Rajinikanth: పాపం రజనీ.. ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు..! ఆయనను మళ్లీ రాకుండా చేశారు కదయ్యా?

రజనీకాంత్‌.. కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌. తమిళ హీరో అయినా.. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు ! తెలుగు ప్రేక్షకుల మనసులకు కూడా చాలా దగ్గర ఆయన ! అలాంటి రజనీ.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఏపీకి వచ్చాడు. ఎన్టీఆర్‌తో అనుబంధాన్ని, చంద్రబాబు నాయకత్వాన్ని పొగుడుతూ రెండు మాటలు మాట్లాడారు. రాజకీయం గురించి మాట్లాడొద్దు అనుకున్నా.. మాట్లాడకుండా ఉండలేకపోతున్నా అని అప్పటికీ ఓ మాట అన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 2, 2023 | 03:15 PMLast Updated on: May 02, 2023 | 3:22 PM

Rajinikanth Political Comments Effect

చంద్రబాబు, ఎన్టీఆర్‌ గురించి రజనీ రెండు మాటలు ఇలా మాట్లాడారో లేదో.. వెంటనే వైసీపీ నేతలు దిగిపోయారు. ఎడాపెడా మాటలు వదిలారు. రజనీ ఏమనుకొని ఏపీకి వచ్చారో కానీ.. ఫుల్‌గా వాచిపోయింది పాపం ఆయనకు ! ఎరక్కుపోయి వస్తే ఇరుక్కుపోయినట్లు అయింది పరిస్థితి. ఏపీనే కాదు తెలంగాణ నేతలు కూడా వదల్లేదు ఆయనను ! ఏపీ నేతలతో కంపేర్‌ చేస్తే కొంచెం తక్కువ అంతే తేడా. సినిమాలు చేసుకోవడం.. గ్యాప్‌ దొరికితే హిమాలయాలకు వెళ్లడం.. ధ్యానం చేసుకోవడం ఇది మాత్రమే తెలుసు రజనీకి ! దేవుడిలా కొలుస్తున్న వాళ్లు కూడా.. రాక్షసుడిగా చూస్తారనే రాజకీయాలు వద్దు అనుకున్నారు తలైవా.

ఏ మాటలు అయితే వద్దు అనుకున్నారో.. అంతకుమించి మాటలు అనిపించుకున్నారు.. అదీ పక్క రాష్ట్రంలో ! ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు విజయవాడ వచ్చిన రజనీ.. ఎన్టీఆర్, చంద్రబాబును పొగిడి రాజకీయంగా ఇరుకునపడ్డారు. రెండు రాష్ట్రాల్లో పార్టీలన్నీ రజనీని ఎడాపెడా బాదేశాయ్. పాపం మరో 10, 15 ఏళ్ల వరకు తెలుగు రాష్ట్రాల వైపు కూడా చూడకుండా చేశారు అంతా కలిసి ! రెండు రాష్ట్రాల నేతల తిట్లకు ప్రధాన కారణం ఒక్కటే.. అదే చంద్రబాబును పొగడడం. ఎవరైనా సరే ఏపీకి వచ్చి చంద్రబాబును పొగిడారో.. అంతే సంగతులు అని మరోసారి ప్రూవ్ అయింది.

రజనీ ఇలా వెళ్లిపోయారో లేదో.. వెంటనే మంత్రి రోజా, మాజీ మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ రంగంలోకి దిగిపోయారు. రజనీ చరిత్రనంతా తవ్విపోశారు. వైశ్రాయ్ ఎపిసోడ్‌ను కూడా మళ్లీ తెరమీదకు తీసుకువచ్చారు. ఎన్టీఆర్‌ వెన్నుపోటును సమర్థించి.. చెప్పులతో కొట్టించినా ఏమీ మాట్లాడని రజనీ… ఇపుడు అదే ఎన్టీఆర్‌ను యుగపురుషుడు, కలియుగపరుషుడని పొగడటం ఏమిటంటూ ఫైర్ అయ్యారు. ఏపీలో రాజకీయం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి.. ఈ ఒక్క పరిణామం చాలు అనే చర్చ జరుగుతోంది. మాటలను ఖండిస్తే సరిపోయేది.. అదేదో కసి పెంచుకున్నట్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చి.. ఎడాపెడా మాటలతో బాదేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నదే ప్రశ్న.

రాజకీయం రకరకాలుగా ఉంటుంది. ఆ పార్టీ నేతలను.. ఈ పార్టీ నాయకులు తిట్టడం ఒక రకం.. విధానాల మీద, నిర్ణయాల మీద తిట్టుకోవడం మరో రకం.. ఎవరో బయటి నుంచి వచ్చి ప్రత్యర్థి పార్టీ నేతపై ప్రశంసలు గుప్పించారని మాటలతో విరుచుకుపడం.. ఇదేం రకం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. ఏపీ రాజకీయాల్లో నాయకుల మాటలకు హద్దులు లేకుండా పోతున్నాయ్. నెమ్మదిగా తమిళనాడు కల్చర్ స్టార్ట్ అయిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు రజనీ ఎపిసోడ్‌లో నేతల మాటలు వింటే..ఏపీ రాజకీయంలో ఎలాంటి దారుణ పరిస్థితులు ఉన్నాయో క్లియర్‌గా అర్థం అవుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్ చాలామంది నుంచి !