Vijaysai Reddy: విజయసాయి రెడ్డికి పార్లమెంట్ పదవి.. రాష్ట్రంలో విమర్శలు.. కేంద్రంలో దోస్తీ..!
విజయసాయిరెడ్డికి కేంద్రం కీలక పదవి అప్పగించింది. విజయసాయిరెడ్డిని పార్లమెంటరీ ఉపాధ్యక్షుల ప్యానెల్‌లోకి తీసుకుంది. ఉపాధ్యక్షుల కొత్త ప్యానెల్‌ను కేంద్రం సోమవారం ఉదయం ప్రకటించింది. దీని ప్రకారం విజయసాయిరెడ్డితోపాటు ఎనిమిది మందిని ప్యానెల్‌కు ఎంపిక చేసింది.
Vijaysai Reddy: పార్లమెంటు వ్యవహారాలకు సంబంధించి బీజేపీ, వైసీపీది విడదీయలేని బంధం. మోదీ ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా.. ఎలాంటి ఆటంకం లేకుండా మద్దతిస్తుంటుంది వైసీపీ. దీంతో ఎన్డీయేలో భాగస్వామి కాకపోయినప్పటికీ వైసీపీకి బీజేపీ చాలా ప్రాధాన్యం ఇస్తుంటుంది. ఈ విషయం ఇప్పుడు మరోసారి రుజువైంది. పార్లమెంటులో వైసీపీ అధినేత, రాజ్యసభలో సభాపక్ష నేత విజయసాయిరెడ్డికి కేంద్రం కీలక పదవి అప్పగించింది. విజయసాయిరెడ్డిని పార్లమెంటరీ ఉపాధ్యక్షుల ప్యానెల్‌లోకి తీసుకుంది. ఉపాధ్యక్షుల కొత్త ప్యానెల్‌ను కేంద్రం సోమవారం ఉదయం ప్రకటించింది. దీని ప్రకారం విజయసాయిరెడ్డితోపాటు ఎనిమిది మందిని ప్యానెల్‌కు ఎంపిక చేసింది. కాంతా కర్దమ్, గీత అలియాస్ చంద్రప్రభ, మమతా మొహంతా, సుమిత్రా బాల్మిక్, డాక్టర్ శాంతాసేన్, నారాయణ్ దాస్, అఖిలేష్ ప్రసాద్ సింగ్‌కు ఈ ప్యానెల్‌లో చోటు దక్కింది. ఈ నెల 13 నుంచి ఈ కొత్త ప్యానెల్ పని చేస్తుందని రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ వెల్లడించారు.
ఒకపక్క ఏపీలో వైసీపీపై బీజేపీ అనేక విమర్శలు చేస్తోంది. అమిత్ షా, జేపీ నద్దావంటి అగ్రనాయకత్వంతోపాటు రాష్ట్ర నాయకత్వం కూడా వైసీపీపై పలు విమర్శలు చేసింది. దీనికి ఆ పార్టీ నుంచి కూడా కొన్ని కౌంటర్లు పడ్డాయి. దీంతో వైసీపీ, బీజేపీ మధ్య దూరం పెరిగిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే, ఈ అంచనాలకు భిన్నంగా కేంద్రంలో వైసీపీ, బీజేపీ సఖ్యతతో మెలగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు ఏపీలో బీజేపీ.. జనసేన, టీడీపీకి దగ్గరవుతుందా అనిపిస్తోంది. రాష్ట్రంలో ఒకలా, కేంద్రంలో మరోలా ఉండటం ప్రస్తుతం ఈ రెండు పార్టీలకే చెల్లింది. దీనికి కారణం.. వైసీపీకి ఉన్న ఎంపీలే. పార్లమెంటులో అత్యధిక మంది ఎంపీలున్న పార్టీల్లో వైసీపీ ఒకటి. రాజ్యసభతోపాటు, లోక్‌సభలోనూ బిల్లులు ఆమోదం పొందాలంటే బీజేపీకి వైసీపీ మద్దతు చాలా కీలకం.
అందువల్ల రాష్ట్రంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నా.. కేంద్రంలో మాత్రం కలిసే సాగుతున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా బేషరతుగా బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఏ విషయంలోనూ ఆ పార్టీ కేంద్రంతో విబేధించలేదు. ఆయనపై ఉన్న కేసుల భయమే దీనికి కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే రాష్ట్రానికి నిధుల కొరత కూడా ఉంది. నిధులు రావాలన్నా, అప్పులు తీసుకోవాలన్నా కేంద్రం మద్దతు చాలా అవసరం. ఒకరి అవసరం ఒకరికి ఉన్న దృష్ట్యా.. బీజేపీ, వైసీపీ పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో విమర్శలు చేసుకుంటూ, కేంద్రంలో కలిసుండటాన్ని రెండు పార్టీలు ఎలా సమర్ధించుకుంటాయో చూడాలి.