సెక్యూరిటీ లేకుండా వస్తా, దమ్మున్నోడు రండ్రా: రేవంత్ సవాల్

అధికారం కోల్పోయిన కొంతమంది దోపిడీ దొంగలు, బంది పోటు దొంగలు గా మారారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. సచివాలయంలో గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన సీఎం... విపక్ష నేతలపై మండిపడ్డారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 17, 2024 | 06:25 PMLast Updated on: Oct 17, 2024 | 6:25 PM

Revanth Reddy Mass Challenge To Brs Leaders

అధికారం కోల్పోయిన కొంతమంది దోపిడీ దొంగలు, బంది పోటు దొంగలు గా మారారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. సచివాలయంలో గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన సీఎం… విపక్ష నేతలపై మండిపడ్డారు. ఈ రోజు వాళ్లు మూసి నది పునరుజ్జీవాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మూసి లో ఉన్న మురికి కంటే మీ మెదడు లో ఎక్కువ మురికి ఉందని ఆరోపించారు. మూసి మురికి లో ఉన్న వారిని కాపాడాలనే మా ప్రయత్నం అని స్పష్టం చేసారు సిఎం.

33 బృందాలు మూసీ పరివాహక ప్రాంతంలో పేదల సమస్యలను తెలుసుకున్నాయన్నారు సిఎం. దుర్గంధంలో దుర్భర జీవితాలను గడుపుతున్న పేదల కష్టాలను తెలుసుకున్నామని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతాం అని స్పష్టం చేసారు. సుందరీకరణ అంటూ కాస్మటిక్ కలర్ అద్దాలని చూస్తున్నారని ఎద్దేవా చేసారు. మల్లన్న సాగర్ ,రంగనాయక్ సాగర్ , కొండపోచమ్మ కు నేను ఎక్కడికైనా వస్తా.. ఎక్కడికైనా సెక్యూరిటీ లేకుండా రావడానికి నేను సిద్ధంగా ఉన్నా.. మీరూ రండి రచ్చబండ నిర్వహిద్దాం.. అంటూ సవాల్ చేసారు.

కేసీఆర్.. నీ నియోజకవర్గానికి నేను వస్తా.. రచ్చబండలో కూర్చుని చర్చిద్దాం అని సిఎం సవాల్ చేసారు. ఇది కొందరు దుబాయ్ వెళ్లి అందం కోసం జుట్లు నాటించుకోవడం లాంటి కార్యక్రమం కాదన్నారు. నగరం మధ్య నదీ ప్రవాహం ఉన్న నగరం దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారిని తరలించాలనేదే మా ఆలోచన అని స్పష్టం చేసారు. 1600 పైచిలుకు మూసీ ఇండ్లు నదీ గర్భంలో ఉన్నాయని దసరా నేపథ్యంలో వారికి ఇండ్లు ఇచ్చి, ఖర్చులకు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి తరలించామన్నారు.

మల్లన్న సాగర్, కొండపోచమ్మ బాధితులను దుర్మార్గంగా రాత్రికి రాత్రి ఖాళీ చేయించింది మీరు అని మండిపడ్డారు. కొండపోచమ్మ ప్రాజెక్టులో మునిగిన 14 గ్రామాల్లో ఏ ఒక్కరికైనా ఇండ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. మిడ్ మానేరు ముంపు బాధితులకు ఇండ్లు ఇస్తామని మోసం చేసింది మీరు అని ఆరోపించారు. కానీ మేం అలా చేయడం లేదన్నారు సిఎం. బఫర్ జోన్ లో ఉన్న 10వేల కుటుంబాలకు కూడా పునరావాసం కల్పిస్తామన్నారు. ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం విపక్షాలకు ఇష్టంలేదా? అని ప్రశ్నించారు. శనివారంలోగా విపక్షాలు… తమ అభ్యంతరాలు తెలపాలని, వ్రాతపూర్వకంగా పంపాలని సీఎం కోరారు.