Amit Shah: దేశద్రోహచట్టంతోపాటు 3 చట్టాల రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం..!

ఈ బిల్లుల్లో అన్నింటికంటే ముఖ్యమైంది దేశద్రోహ చట్టం. ఎన్నో ఏళ్లుగా దేశద్రోహ చట్టం అమలుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాలు తమకు నచ్చని వ్యక్తులపై దేశద్రోహ చట్టం ప్రయోగించి, జైల్లో ఉంచుతున్నట్లు విమర్శలున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 11, 2023 | 04:16 PMLast Updated on: Aug 11, 2023 | 4:16 PM

Repeal Of Sedition Capital Punishment For Mob Lynching Amit Shah

Amit Shah: బ్రిటీష్ కాలం నాటి కొన్ని క్రిమినల్ చట్టాల్ని రద్దు చేయబోతున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. వాటి స్థానంలో భారతీయచట్టాల్ని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయనున్నట్లు అమిత్ షా లోక్‌సభలో వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అలాగే ఇంతకాలం అమలులో ఉన్న ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) ఇకపై ఇండియన్ జస్టిస్ కోడ్ (ఐజేసీ)గా మారుతుందని ప్రకటించారు. దీనికి అనుగుణంగా భారతీయ న్యాయ సన్హిత బిల్లులో భాగంగా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. భారతీయ న్యాయ సన్హిత బిల్, భారతీయ నాగరిక్ సురక్ష సన్హిత-2023, భారతీయ సాక్ష్య బిల్లుని ప్రవేశపెట్టే సమయంలో అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సన్హిత-2023ను తీసుకొస్తున్నారు.
దేశద్రోహ చట్టం రద్దు
ఈ బిల్లుల్లో అన్నింటికంటే ముఖ్యమైంది దేశద్రోహ చట్టం. ఎన్నో ఏళ్లుగా దేశద్రోహ చట్టం అమలుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాలు తమకు నచ్చని వ్యక్తులపై దేశద్రోహ చట్టం ప్రయోగించి, జైల్లో ఉంచుతున్నట్లు విమర్శలున్నాయి. ఇది బ్రిటీష్ కాలం నాటి చట్టం. దేశవ్యాప్తంగా 2014-20 మధ్య కాలంలో దాదాపు 399 దేశ ద్రోహ చట్టాలు నమోదయ్యాయి. కానీ, 8 కేసుల్లో మాత్రమే శిక్ష పడింది. 2020 నాటికి దేశ ద్రోహ కేసులు యాభై ఐదు శాతం వరకు పెరిగాయి. గతేడాది సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని, దేశ ద్రోహం కేసుల విచారణను సస్పెండ్ చేసింది. ఈ చట్టాన్ని సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశద్రోహ చట్టం దుర్వినియోగం అవుతున్న దృష్ట్యా జాగ్రత్తగా అమలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయబోతున్నట్లు సభలో ప్రకటించింది.
క్రిమినల్ చట్టాల్లో కీలక మార్పులు
దేశంలో అమలవుతున్న క్రిమినల్ చట్టాల్లో చాలా మార్పులు రాబోతున్నట్లు కేంద్రం తెలిపింది. మూకదాడుల కేసుల్లో మరణశిక్షలు కూడా విధించేందుకు రంగం సిద్ధమవుతోంది. అంటే ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి జాతి, కులం, సంఘం, లింగం, పుట్టిన ప్రదేశం, భాష, వ్యక్తిగత విశ్వాసం వంటి కారణాలతో హత్యకు పాల్పడితే.. అందరికీ మరణశిక్ష విధిస్తారు. అలాగే జీవిత ఖైదు లేదా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తారు. ఏడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే కేసుల్లో నేరాలు జరిగే చోటుకు ఫోరెన్సిక్ బృందం వెళ్లి సాక్ష్యాలు సేకరించాల్సి ఉంటుంది. ఎన్నికల్లో ఓటర్లు డబ్బులు పంచితే ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తారు. సామూహిక అత్యాచారానికి పాల్పడితే.. 20 సంవత్సరాలు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు, మైనర్‌పై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష వంటి చట్టాల్ని రూపొందిస్తున్నారు. ఎక్కడినుంచైనా ఇ-ఎఫ్‌ఐఆర్ నమోదు చేయొచ్చు. ఇలాంటి కొన్ని కీలక చట్టాల్ని కేంద్రం తీసుకురాబోతుంది. వీటికి పార్లమెంట్ ఆమోదం తెలపాల్సిం ఉంటుంది.