YS Jagan: జగన్ గారూ…. కాస్త స్క్రిప్ట్ మార్చొచ్చు కదా…!

మొత్తానికి సీఎం ఢిల్లీ పర్యటన వెనక ఉద్దేశం వేరు... ఏపీ రాజకీయాల గురించి అ, ఆలు తెలిసిన వారెవరైనా ఈ విషయాన్ని చెబుతారు. జనం నమ్మరని కూడా వైసీపీ పెద్దలకు తెలుసు... కానీ అలా తెలుసు కదా అని అంత గుడ్డిగా పాత స్క్రిప్ట్‌నే మీడియాకు వదిలితే ఎలా... కాస్త మార్చాలి కదా...!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 30, 2023 | 11:54 AMLast Updated on: Mar 30, 2023 | 11:54 AM

Reason Behind Ys Jagan Delhi Tour

జగన్ కాస్త స్క్రింప్ట్ మార్చాలయ్యా… మనం చెబుతున్నది అబద్ధమని పబ్లిక్‌కి తెలిసినా మన బుకాయింపు మాత్రం కాస్త గట్టిగా ఉండాలి కదా… ఇప్పటికే జనం మనల్ని చూసి నవ్వుతున్నారు… అది తెలిసి కూడా అదే తప్పు పదే పదే చేస్తే ఎలా…?

అర్థరాత్రి అమిత్‌షాను కలిశారు సీఎం జగన్. రెండు వారాల్లో రెండోసారి హస్తిన బాట పట్టిన సీఎం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. ప్రధానిని కలవకుండానే ఢిల్లీ నుంచి ఏపీ బాట పట్టారు. అయితే అమిత్‌షాను సీఎం ఎందుకు కలిసారో విడుదల చేసిన ప్రెస్‌నోట్ మాత్రం నవ్వు తెప్పిస్తోంది. జగన్-షా భేటీ వెనక ఏం జరిగిందనే దానికంటే ముందు ఆ ప్రెస్ రిలీజ్‌లో ఏముందో ఓసారి చూద్దాం.. మొత్తం 13 అంశాలను అమిత్‌షాతో ప్రస్తావించారట సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి అడ్‌హక్‌గా పది వేల కోట్లు ఇవ్వాలని, డయాఫ్రం వాల్ మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, పెండింగ్ నిధులు విడుదల చేయాలని, రుణపరిమితి పెంచాలని ఇలా 13 అంశాలున్నాయి. కానీ మీకు గుర్తుందో లేదో పక్షం రోజుల క్రితం సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడు కూడా ఇవే అంశాలను చర్చించారు. కొన్ని వినతుల్లో అయితే కనీసం అక్షరాలు కూడా అటూ ఇటూ మారలేదు. గతంతో పోల్చితే కడప స్టీల్‌ప్లాంట్ వినతి ఒక్కటే లేదు అంతే…

ఈ అంశాలపై చర్చ కోసమే సీఎం ఢిల్లీ వెళ్లారని చెబితే జనం నవ్వుకోరా జగన్….! కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా దీన్ని ఎలా నమ్ముతారు జగన్…? 15రోజుల్లో రెండుసార్లు ఈ అంశాలపై చర్చ కోసమే వెళ్లారా..? ఎవరి చెవిలో పూలు పెట్టదలుచుకున్నారు… కనీసం ఆ స్క్రిప్ట్ మీడియాకు విడుదల చేసిన వారికైనా ఆలోచన ఉండాలి కదా.. కొన్ని అంశాలను మార్చేసి మరికొన్ని కొత్త వాటిని చేర్చినా బాగుండేది. ఏదో ఓ పెద్ద అంశాన్ని తెరపైకి తెచ్చి దానిపై చర్చించడానికని చెప్పినా జనం కనీసం నమ్మడానికి ప్రయత్నించేవారు కదా…!

నిజానికి సీఎం జగన్ పర్యటన వెనక ఉద్దేశం వేరని అందరికీ తెలుసు.. వైఎస్.వివేకా కేసు విచారణ కీలక మలుపు తీసుకుంది. అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఎన్నికల వేళ అది చాలా మైనస్ అవుతుందని వైసీపీ అధినేత భయపడుతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు. దీనిపై అభ్యర్థన కోసమే సీఎం ఢిల్లీకి వెళ్లారన్నది ఓ ప్రచారం. ఇది ఎంత వరకు నిజమన్నది వైసీపీ నుంచి ఎవరూ స్పందించరు. స్పందించకూడదు కూడా. ఇక కర్ణాటక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ అంశం కూడా సీఎం, కేంద్ర హోంమంత్రి భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు మరో కథనం. కొంత ఫండింగ్ చేయడానికి సీఎం సిద్ధంగా ఉన్నారని దాన్నే హస్తినలో చెప్పారని చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమన్నది కూడా ఎవరికీ తెలియదు. ఆ చర్చ జరిగిందో లేదో తెలియదు.. జరిగినా ఇలాంటివి బయటకు రావు కూడా…

ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో సీఎం జగన్ ఢిల్లీ టూర్ వెనుక మరో ఉద్దేశం కూడా ఉందని చెబుతున్నారు. అదే ముందస్తు ఎన్నికల వ్యూహం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నది బహిరంగ రహస్యం. వైసీపీ నేతలు పైకి దీన్ని ఖండిస్తున్నాలోపల కూడా వారంతా దీన్ని అంగీకరిస్తున్నారు. మొన్నటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. అధికారపార్టీని వదిలి ఎమ్మెల్యేలు గీత దాటడానికి సిద్దమవుతున్నారంటే గ్రౌండ్ లెవల్ సిట్యుయేషన్ ఏంటన్నది వారికి అర్థమైంది. ఇదంతా సీఎం కాస్త ఆలస్యంగానైనా గుర్తించారు. సర్వేలు కూడా సీన్ టు సీన్ జగన్‌కు క్లారిటీ ఇచ్చేశాయి. ఇలాగే ఇంకొంతకాలం గడిస్తే ప్రజావ్యతిరేకత మరింత పెరుగుతుందని సీఎం భయపడుతున్నారట. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమిత్‌షాతో ఇదే అంశాన్ని చర్చించినట్లు కొందరు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లేందుకు సహకరించాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం అభ్యర్థనకు ఢిల్లీ బీజేపీ పెద్దలు ఒప్పుకుంటే తెలంగాణతో పాటే ఏపీలోనూ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇంకా ముందే జరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు.

మొత్తానికి సీఎం ఢిల్లీ పర్యటన వెనక ఉద్దేశం వేరు… ఏపీ రాజకీయాల గురించి అ, ఆలు తెలిసిన వారెవరైనా ఈ విషయాన్ని చెబుతారు. జనం నమ్మరని కూడా వైసీపీ పెద్దలకు తెలుసు… కానీ అలా తెలుసు కదా అని అంత గుడ్డిగా పాత స్క్రిప్ట్‌నే మీడియాకు వదిలితే ఎలా… కాస్త మార్చాలి కదా…! అప్పుడే కదా కనీసం జనం నమ్మడానికి ప్రయత్నిస్తారు… లేదా నమ్మినట్లన్నా నటిస్తారు.