Rapido Offer: ఓటు వేయడానికి వెళ్తున్నారా.. ర్యాపిడో నుంచి మీకో బంపర్ ఆఫర్..
నవంబర్ 30న ఓటు వేయాలి అనుకునే వాళ్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించింది. దూరంలో ఉండి, ఓటు వేయడానికి ఇబ్బంది పడే ఓటర్లకు సహకరించేందుకే ఈ నిర్ణయం అని ర్యాపిడో తెలిపింది. ఈ మేరకు ర్యాపిడో ఒక ప్రకటన విడుదల చేసింది.

Rapido Offer: మరో మూడు రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటిదాకా వివిధ పార్టీలు ప్రచారాలు చూసిన ఓటర్లు ఇక తమ నిర్ణయం చెప్పే టైమొచ్చింది. ఓటర్లంతా పోలింగ్ బూతులకు క్యూ కట్టాలి. అయితే, హైదరాబాద్‌లో ఉండి, పోలింగ్ బూత్‌లకు వెళ్లాలి అనుకునే వాళ్లకు బైక్ రైడింగ్ ప్లాట్‌ఫాం ర్యాపిడో బంపర్ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 30న ఓటు వేయాలి అనుకునే వాళ్లకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించింది.
దూరంలో ఉండి, ఓటు వేయడానికి ఇబ్బంది పడే ఓటర్లకు సహకరించేందుకే ఈ నిర్ణయం అని ర్యాపిడో తెలిపింది. ఈ మేరకు ర్యాపిడో ఒక ప్రకటన విడుదల చేసింది. “తెలంగాణలో ఓటర్ల శాతం పెంచాలని మేం నిర్ణయించాం. దీనిలో భాగంగా అత్యధికంగా ఉన్న ఓటర్లను ఓటింగ్ కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నిస్తాం. మన దేశానికున్న ముఖ్యమైన అంశాల్లో ప్రజాస్వామ్యం ప్రధానమైంది. ప్రతి ఓటూ నమోదయ్యేలా ప్రయత్నం చేస్తున్నందుకు మేం గర్విస్తున్నాం. ప్రయాణించి, ఓటు వేయడానికి అవకాశం లేని వాళ్లు.. తమ నిర్ణయం మార్చుకుని ఓటు వేసేలా చేస్తాం.
ఈ ప్రజాస్వామ్య పండుగలో అందరూ ఓటు వేసేందుకు భాగస్వామ్యం కావాలి” అని ర్యాపిడో సంస్థ కో ఫౌండర్ పవన్ గుంటుపల్లి తెలిపారు. ఓటు వేసే వాళ్లు తమ సంస్థ అందించే ఫ్రీ రైడ్‌ను ఎంజాయ్ చేయాలని చెప్పారు. హైదరాబాద్‌లో 2,600 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో అత్యధిక కేంద్రాలకు ర్యాపిడో సేవలు అందుతాయి.