రేవంత్ – బిజెపి ఉచ్చులో బీఆర్ఎస్, రేవంత్ ఫుల్ హ్యాపీస్
తెలంగాణాలో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్ట్ ను ఆశ్రయించారు.
తెలంగాణాలో ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్ట్ ను ఆశ్రయించారు. పార్టీ మారిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్, బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు హైకోర్ట్ గడప తొక్కారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్ట్ నేడు తీర్పు వెల్లడించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది.
తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్ట్ ఈ సందర్భంగా పేర్కొంది. బీఆర్ఎస్ లో గెలిచి దానం నాగేందర్ – ఖైరతాబాద్, ప్రకాష్ గౌడ్ – రాజేంద్రనగర్, గూడెం మహిపాల్ రెడ్డి – పటాన్ చెరు, కాలె యాదయ్య – చేవెళ్ల, అరికెపూడి గాంధీ – శేరిలింగంపల్లి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి – గద్వాల్, ఎం సంజయ్ కుమార్ – జగిత్యాల, పోచారం శ్రీనివాస్ రెడ్డి – బాన్సువాడ, తెల్లం వెంకట్రావు – భద్రాచలం, కడియం శ్రీహరి – స్టేషన్ ఘన్‌పూర్ పార్టీ మారారు.
వీరిలో ముగ్గురిపై అనర్హత వేయాలని బీఆర్ఎస్ కోర్ట్ కి వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళపై స్పీకర్ కార్యాలయ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికర అంశం. స్పీకర్ అనర్హత వేటు వేసినా… లేదు వేయలేదంటే వారిపై అనర్హత పడినా అది కాంగ్రెస్ కే లాభం చేకూర్చే అంశం అవుతుంది. దీనిపై రేవంత్ లెక్కలు రేవంత్ కు ఉన్నాయి. అనర్హత పడితే కచ్చితంగా ఉప ఎన్నికలకు వెళ్ళవచ్చు. వెళ్తే అందులో కచ్చితంగా కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఒకవేళ వారి మీద అనర్హత వేసినా మిగిలిన వారి మీద కూడా వేయాలనే డిమాండ్ ఉంటుంది.
అప్పుడు కచ్చితంగా కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలిచే అవకాశం ఉండవచ్చు. దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, పోచారం శ్రీనివాస రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి… కచ్చితంగా గెలిచే సీట్లు. ఇప్పుడు బీఆర్ఎస్ కు ఉన్న కొన్ని అవసరాలతో బిజెపికి ఎదురు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. తేడా వస్తే ఏం జరుగుతుందో ఆ పార్టీ అధిష్టానానికి ఒక లెక్క ఉంది. కాబట్టి మిగిలిన స్థానాల్లో బిజెపి గురిపెట్టి కొట్టవచ్చు. రేవంత్ లక్ష్యం బీఆర్ఎస్ బలహీనపడటం. బీఆర్ఎస్ బలహీనపడితే వచ్చే ఎన్నికలకు కూడా తనకు ఇబ్బంది ఉండదు అనే భావనలో రేవంత్ ఉన్నారు.
కాబట్టి ఆరుగురు గెలిచినా రేవంత్ బలం 70 అవుతుంది. ఇక ఎవరైనా పార్టీ మారేవారు ఉంటే… వారిని రాజీనామా చేయించి తీసుకురావచ్చు… అదంతా పక్కన పెట్టి అనర్హత వేటు వేయకపోతే… బీఆర్ఎస్ శాసన సభా పక్షం మొత్తాన్ని ఒక్క దెబ్బలో విలీనం చేయడానికి రేవంత్ స్కెచ్ రెడీ చేసి పెట్టుకున్నారు. కాబట్టి నెల రోజుల్లో మొత్తం క్లారిటీ వస్తుంది. అనర్హత పిటీషన్ల విచారణ విషయాన్ని రేవంత్ కూడా సీరియస్ గా తీసుకున్నట్టు ఏం కనపడలేదు. ఒకవేళ తెలంగాణా హైకోర్ట్ అనర్హత వేస్తే… కేంద్రంలో ఉన్న బిజెపి పలు రాష్ట్రాల్లో చేసిన చర్యలపై బాధిత పార్టీలు కోర్ట్ కి వెళ్ళే అవకాశం కూడా ఉండవచ్చు. భవిష్యత్తులో కొందరిని గద్దె దించాలని భావిస్తున్న బిజెపికి ఇది ఇబ్బందికరమే.
కాబట్టి వారిపై అనర్హత పడకుండా బిజెపి తెర వెనుక రాజకీయం చేసినా ఆశ్చర్యం లేదు అంటున్నారు పలువురు. అనర్హత వేటు పడితే బిజెపికి కాంగ్రెస్ కి లాభం. పడకపోతే కాంగ్రెస్ కు లాభం. ఒకవేళ పడకపోతే బిజెపి కూడా కొందరు ఎమ్మెల్యేలను తీసుకోవచ్చు. ప్రతిపక్ష హోదాలో ఉండే సూచనలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో హైకోర్ట్ నిర్ణయం తీసుకోకుండా బంతిని స్పీకర్ కోర్ట్ కి నెట్టింది. కాబట్టి ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఈ నిర్ణయం తర్వాత బీఆర్ఎస్ కు ఏ విధమైన ఎదురు దెబ్బలు తగలవచ్చు అనేది ఆసక్తిని రేపే అంశం.