రగిలిపోతున్న రేవంత్… కొలిక్కి రాని కేబినెట్ విస్తరణ
రగిలిపోతున్న రేవంత్ అవును .. రేవంత్ రెడ్డిని చూసి జాలిపడాలో.. ఆయన కెపాసిటీ తెలుసు కాబట్టి.. భరోసాగా ఉండాలో ఆయన వర్గానికి అర్ధం కావడం లేదు.

రగిలిపోతున్న రేవంత్ అవును .. రేవంత్ రెడ్డిని చూసి జాలిపడాలో.. ఆయన కెపాసిటీ తెలుసు కాబట్టి.. భరోసాగా ఉండాలో ఆయన వర్గానికి అర్ధం కావడం లేదు. వస్తున్న అసహనాన్ని అణచుకుంటూ.. ఫ్రస్టేషన్ ను దిగమింగుకుంటూ .. ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అంటూ రోజులు గడుపుతున్నా.. రేవంత్ మదిలో చాలా ఆలోచనలను సునామీలు తిరుగుతున్నాయి. అన్నిటికి ముఖ్యమైన కారణం మంత్రి వర్గ విస్తరణే. అవును.. ఆ ఒక్కటి ఉన్న సమస్యలన్నిటిని బయటపెట్టేస్తోంది. మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతుండటంతో… కాంగ్రెస్ లో ఉన్న కథలన్నీ బయటపడుతున్నాయి. ఒకవైపు సామాజిక సమీకరణాలని కాంగ్రెస్ హైకమాండ్ పట్టు.. మరోవైపు మాకంటే మాకు కావాలంటూ పట్టుబడుతున్న నేతల సవాళ్లు.. తను నిలబడటం కోసం.. కొందరికి నిలబెడతానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. అది నెరవేర్చుకోలేక పడుతున్న పాట్లు.. అన్నీ ఒక్కోటి వస్తూ ఉన్నాయి.
కాంగ్రెస్ అంటేనే రెడ్ల డామినేషన్. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. అది కాస్త పెరిగింది. అసలే బీఆర్ఎస్ వెలమల కింద నలిగిపోయిన రెడ్లంతా కాంగ్రెస్ వైపు తిరిగారు. ఇక వారంతా ఎవరికి వారు పైకి రావాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన నేత కావడంతో.. తనకంటూ సొంత వర్గం ఒకటి ఉండాలని.. అలా ఉంటేనే వైఎస్ఆర్ లాగా హైకమాండ్ తన మాట వింటుందనే కాన్సెప్టుతో మొదటి నుంచి అడుగులు వేస్తున్నారు. అందులో సక్సెస్ అయ్యారు కాబట్టే.. నేడు ఎంత ప్రెజర్ వచ్చినా రేవంత్ ను మాత్రం మార్చేది లేదని హైకమాండ్ తేల్చేసింది.
నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి రేవంత్ వ్యతిరేక వర్గం. రేవంత్ ను వెనక్కు లాగాలని చూసేవారే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి రాకూడదని.. పీసీసీ పీఠం తమకే దక్కాలని ప్రయత్నించిన వాళ్లు కోమటిరెడ్డి బ్రదర్స్. రేవంత్ రెడ్డికి అది దక్కాక.. కొన్నాళ్లు అన్ జాన్ కొట్టారు. మధ్యలో రాజగోపాల్ రెడ్డి బిజెపి వైపు వెళ్లడం.. వెంకటరెడ్డి కూడా డ్రామాలు వేయడం జరిగాయి. అయితే ఆ తర్వాత రేవంత్ ఉత్తమ్ కు చెక్ పెట్టడం కోసం.. కోమటిరెడ్డి బ్రదర్స్ ను చేరదీశారు. ఇప్పుడు ఆ దెబ్బకు తనకూ మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. తన బ్రదర్ కు ఉన్నా.. నల్గొండ జిల్లాలో ఎక్కువున్నా సరే.. తనకు మంత్రి పదవి కావాల్సిందే అంటున్నారు. పైగా జానారెడ్డి అడ్డం పడుతున్నారని మండిపడుతున్నారు.
మరోవైపు మల్ రెడ్డి రంగారెడ్డి .. రంగారెడ్డి కోటాలో తనకు దక్కాలని పట్టుబడుతున్నారు. ఆయనకు కొందరు మద్దతు చెబుతున్నారు. మరోవైపు సుదర్శన్ రెడ్డి తనకు కావాలంటుంటే.. కాదు తనకేనని ప్రేమసాగర్ రావు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఎస్సీ కోటాలో వివేక్, మహిళా బీసీ కోటాలో విజయశాంతికి అయితే ఫిక్స్ అయినట్లే అంటున్నారు. మిగతావాళ్లవే తేలటం లేదు. ఓవరాల్ గా రెడ్లు వర్సెస్ ఇతర వర్గాలు అన్నట్లే ఈ మంత్రివర్గ విస్తరణ కుస్తీ నడుస్తోంది. తన బలం పెంచుకోవటానికి రేవంత్ ప్రయత్నాలు.. దేశవ్యాప్త కాన్సెప్టులో భాగంగా.. సామాజిక సమీకరణాలు అంటూ హైకమాండ్ ఆర్డర్లు.. ఈ రెండిటి మధ్య మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. అప్పటికీ చివరికి విసుగొచ్చిన రేవంత్ హైకమాండ్ చేతికే వదిలేసి ఊరుకున్నారని అంటున్నారు. తనకు సన్నిహితుడు, తనతో గట్టిగా నిలబడ్డ అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించలేకపోయినా.. చివరకు ఎమ్మెల్సీ దక్కేలా చూశారు. ఆయనకూ మంత్రి పదవి ఇవ్వాలన్నా లెక్కలు కుదరడం లేదు.
హైడ్రా, మెట్రో ఛేంజెస్ దెబ్బకు పడిపోయిన రియల్ ఎస్టేట్ లేవటం లేదు. మరోవైపు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతోంది.. నిజాలకు, అబద్ధాలకు తేడా లేకుండా ప్రచారం చేసిపారేస్తుంది. ఇంకోవైపు కాంగ్రెస్ లోనే కొందరు రేవంత్ కాళ్లు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా అన్ని రకాల ప్రాబ్లెమ్స్ చుట్టుముడుతున్నాయి. ఇఫ్పటికే కాంగ్రెస్ పని అయిపోయిందని.. ఇక మళ్లీ గెలవదనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. అయినా రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ మాత్రం ఆయన మీద ఇంకా నమ్మకంగా ఉన్నారు. ఇంకా చాలా టైమ్ ఉంది. ఆయన అస్త్రాలు దాచిపెట్టే ఉంచారని.. మరో ఏడాదిలో టర్నింగ్ పాయింట్లు చాలా వస్తాయని వారు ఆశిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.