Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం దర్యాప్తు సీబీఐకి.. నిజాలు నిగ్గు తేలేనా?
ఈ కేసులో కుట్ర కోణం ఉందనే వాదన తెరపైకి వస్తోంది. అందుకే ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ ఆదేశించింది. కాగా, ఈ ఘటనకు గల కారణాల్ని రైల్వే శాఖ గుర్తించింది.
Odisha Train Accident: ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనపై అనేక అనుమానాలున్నాయి. ఈ కేసులో కుట్ర కోణం ఉందనే వాదన తెరపైకి వస్తోంది. అందుకే ఈ ఘటనలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ ఆదేశించింది.
కాగా, ఈ ఘటనకు గల కారణాల్ని రైల్వే శాఖ గుర్తించింది. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో మార్పులు చేయడమే రైలు ప్రమాద ఘటనకు కారణమని గుర్తించింది. ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో మార్పులకు బాధ్యులైన వారిని గుర్తించినట్లు రైల్వే అధికారులు తేల్చారు. ఇలా మార్పులు చేయడం వెనుక కుట్ర కోణం ఉందా..? విధ్వంసం సృష్టించేందుకే ఇలా చేశారా అనే కోణాల్ని తేల్చేందుకే సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో లోకోపైలట్ల తప్పిదం ఏమీ లేదని తేలింది. పాయింట్ మెషీన్ సెట్టింగ్‌ను మార్చడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.
ఈ క్రిమినల్ చర్యను ఎందుకు, ఎలా చేశారనేది రైల్వే భద్రత కమిషనర్ దర్యాప్తులో తేలుతుందని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. సాధారణంగా ఇంటర్ లాకింగ్ సిస్టమ్‌లో పొరపాట్లు జరిగే అవకాశం లేదు. కానీ, ఇందులో మార్పులు జరిగాయంటే కచ్చితంగా ఏదో కుట్ర ఉద్దేశంతోనే ఎవరో ఈ పని చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో తీవ్రలోపాలున్నట్లు గతంలోనే రైల్వే ఉన్నతాధికారి హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఫిబ్రవరి 9న లేఖ కూడా రాసినట్లు తెలుస్తోంది. మరోవైపు మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదంలో మరణించిన అందరికీ నష్టపరిహారం అందించాలని నిర్ణయించింది. టిక్కెట్ లేకుండా ప్రయాణించిన వారికి కూడా పరిహారం అందజేస్తామని రైల్వే శాఖ తెలిపింది.
మరణించి, గాయపడిన వారి వివరాల కోసం 139 నెంబర్‌కు కాల్ చేయాలని రైల్వే శాఖ తెలిపింది. గాయపడిన వారిని తీసుకెళ్లేందుకు, మృతదేహాలను తీసుకెళ్లేందుకు వచ్చే కుటుంబ సభ్యులకు అవసరమయ్యే ఖర్చులు అన్నీ తామే భరిస్తామని రైల్వే శాఖ తెలిపింది. తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. ప్రమాదం నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో 123 రైళ్లను రద్దు చేశారు.
56 రైళ్లను దారి మళ్లించారు. 14 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. ప్రమాదం జరిగిన స్థలంలో రైల్వే ట్రాకుల పునరుద్ధరణ కొనసాగుతోంది. మూడు ట్రాకులను తిరిగి ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే ట్రాకుల పునరుద్ధరణ పూర్తికాగానే రైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 288 మంది మరణించినట్లు తెలుస్తోంది.