Reserved Seats: ఆ 31 సీట్లే కింగ్ మేకర్స్.. పార్టీల స్పెషల్ ఫోకస్..!
రాష్ట్రంలో 19 స్థానాలు ఎస్సీలకు, 12 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయి ఉన్నాయి. 2018 ఎన్నికల్లో 16 ఎస్సీ నియోజకవర్గాలను, 6 ఎస్టీ నియోజకవర్గాలను కేసీఆర్ పార్టీ బీఆర్‌ఎస్ గెల్చుకుంది. కాంగ్రెస్ నుంచి ఏడుగురు ఎస్టీలు, ముగ్గురు ఎస్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
Reserved Seats: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై పొలిటికల్ పార్టీలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. వచ్చే అసెంబ్లీ పోల్స్‌లో ఈ స్థానాలే కింగ్ మేకర్స్ పాత్రను పోషిస్తాయని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని సాధించేందుకు 60 సీట్ల (మొత్తం సీట్లు 119) మ్యాజిక్ ఫిగర్‌ను సాధించాలి. ఇందులో సగానికిపైగా సీట్లు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లోనే ఉన్నాయి. రాష్ట్రంలో 19 స్థానాలు ఎస్సీలకు, 12 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అయి ఉన్నాయి. 2018 ఎన్నికల్లో 16 ఎస్సీ నియోజకవర్గాలను, 6 ఎస్టీ నియోజకవర్గాలను కేసీఆర్ పార్టీ బీఆర్‌ఎస్ గెల్చుకుంది. కాంగ్రెస్ నుంచి ఏడుగురు ఎస్టీలు, ముగ్గురు ఎస్సీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ తర్వాత నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, యెల్లందు, పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బానోతు హరిప్రియ, రేగాకాంతరావు బీఆర్ఎస్‌లోకి జంప్ అయ్యారు. నాటికీ, నేటికీ పొలిటికల్ సీన్ చాలా చేంజ్ అయిందని.. కాంగ్రెస్, బీజేపీలు స్ట్రాంగ్‌గా, యాక్టివ్‌గా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్‌కు గెలుపు అనేది నల్లేరు మీద నడకలా ఉండబోదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ప్రత్యేకించి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో ఈసారి బీఆర్ఎస్ చెమటోడ్చాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు.
హైకమాండ్‌కు సీక్రెట్ నివేదిక..
కర్ణాటకలో బంపర్ విజయం ఇచ్చిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్ ఈసారి తెలంగాణలో ఎలాగైనా పాగావేయాలనే కృతనిశ్చయంతో ఉంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు వరకు ఎస్సీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ హవా ఉండేది. ఎస్టీ ఓట్ల కోసం టీడీపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడేవి. ఈనేపథ్యంలో 19 ఎస్సీ సీట్లపై స్పెషల్ ఫోకస్‌తో హస్తం పార్టీ ముందుకు పోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలపై ఇతర సామాజిక వర్గాల నేతల ఆధిపత్యం ఉందనే చర్చ జరుగుతోంది. దీనిపై దళిత, గిరిజన నేతలు పార్టీ హైకమాండ్‌కు సీక్రెట్‌గా నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీల నుంచి పార్టీలో నాయకత్వాన్ని పెంచేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిర్ణయించారు. ఇందుకోసం వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాలను ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. వీటి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీని బలోపేతం చేయడమే దీని ప్రధాన టార్గెట్.
12 మంది ఎస్సీ కేంద్ర మంత్రులతో సభ..
బీజేపీ ఇప్పటికే 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాలన్నింటిలో బూత్ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్‌లో ఉన్న 12 మంది ఎస్సీ కేంద్ర మంత్రులతో రాష్ట్రంలో ఒక బహిరంగ సభను ఏర్పాటుచేసి దళితులకు రాజకీయంగా బీజేపీ ఎంత ప్రాధాన్యతనిచ్చిందో వివరించాలని కమలదళం ప్లాన్ చేస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం తదితర రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ మోర్చాల ప్రతినిధులు త్వరలోనే తెలంగాణలోని 31 రిజర్వుడ్ నియోజకవర్గాల్లో పర్యటించి గిరిజన, దళిత వర్గాల కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు చేస్తున్న మేలును వివరించనున్నారు.
బీఆర్ఎస్‌కు వ్యతిరేక పవనాలు
మారిన రాజకీయ పరిస్థితులతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై పట్టును నిలుపునే ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలోనే హైదరాబాదులో ఆదివాసీ, బంజారా భవన్‌లను ప్రారంభించారు. కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేస్తామని కేసీఆర్ అన్నారు. గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించారు. దళిత బంధు స్కీం అమలు కూడా జరుగుతోంది. రిజర్వుడు స్థానాలను క్లీన్ స్వీప్ చేసేందుకు ఈ నిర్ణయాలు బాటలు వేస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ ఇంటర్నల్‌గా నిర్వహించిన సర్వేలో రిజర్వుడ్ సెగ్మెంట్లలో ప్రజల నుంచి ఎక్కువ వ్యతిరేకత వస్తోందని తేలిందట. దీంతో ఆ వ్యతిరేక పవనాలను సానుకూల పవనాలుగా ఎలా మార్చాలనే ఆలోచనలో కేసీఆర్ అండ్ టీమ్ పడిందట..!!