Revanth Reddy: విశ్వ నగరమో.. విషాద నగరమో తేలిపోయింది.. కేటీఆర్‌కు లేఖ రాసిన రేవంత్ రెడ్డి..

వర్షాలతో నగరవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మంత్రి కేటీఆర్‌ను నిలదీశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ అంశంలో తగిన విధంగా స్పందించాలని కోరుతూ కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి గురువారం బహిరంగ లేఖ రాశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 27, 2023 | 03:54 PMLast Updated on: Jul 27, 2023 | 3:54 PM

Revanth Reddy Demanded Minister Ktr To Take Special Measures Over Hyderabad Rains

Revanth Reddy: వరుసగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరంలో పలు రోడ్లు జలమయమైన సంగతి తెలిసిందే. పలు కాలనీలు నీట మునిగాయి. వర్షాలతో నగరవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మంత్రి కేటీఆర్‌ను నిలదీశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ అంశంలో తగిన విధంగా స్పందించాలని కోరుతూ కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి గురువారం బహిరంగ లేఖ రాశారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో వరదలు, సహాయక చర్యలపై లేఖలో ప్రశ్నించిన రేవంత్. “గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం విలవిలలాడుతోంది. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ప్రజల గోసను పట్టించుకోవాల్సిన మీరు పత్తా లేకుండా పోయారు. పుట్టిన రోజు పండగలపై ఉన్న ఆసక్తి ప్రజల ఇబ్బందులపై లేదు. విశ్వనగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి పోటీ పడే మీరు.. ప్రజలు బయటకు రావాలంటేనే ఆలోచించుకునే దుస్థితిని హైదరాబాద్‌కు కల్పించారు. ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటూ తిరగాల్సిన పరిస్థితి కల్పించారు. మీ అసమర్ధ పాలనలో ఇది విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది. ట్రాఫిక్ సమస్యలతో నగర ప్రజలు నానాయాతన పడుతున్నారు. బీఆర్ఎస్ నేతల కబ్జాలు, అడ్డగోలుగా జరిగిన అక్రమ నిర్మాణాలతోనే నగరానికి ఈ పరిస్థితి. చర్యలు తీసుకోవాల్సిన మీరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఇటువంటి పరిస్థితి రాబోతుందని మేం హెచ్చరించినా పట్టించుకోలేదు. నగరంలో వరద బీభత్సం సృష్టిస్తున్నా కనీసం సమీక్ష చేసే సమయం మీకు లేదు. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో వరదల సమయంలో మీరు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అప్పట్లో ప్రకటించిన పది వేల రూపాయల సాయం ఎన్నికల పథకంగా మిగిలిపోయింది. ఇప్పటికైనా ప్రజల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయండి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి. ప్రభావిత ప్రజలకు రూ.10 వేల సాయం ప్రకటించండి. లేకపోతే శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మీ చేతగానితనాన్ని ఎండగట్టి తగిన బుద్ధి చెబుదాం” అని రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు.