి కోసం సోనియా తన సీటు త్యాగం చేశారు. దీంతో 2004 నుంచి అమేథీలో రాహుల్ విజయం సాధిస్తూ వచ్చారు. 2019లోనే ఓడిపోయారు. ఆ సమయంలో ఆయన ముందు జాగ్రత్తగా వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారు. రెండింట్లో ఆయన వయనాడ్ నుంచి గెలిచి, అమేథీలో ఓడిపోయారు. మరోవైపు సోనియా గాంధీ కూతురు, రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ కూడా యూపీ నుంచి పోటీ చేస్తారని అజయ్ రాయ్ తెలిపారు. ఆమె వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేసే అవకాశాలున్నాయని చెప్పారు. వారణాసిలోని ప్రతి కార్యకర్తా.. అక్కడ ప్రియాంక గెలుపు కోసం పని చేస్తారని తెలిపారు.
నిజానికి 2019లోనే మోదీపై ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. చివరకు కాంగ్రెస్.. అజయ్ రాయ్‌ను పోటీకి దింపింది. ఈ ఎన్నికలో మోదీ ఘన విజయం సాధించారు. 2014లో కూడా ఆయన వారణాసిలో మోదీపై పోటీ చేశారు. ఇటీవలే ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ.. ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. ఇక.. మోదీపై వ్యాఖ్యల నేపథ్యంలో రద్దైన రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ మళ్లీ పోటీ చేసేందుకు అర్హత సాధించారు.