Revanth Reddy: రేవంత్ పోటీ చేయబోయే నియోజకవర్గం ఫిక్స్!
కాంగ్రెస్ అక్కడ బలంగా ఉండడం, తన వ్యక్తిగత అనుచరగణం కూడా చెక్కు చెదరకపోవడం.. కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని రేవంత్ అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికల మూడ్ మొదలైంది. ఎన్నికలకు ఇంకో ఏడు నెలల సమయం ఉన్నా.. అదేదో ఇప్పుడే షెడ్యూల్ వచ్చిన రేంజ్‌లో కనిపిస్తున్నాయ్ పాలిటిక్స్! ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయ్. ఏ పార్టీ పరిస్థితి ఏంటి.. బలం ఏంటి, బలహీనతలు ఏంటనే లెక్కలు వేసేసుకుంటున్నారు. వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఎవరు ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్నది మరింత ఆసక్తికరంగా మారింది. కేసీఆర్, బండి సంజయ్ సంగతి ఎలా ఉన్నా.. రేవంత్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎట్టకేలకు రేవంత్.. ఆ స్థానం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి రేవంత్ పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గమే ఫైనల్ అని చాలా గుసగుసలు వినిపించాయ్ ఆ మధ్య ! ఐతే రేవంత్ మాత్రం కొడంగల్ నుంచే పోటీ చేయాలని డిసైడ్ అయిపోయారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో… కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్.. ఓడిపోయారు. కారు పార్టీ నుంచి పోటీ చేసిన పట్నం నరేందర్ రెడ్డి అక్కడ విజయం సాధించారు. రేవంత్‌ను ఓడించేందుకు గులాబీ పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. దీంతో రేవంత్‌కు పరాభవమే మిగిలింది. ఆ తర్వాత మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసి రేవంత్ గెలిచారు. కొడంగల్ నియోజకవర్గం బాధ్యతలను తన సోదరుడు తిరుపతిరెడ్డికి అప్పగించారు. దీంతో పూర్తిగా కొడంగల్ నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తిరుపతిరెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. ఐతే తానే బరిలోకి దిగాలని రేవంత్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అక్కడ బలంగా ఉండడం, తన వ్యక్తిగత అనుచరగణం కూడా చెక్కు చెదరకపోవడం.. కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయని రేవంత్ అంచనా వేస్తున్నారు. నిజానికి ఎల్బీనగర్‌తో పాటు ఉప్పల్, మేడ్చల్, కల్వకుర్తి నియోజకవర్గంలో ఏదో ఒక దాని నుంచి పోటీ చేయాలని పార్టీ వ్యూహాకర్తలు సూచించినా.. రేవంత్ మాత్రం కొడంగల్ వైపే చూస్తున్నారని టాక్.