REVANTH REDDY: కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది.. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కోట్లు దోపిడీ: రేవంత్ రెడ్డి
కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైంది. మేడిగడ్డ కుంగింది. కేసీఆర్ పాపం పండింది. తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్న కేసీఆర్.. ఇప్పుడు దీన్ని చిన్నదిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.38,500 కోట్ల నుంచి రూ.1. 51 లక్షల కోట్లకు అంచనాలను పెంచాడు కేసీఆర్.
REVANTH REDDY: తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది అని, కేసీఆర్ పాపం పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన ధన దాహానికి మేడిగడ్డ బ్యారేజి కుంగిందని, మేడిగడ్డ డొల్లతనాన్ని కేంద్ర కమిటీయే బయటపెట్టిందని విమర్శించారు రేవంత్. శనివారం హైదరాబాద్, గాంధీ భవన్‌లో రేవంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్, బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. “పాలమూరు-రంగారెడ్డి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో చేపట్టినవే. కేసీఆర్ వీటినే రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారు. రీడిజైన్ పేరుతో కేసీఆర్ ప్రాజెక్టుల స్వరూపం పూర్తిగా మార్చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు దోచుకున్నారు.
ప్రాజెక్టు నిర్మాణంలో ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషనల్ మేనేజ్‌మెంట్ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు. మేడిగడ్డ బ్యారేజీ ప్రణాళిక ప్రకారం డిజైన్ చేయలేదు, డిజైన్ ప్రకారం నిర్మాణం లేదు. నిర్మాణం ప్రకారం నిర్వహణ లేదు. కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైంది. మేడిగడ్డ కుంగింది. కేసీఆర్ పాపం పండింది. తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్న కేసీఆర్.. ఇప్పుడు దీన్ని చిన్నదిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.38,500 కోట్ల నుంచి రూ.1. 51 లక్షల కోట్లకు అంచనాలను పెంచాడు కేసీఆర్. నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంత జరిగినా సీఎం కేసీఆర్ కాళేశ్వరంపై నోరు మెదపలేదు. నిర్మాణంలో లోపాలు, అవినీతి జరిగిందనే ప్రభుత్వం వివరాలను దాచిపెట్టింది. వేల కోట్లు నష్టం జరిగినా కేంద్రం సీబీఐ విచారణ ఎందుకు అదేశించడంలేదు..? బీఆరెస్.. బీజేపీకి ప్రొటెక్షన్ మనీ ఇస్తోంది. అందుకే బీఆరెస్‌ను బీజేపీ కాపాడుతోంది.
ప్రాజెక్టు పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నివేదిక విడుదల చేయడంలేదు..? ప్రాజెక్టులో లోపాలపై సీఎం ఎందుకు వివరణ ఇవ్వడం లేదు..? ఎందుకు ప్రజల ముందుకు రావడం లేదు..? సంబంధింత కంపెనీపై ఎందుకు విచారణకు ఆదేశించాలని చెప్పడంలేదు..? టెండర్లలో రూ.80 వేల కోట్లు చూపించి, రివైజ్డ్ ఎస్టిమేట్‌లో రూ.1.51 లక్షల కోట్లకు పెంచారు. ఇప్పటికే ప్రాజెక్టుపై రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు చేశారు. కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది. అతని కుటుంబం ఆర్థి ఉగ్రవాద కుటుంబం. వీరిని తక్షణమే శిక్షించాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలి. సాంకేతిక నిపుణులతో కమిటీ వేసి నివేదిక ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు..? కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇతర రాష్ట్రాల సాంకేతిక నిపుణులతో ఒక కమిటీ వేయాలి. కేంద్ర ప్రభుత్వం, సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో కమిటీ ఉండాలి. సంపూర్ణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి.
సంబంధిత శాఖల మంత్రులైన హరీష్ రావు, కేసీఆర్‌ను పదవుల నుంచి తొలగించాలి. కేంద్ర జలశక్తి మంత్రి షేకావత్ దీనిపై స్పందించాలి. ప్రధాని ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. కానీ ప్రాజెక్టులను పరిశీలించడంలేదు. తక్షణమే మోదీ.. మెడిగడ్డను పరిశీలించి చర్యలు తీసుకోవాలి. అవినీతి వాసన పడదంటున్న మోదీ ఈ కంపును ఎలా భరిస్తున్నారు..? జరిగిన లోపాలపై విచారణ చేపట్టాలని ప్రతిపక్షంగా కేంద్రాన్ని మేం డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి వచ్చాక మేం ఏం చేస్తామనేది అప్పుడు చెబుతాం. కోదండరాంను తెలంగాణ వ్యతిరేకి అంటే.. తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారు” అని రేవంత్ వ్యాఖ్యానించారు.