రేవంత్ కు కేటిఆర్ “ఎల్లో షాక్” టీడీపీపై స్పెషల్ లవ్

2023 ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి.. గెలవడంలో టిడిపి క్యాడర్ కీలకపాత్ర పోషించింది. కేసీఆర్ పై ఉన్న కోపంతో... టిడిపి క్యాడర్ మొత్తం రేవంత్ రెడ్డి విజయం కోసం తెలంగాణలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 21, 2025 | 07:56 PMLast Updated on: Mar 21, 2025 | 7:56 PM

Revanth Has Special Love For Ktrs Yellow Shock Tdp

2023 ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి.. గెలవడంలో టిడిపి క్యాడర్ కీలకపాత్ర పోషించింది. కేసీఆర్ పై ఉన్న కోపంతో… టిడిపి క్యాడర్ మొత్తం రేవంత్ రెడ్డి విజయం కోసం తెలంగాణలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకు తెలంగాణ టిడిపి సోషల్ మీడియా బ్రహ్మరథం పట్టింది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా… టిడిపి క్యాడర్ కష్టపడి పనిచేసింది. దీనితో రేవంత్ రెడ్డి కూడా టిడిపి నాయకులకు తెలంగాణలో మంచి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.

గులాబీ పార్టీ… రేవంత్ రెడ్డి పై విమర్శలు చేసినప్పుడు.. ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉండేది టిడిపి క్యాడర్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బలహీనంగా ఉండటంతో టీడీపీ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని భుజానికి ఎత్తుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఈ టైంలో కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. తెలుగువారిని తలెత్తుకునేలా చేసింది ఎన్టీఆర్ అని… రాజకీయ పార్టీ పెట్టి తెలుగువారి కోసం నిలబడింది ఎన్టీఆర్ అంటూ ఆయన సూర్యపేట సభలో కొన్ని కామెంట్స్ చేశారు.

త్వరలో పాదయాత్రకు సిద్ధమవుతున్న కేటీఆర్.. ఈ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. 2014 తర్వాత తెలంగాణలో టిడిపి లేకుండా చేసింది గులాబీ పార్టీ. ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డికి బలంగా ఉన్న టిడిపి క్యాడర్ ను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నాలను కేటీఆర్ మొదలుపెట్టినట్లుగానే కనపడుతుంది. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో టిడిపికి క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలం ఉంది.

ఈ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా స్థానాలు వచ్చాయి. ఒక్క హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపించింది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో టిడిపి కార్యకర్తలు కాంగ్రెస్ కండువాలు కప్పుకుని పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ కు పని చేసే అవకాశం స్పష్టంగా ఉంది. ఇలాంటి టైం లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. టిడిపి ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకునేందుకు కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం బలంగా వినపడుతోంది. సాధారణంగా కేసిఆర్ తనకు వ్యతిరేక వాతావరణం ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలో స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు.

ఇప్పుడు అదే వ్యూహాన్ని కేటీఆర్ కూడా అమలు చేస్తున్నారు. దానికి తోడు తెలంగాణలో టిడిపి.. బిజెపితో కలిసి వెళ్లే అవకాశం ఉండటంతో… కచ్చితంగా గులాబీ పార్టీ ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గులాబీ పార్టీ నాయకులు ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే. దానికి తోడు టిఆర్ఎస్ కండువాలు కప్పుకున్న వారిలో కూడా ఎక్కువగా టిడిపి క్యాడర్ ఉంటుంది. నాయకులు కోసం అటువైపు వెళ్ళినవారు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళందర్నీ… టిడిపి, తెలంగాణలో పోటీ చేస్తే తమవైపు తిప్పుకోవడం పెద్ద విషయం కాదు అనే అభిప్రాయం కూడా ఉంది.

ఈ టైంలో ఎన్టీఆర్ ను పొగడటం ద్వారా కేటీఆర్ జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నారనేది స్పష్టంగా అర్థం అవుతుంది. దాని తోడు 2023లో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన సమయంలో కేటీఆర్ చేసిన ఒక ట్వీట్ కూడా దుమారం రేపింది. కొన్ని జిల్లాల్లో ఎక్కువ స్థానాలు కోల్పోవడానికి ఆ ట్వీట్ కూడా కారణమనే అభిప్రాయం కూడా ఉంది. ఐటి ఉద్యోగులు ధర్నా చేసిన సమయంలో కూడా కేటిఆర్ దూకుడు వ్యాఖ్యలు చేసారు. మరి వచ్చే ఎన్నికల్లో టిడిపి క్యాడర్ ను కేటీఆర్ తన వైపుకు తిప్పుకుంటారా అనేది చూడాలి.