Rajagopal Reddy: కర్ణాటక విక్టరీ ఎఫెక్ట్.. కాంగ్రెస్ గూటికి రాజగోపాల్ రెడ్డి!?
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేస్తన్నాయి. తెలంగాణలో మొన్నటి వరకూ మంచి జోష్‌లో ఉన్న కమలం పార్టీ నేతలు కర్నాటక ఓటమితో సైలెంట్ అయ్యారు. గెలుపోటములు సహజం అని పైకి చెప్తున్నా.. వాళ్లలో టెన్షన్ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఇది తెలంగాణలో బీజేపీ ఫ్యూచర్‌ను ప్రశ్నార్థకంలో పడేసింది.
దీంతో ఇప్పుడు రాజకీయ నేతలంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్య అనుచరులతో చర్చించారట రాజగోపాల్ రెడ్డి.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సారీ చెప్తే తిరిగి కాంగ్రెస్‌లో చేరే విషయం గురించి ఆలోచిస్తానని చెప్పారట. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ అసంతృప్తిగా ఉన్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ సందర్భం వచ్చిన ప్రతీసారీ తమ అసహనం గురించి బహిరంగంగానే చెప్పారు. తాను సీనియర్ అయినప్పటికీ తనకు కాకుండా రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చారని వెంకట్ రెడ్డి హైకమాండ్ మీద అలిగారు. ఈ విషయంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు రాజగోపాల్ రెడ్డి ప్రకటించాడు. అదే సమయంలో ఝార్ఖండ్‌లో రాజగోపాల్ రెడ్డి కంపెనీకి 18 వేల కోట్ల సెంట్రల్ ప్రాజెక్ట్ వచ్చింది. బీజేపీ ఆ ప్రాజెక్ట్ ఇచ్చినందుకే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించాడు. రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. అప్పట్లో ఈ విషయం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆ తరువాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. హుజురాబాద్‌లో ఈటెల రాజేందర్‌లా తాను కూడా అధికార పార్టీకి బుద్ధి చెప్తానని వచ్చి ఓటమిపాలయ్యారు రాజగోపాల్ రెడ్డి. ఎన్నికల్లో సీన్ రివర్స్ అవ్వడంతో మునుగోడు ఉప ఎన్నిక తరువాత సైలెంట్ అయ్యారు. అప్పటి నుంచి పాలిటిక్స్‌లో పెద్దగా యాక్టివ్‌గా కనిపించడంలేదు. ఇప్పుడు కర్ణాటక రిజల్ట్ తరువాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఇక ఆల్మోస్ట్ పని ఐపోయింది అనుకునే టైంకు కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఊపిరిపోసింది.
రీసెంట్‌గా జరిగిన బీఆర్‌ఎస్ మీటింగ్‌లో కూడా సీఎం కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేశారు. దీంతో ఆయనను కూడా కాంగ్రెస్ టెన్షన్ పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు కాంగ్రెస్ వైపే ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ స్ట్రాంగ్‌గా మారేందుకు ఇది మంచి చాన్స్. ఈ కారణంగానే తిరిగి సొంత గూటికి రావాలనుకుంటున్నారట రాజగోపాల్ రెడ్డి. అటు ఖమ్మం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. పార్టీ జాయినింగ్ కోసం ఆయన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారట. జూన్ రెండో వారంలో తన అనుచరులతో కలిసి గ్రాండ్‌గా కాంగ్రెస్‌లో చేరబోతున్నారట. ఇప్పుడు రాజగపాల్ రెడ్డి కూడా ఆయన బాటలోనే నడుతస్తున్నారు. వీళ్లిద్దరూ నిజంగా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే.. వీళ్ల బాటలోనే చాలా మంది నేతలు నడిచే చాన్స్ ఉంది. ఇదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రావడం పక్కా.