Revanth Reddy: రేవంత్‌కు రాహుల్ క్లాస్.. మారకపోతే కష్టమే అంటూ హెచ్చరిక..!
తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని రేవంత్‌కు రాహుల్ సూచించారు. తాజాగా ఢిల్లీలో రేవంత్.. రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను కలిశారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించి తనకు అందిన నివేదికలపై రాహుల్ స్పందించారు.
Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అనేక అంశాల్లో ప్రత్యేక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని రేవంత్‌కు రాహుల్ సూచించారు. తాజాగా ఢిల్లీలో రేవంత్.. రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను కలిశారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించి తనకు అందిన నివేదికలపై రాహుల్ స్పందించారు. రేవంత్‌కు కొన్ని కీలక సూచనలు చేశారు. పలు విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీనియర్లను కలుపుకొని పోవాల్సిందే
రేవంత్‌కు ఉన్న ప్రధాన సమస్య.. సీనియర్లు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు, రేవంత్‌కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, జగ్గా రెడ్డి, కోమటిరెడ్డి వంటి సీనియర్లు రేవంత్ పెత్తనాన్ని సహించడం లేదు. రేవంత్ కూడా వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో సీనియర్లను కలుపుకొని పనిచేయాలని రేవంత్‌కు రాహుల్ సూచించారు. విబేధాలు పక్కనపెట్టి పని చేయాలని, అప్పుడే పార్టీ గెలుపు సాధ్యమవుతుందన్నారు. కర్ణాటకలో అలా కలిసికట్టుగా పని చేయడం ద్వారానే గెలుపు సాధ్యమైందని రాహుల్ వివరించారు. తెలంగాణలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందని, అయితే.. నేతల పనితీరు బాగాలేదని తనకు నివేదికల ద్వారా తెలిసిందని రాహుల్ చెప్పారు. తెలంగాణకు సంబంధించి సునీల్ కనుగోలు ఈ అంశంపై రాహుల్‌కు నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా రాహుల్ కీలక సూచనలు చేశారు. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, ఎవరూ వ్యక్తిగత అభిప్రాయాలు, ఇగోలకు తావిచ్చినా సహించేది లేదని హెచ్చరించారు. నేతల్లో సమస్యలుంటే చర్చించుకోవాలని సూచించారు. తెలంగాణపై తాను పూర్తిస్థాయి దృష్టిపెట్టినట్లు, ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నట్లు చెప్పారు. కొన్ని జిల్లాల్లో ముఖ్యమైన నేతలు పార్టీని వీడుతున్నారని, అందరినీ కలుపుకొని వెళ్లాలని రేవంత్‌ను ఆదేశించారు. మరోవైపు రేవంత్‌పై ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా సోనియా గాంధీకి ఫిర్యాదు చేసిన అంశంపై కూడా రాహుల్ నిలదీశారని తెలుస్తోంది.
సొంత నియోజకవర్గంలో రేవంత్ వెనుకంజ
రేవంత్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ‌్‌గిరితోపాటు, సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేదని సర్వేలో తేలిందని రాహుల్ గుర్తు చేశారు. ఈ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెట్ స్థానంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఆశాజనకంగా లేదని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై దృష్టిపెట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గ సర్వేలో వెనుకబడి ఉన్నట్లు వివరించారు. సొంత నియోజకవర్గంపై కూడా ఫోకస్ చేయాలని రేవంత్‌కు సూచించారు.
పార్టీ కార్యక్రమాల వల్లే
రేవంత్‌కు కాంగ్రెస్ నేతగా ప్రజల్లో ఆదరణ ఉంది. అయితే, కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల వల్ల నియోజకవర్గంపై దృష్టి సారించడం లేదు. అటు తను గెలిచిన మల్కాజ్‌గిరితోపాటు, గతంలో ఎమ్మెల్యేగా చేసిన కొడంగల్‌పై కూడా ఫోకస్ చేయలేదు. దీంతో కొంత ఆదరణ తగ్గుతూ ఉండొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అయితే, ఎంతగా రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఉన్నా.. సొంత నియోజకవర్గంపై దృష్టిసారించకపోతే గెలుపు కష్టమే అనే విషయాన్ని రేవంత్ గ్రహించాలి. ఇతరుల్ని గెలిపించుకునేందుకు కృషి చేస్తూనే.. తను కూడా గెలవడానికి ప్రాధాన్యమివ్వాలి. నాయకుడిగా ఇతర నేతల్ని గెలిపించి, తాను ఓడిపోతే రాజకీయంగా రేవంత్‌కు కష్టమే.