REVANTH REDDY: ఆమెకే మొదటి ఉద్యోగం! హామీ నిలబెట్టుకుంటున్న రేవంత్..

నాంపల్లికి చెందిన మరుగుజ్జుతనం కలిగిన దివ్యాంగురాలు. పీజీ చదువుకుంది. అయినా ప్రైవేట్‌లో గానీ.. ప్రభుత్వంలోగానీ ఆమెకు ఉద్యోగం రాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాంపల్లిలో ప్రచారానికి వచ్చిన రేవంత్ రెడ్డికి తన బాధను చెప్పుకుంది రజనీ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 6, 2023 | 02:48 PMLast Updated on: Dec 06, 2023 | 2:48 PM

Revanth Reddy Giving First Job To Rajani

REVANTH REDDY: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న రేవంత్ రెడ్డి.. రజనీకి తమ ప్రభుత్వంలో మొదటి ఉద్యోగం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎవరీ రజనీ.. ఆమెకు ఎందుకు కొలువు ఇస్తున్నారన్నది ఇప్పుడు స్టేట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రచారంలో ఓ దివ్యాంగురాలికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోబోతున్నారు.

REVANTH REDDY: మంత్రి పదవులెన్ని..? పోటీ పడుతోంది ఎందరు..?

మా ప్రభుత్వం రాగానే మొదటి ఉద్యోగం నీకే ఇస్తా అని రజనీ అనే దివ్యాంగురాలికి ఆయన హామీ ఇచ్చారు. అందుకే ఇప్పుడు ఆమె ఉద్యోగానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా రేవంత్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. అసలు ఎవరీ రజనీ అంటే.. నాంపల్లికి చెందిన మరుగుజ్జుతనం కలిగిన దివ్యాంగురాలు. పీజీ చదువుకుంది. అయినా ప్రైవేట్‌లో గానీ.. ప్రభుత్వంలోగానీ ఆమెకు ఉద్యోగం రాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాంపల్లిలో ప్రచారానికి వచ్చిన రేవంత్ రెడ్డికి తన బాధను చెప్పుకుంది రజనీ. ఆమె ఆవేదన చూసి చలించిపోయిన రేవంత్.. డిసెంబర్ 9నాడు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని.. ఆ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే వస్తారనీ.. అదే రోజు వాళ్ళ ముందే కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం తనకే ఇస్తుందని రజనీకి రేవంత్ హామీ ఇచ్చారు. ది నా గ్యారంటీ అంటూ.. స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజనీ పేరున రాసి ఇచ్చారు. అందుకే రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం..

ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి కొలువును రజనీకి ఇవ్వబోతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమెకు ఆహ్వానం కూడా పంపారు. కాబోయే సీఎం రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంపై దివ్యాంగురాలు రజనీ సంతోషంగా ఉంది. తాను ఏ ఉద్యోగం ఇచ్చినా చేస్తాననీ.. ఆడపిల్ల అని ఎవరినీ చిన్నచూపు చూడొద్దని అంటోంది. ఎత్తు తక్కువగా ఉన్నానని తనకు ప్రైవేట్‌లో ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదన్నది. అలాగే గవర్నమెంట్‌లో కూడా ఔట్ సోర్సింగ్‌లో ప్రయత్నం చేసినా ఏ అధికారీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది రజనీ. రేవంత్ మాట నిలబెట్టుకోవడంపై సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగానే.. ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ కేలండర్‌ను కూడా కొత్త ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు తెలంగాణలోని లక్షల మంది నిరుద్యోగులు.