Rajasthan: రెడ్ డైరీలో ఏముంది..? వివరాలు బయటపడితే రాజస్థాన్ సీఎం అరెస్టేనా..? ఏంటీ వివాదం..
మాజీ మంత్రి రాజేంద్ర గుడా.. సీఎంపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం సహకారంతో, కాంగ్రెస్ అండతో నడుస్తున్న అక్రమ వ్యాపారాల చిట్టా తన దగ్గర ఉందని, రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్ల అవినీతికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు.
Rajasthan: రాజస్థాన్ రాజకీయాల్లో ప్రస్తుతం రెడ్ డైరీ అంశం కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఆ రెడ్ డైరీలో సీఎం అశోక్ గెహ్లాట్‌తోపాటు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టా ఉందని మాజీ మంత్రి రాజేంద్ర గుడా ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పుడు సీఎం అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ వర్సెస్ రాజేంద్ర గుడా అనిపించేలా వ్యవహారం సాగుతోంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సీఎం అశోక్ గెహ్లాట్ మంత్రివర్గంలో రాజేంద్ర గుడా కూడా మంత్రిగా ఉన్నారు. ఇటీవల రాజేంద్ర గుడా అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయన్నాడు. అసెంబ్లీలో, సొంత మంత్రి అలా వ్యాఖ్యానించడంతో ఆగ్రహించిన సీఎం అదేరోజు ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించారు. దీనిపై ఆగ్రహించిన రాజేంద్ర గుడా సీఎంపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం సహకారంతో, కాంగ్రెస్ అండతో నడుస్తున్న అక్రమ వ్యాపారాల చిట్టా తన దగ్గర ఉందని, రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్ల అవినీతికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. అవన్నీ ఒక రెడ్ డైరీలో ఉన్నాయని, ఆ డైరీపై అసెంబ్లీలో చర్చించాలని రాజేంద్ర గుడా అసెంబ్లీలో డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఆ రెడ్ డైరీని అసెంబ్లీలో స్పీకర్ ముందు ప్రదర్శించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారు. సభనుంచి బయటకు తరిమేశారు. మరోవైపు స్పీకర్ రాజేంద్రను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు.
ఇంతకీ రెడ్ డైరీ ఎక్కడిది..?
సీఎం, కాంగ్రెస్ అవినీతి గురించి ప్రస్తావిస్తూ రెడ్ డైరీని రాజేంద్ర గుడా అసెంబ్లీకి తీసుకొచ్చి ప్రదర్శించాడు. అయితే, ఆ డైరీ ఇచ్చింది సీఎం అశోక్ గెహ్లాటే. రాజేంద్ర చెప్పిన వివరాల ప్రకారం.. అధికార కాంగ్రెస్‌కు చెందిన ధర్మేంద్ర రాథోడ్‌పై ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడి చేశారు. ఈ సమయంలో సీఎం అశోక్ గెహ్లాట్.. ఒక రెడ్ డైరీని తన మంత్రివర్గానికి చెందిన రాజేంద్ర గుడాకు ఇచ్చి దాచమన్నాడు. ఆ తర్వాత ఆ డైరీ గురించి సీఎం ఫోన్ చేసి పదేపదే అడిగారు. డైరీని కాల్చేశావా అని కూడా మంత్రిని అడిగారు. దీంతో ఆ డైరీలో ఏముందో రాజేంద్ర గుడా తెలుసుకోవాలనుకున్నాడు. ఆ డైరీ చదవగా అందులో సీఎం, కాంగ్రెస్‌కు సంబంధించిన అవినీతి చిట్టా ఉంది.
అది రాసింది ధర్మేంద్ర రాథోడ్. అందులో సీఎం గెహ్లాట్‌తోపాటు, ఆయన తనయుడు వైభవ్ గెహ్లాట్ పేర్లు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యేలకు సుమారు రూ.2.5కోట్లు ఇచ్చినట్లు కూడా అందులో ఉంది. అందులో వారి అవినీతికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఈ డైరీ బయటపడితే సీఎం జైలుకు వెళ్లడం ఖాయమని రాజేంద్ర గుడా ఆరోపించారు. ప్రస్తుతం ఆ డైరీని ఎవరో దొంగిలించినట్లు చెప్పారు. అంతేకాదు.. డబ్బు తీసుకున్నట్లు చెబుతున్న ఎమ్మెల్యేలకు నార్కో పరీక్షలు చేయాలి అని డిమాండ్ చేశారు. దీంతో ఇప్పుడీ అంశం రాజస్థాన్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజేంద్ర ఆరోపణల్ని కాంగ్రెస్ ఖండిస్తుంటే, బీజేపీ ఆయనకు మద్దతుగా నిలుస్తోంది.