RAJESH KILARU: ఎవరీ కిలారు రాజేష్.. లోకేష్‌తో అతనికున్న సంబంధమేంటి..?

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పక్కదారి పట్టిన 271 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు అప్పటి పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్‌కు, కిలారు రాజేష్‌కు హవాలా రూపంలో చేరవేశాయని తమ దర్యాప్తులో తేలినట్టు సిఐడీ రిమాండ్ రిపోర్టులో వివరించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 11, 2023 | 06:23 PMLast Updated on: Sep 11, 2023 | 6:23 PM

Rajesh Kumaru Is Close With Nara Lokesh And Involved In Skill Development Scams

RAJESH KILARU: 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో జరిగిన ఏ అవకతవకలోనైనా, కుంభకోణమైనా వెంటనే విడిపించే పేరు కిలారు రాజేష్. ఇప్పుడు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కూడా మరోసారి కిలారు రాజేష్ పేరు బయటకు వచ్చింది. చంద్రబాబు అరెస్టు తర్వాత కోర్టుకు సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కిలారు రాజేష్ పేరు ప్రస్తావించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పక్కదారి పట్టిన 271 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు అప్పటి పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్‌కు, కిలారు రాజేష్‌కు హవాలా రూపంలో చేరవేశాయని తమ దర్యాప్తులో తేలినట్టు సిఐడీ రిమాండ్ రిపోర్టులో వివరించింది. కిలారు రాజేష్ ఆదాయ వ్యవహారాలకు సంబంధించి మరిన్ని వివరాలను ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి సిఐడీ సేకరిస్తోంది.

సామాన్య జనానికి కిలారు రాజేష్ ఎవరో తెలియకపోవచ్చు కానీ టీడీపీలో టాప్ క్యాడర్‌కు మొత్తం రాజేష్ సుపరిచితుడు. టిడిపిలో లోకేష్‌కి రైట్ హ్యాండ్‌గా వ్యవహరించే కిలారు రాజేష్ ఆయనకు క్లాస్‌మేట్. తెలుగుదేశంలో క్రియాశీలక పాత్ర పోషించక ముందు లోకేష్, ఆయన మిత్రులు రాజేష్, అబిస్టా తెర వెనుక పాత్ర పోషించే వాళ్లు. కొన్నాళ్లపాటు జూనియర్ ఎన్టీఆర్ మామ శ్రీనివాసరావుకు చెందిన స్టూడియో ఎన్ ఛానల్‌ను లీజుకు తీసుకొని నడిపారు. అప్పుడు సిబ్బందికి సరిగ్గా జీతాలు ఇవ్వకుండా, చానల్ నడపలేక అభాసు పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి తెరవెనక వర్క్ చేశారు. పెద్దగా విషయం లేకపోయినా లోకేష్ మిత్రుడు కావడంతో పార్టీలో అందరూ గౌరవించాల్సి వచ్చింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆఫీస్‌లో కిలార్ రాజేష్, అబిస్ట కీలక వ్యక్తులుగా మారారు. రోజురోజుకీ అభిస్ట రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి పోయాడు. దీంతో మంత్రులు, అధికారులు ఫిర్యాదు చేయడంతో అబిష్టను పక్కకు తప్పించారు. అప్పటినుంచి కిలారు రాజేష్ పూర్తిగా లోకేష్ నీడలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ వచ్చారు.

2014 నుంచి 2019 వరకు ప్రభుత్వానికి సంబంధించి తెరవెనుక వ్యవహారాలన్నీ.. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు కిల్లర్ రాజేష్ నడిపాడని సమాచారం. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం ద్వారా ఎక్కడా వివాదాలు రాకుండా జాగ్రత్తపడ్డాడు రాజేష్. కానీ 2019లో చంద్రబాబును సర్వేల విషయంలో పూర్తిగా పక్క దారి పట్టించాడని, ఎమ్మెల్యేల అవకతవకలపై సరైన సమాచారం ఇవ్వకుండా తాను మాత్రం లాభపడ్డాడని విమర్శ ఉంది. హైదరాబాద్‌లో రాజేష్ అపారమైన ఆస్తులు సంపాదించాడని ఆరోపణ కూడా ఉంది. కొంతమందికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడంలో కోట్ల రూపాయలు చేతులు మార్చాడని కూడా ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్‌తోపాటు కొన్ని వ్యవహారాల్లో రాజేష్ తెరవెనుక పాత్ర పోషించాడని టిడిపి వర్గాలే చెప్తున్నాయి. 2019లో చంద్రబాబు ఓడిపోగానే కొన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్న రాజేష్, మళ్లీ లోకేష్‌కి దగ్గరై చక్రం తిప్పడం ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రాజేష్ పేరు వినిపించింది. చంద్రబాబుపై కేసులో 37వ నిందితుడిగా చేర్చిన సిఐడి తదుపరి దర్యాప్తులో రాజేష్‌ను కూడా స్కామ్‌లో ప్రశ్నించే అవకాశం లేకపోలేదు. కిలారు రాజేష్ పాత్ర కేవలం స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కేనా.. ఇన్‌కమ్ టాక్స్‌తో సహా మరికొన్ని కోణాల్లో కూడా ఉందా అన్నది కొద్ది రోజుల్లో తేలుతుంది.