NEGGEDEVARU – KOVUR : బంధువులే ప్రత్యర్థులు.. ప్రసన్నకు ప్రశాంతి చెక్ పెడతారా ?

నెల్లూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ తర్వాత ఏ అభ్యర్థి విజయం సాధిస్తారని అందరిలో ఆసక్తిని రేపుతోంది. ప్రధానంగా ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 27, 2024 | 12:45 PMLast Updated on: May 27, 2024 | 12:45 PM

Relatives Are Rivals Will Prasanna Prashanthi Check

నెల్లూరు జిల్లాలో పోలింగ్ ప్రక్రియ తర్వాత ఏ అభ్యర్థి విజయం సాధిస్తారని అందరిలో ఆసక్తిని రేపుతోంది. ప్రధానంగా ప్రముఖులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోవూరు అసెంబ్లీ ఫలితంపై సర్వత్రా చర్చ సాగుతోంది. కోవూరులో నెగ్గేదెవరో చూద్దాం.

అసెంబ్లీ ఎన్నిలకు ముగిశాక ఫలితాలు కోసం అభ్యర్థులు…ఊపిరి బిగపట్టుకొని వెయిట్ చేస్తున్నారు. ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారా? ఇస్తే ఎంత మెజార్టీ వస్తుంది? ఏ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంశాలపై వైసీపీ, టీడీపీ అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. నెల్లూరు నగరానికి దగ్గర్లో… పెన్నా తీరాన కోవూరు నియోజకవర్గం విస్తరించింది. బుచ్చిరెడ్డిపాలెం, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు మండలాలు… ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, టీడీపీ తరపున ఆయన సమీప బంధువు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పోటీ చేశారు. ఇద్దరు నేతలూ విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తరపున చంద్రబాబు… బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి… తన స్టైల్‌లో క్యాంపెయిన్‌ చేశారు. ప్రచార సమయంలో ఇద్దరు నేతలూ ఆరోపణలు.. ప్రత్యారోపణలు చేసుకున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994,1999, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున, 2012 ఉప ఎన్నికలతో పాటు 2019లో వైసీపీ తరపున అసెంబ్లీకి వెళ్లారు. ఏడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్నకుమార్ రెడ్డి…ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేదని ప్రశాంతి రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్ళల్లో నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. గ్రావెల్.. ఇసుక.. మట్టిని వైసీపీ నేతలు దోచుకున్నారని ప్రచారంలో విరుచుకుపడ్డారు. టిడిపి అభ్యర్థిగా ప్రశాంతి రెడ్డిని ప్రకటించాక.. వైసీపీకి చెందిన కొందరు నేతలు టిడిపిలో చేరారు. బుచ్చిరెడ్డిపాలెంలో సూరా శ్రీనివాసులు రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, కామాక్షితాయి ఆలయ మాజీ చైర్మన్ పుట్టా నాయుడు లాంటి నేతలు టీడీపీలో చేరారు. వైసీపీ నేతలను కొంటున్నారంటూ…ఆ పార్టీ అభ్యర్థి ప్రసన్నకుమార్‌ రెడ్డి విమర్శించారు. వైసీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి…ఓట్లు అడిగారు.

కోవూరు నియోజకవర్గంలో 2 లక్షల 67 వేల 345 మంది ఓటర్లు ఉంటే…లక్షా 28 వేల మంది పురుషులు, లక్షా 38 వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 2 లక్షల 11 వేల మంది ఓట్లు వేశారు. 2014 ఎన్నికల్లో కోవరులో 80.54శాతం, 2019 ఎన్నికల్లో 75శాతానికి పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో 79.29 శాతం మంది ఓటు వేశారు. రికార్డు స్థాయిలో ఓటర్లు…తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి 39వేల 891 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈసారి ఆయన బలాన్ని తగ్గించేందుకు టీడీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. వైసీపీ నేతలను చేర్చుకోవడంతో పాటు ఆయా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తామని టీడీపీ హామీలు ఇచ్చింది. వీపీఆర్ ట్రస్ట్ ద్వారా వాటర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్య పరిష్కరిస్తామని ప్రజలకు హామీలు ఇచ్చారు.

కోవూరు నియోజకవర్గంలోని ప్రసన్నకుమార్‌రెడ్డి బంధు వర్గంలో కొందరు… గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం వాళ్ళంతా టీడీపీ అబ్యర్థి ప్రశాంతిరెడ్డి వైపు నిలిచారు. మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కుల మతాలు.. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నట్టు చెప్పారు. పోలింగ్ తర్వాత రెండు పార్టీలూ.. విజయంపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలతో ప్రజలంతా తమవైపే నిలిచారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందువల్లే పోలింగ్ శాతం కూడా పెరిగిందని అంటున్నారు. అటు వైసీపీ నేతలు కూడా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు ఓట్ల వర్షం కురిపించిందని చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నా… ప్రజలు ఎవరి వైపు నిలిచారనే అనేదానిపై ఓట్ల కౌంటింగ్ తర్వాత వెల్లడవుతుంది.