Revanth Reddy: డిసెంబర్ 28 నుంచి ప్రజా పాలన.. ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు
వంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన పేరుతో సభలు నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Revanth Reddy: డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభల నిర్వహించి ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆదివారం సెక్రటేరియట్‌లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తొలిసారిగా సమావేశమయ్యారు.
Revanth Reddy: ఆటో డ్రైవర్లకు సీఎం గుడ్‌న్యూస్.. ఐదు లక్షల బీమా
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీ.ఎస్ శాంతి కుమారి, డీజీపీ రవీ గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా ప్రజా పాలన నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన పేరుతో సభలు నిర్వహించి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభలు నిర్వహించాలన్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం.2 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సా.5 గంటల వరకు ఈ సభలు నిర్వహించాలని ఆదేశించారు.
“ఈ సభల ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలి. అట్టడుగు వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందాలి. పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చాం. అక్రమార్కులను ఉపేక్షించొద్దు. భూ కబ్జాదారులు, అవినీతిపరులను వదిలి పెట్టొద్దు” అని రేవంత్ అన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో సర్పంచ్, స్థానిక కార్పొరేటర్, కౌన్సిలర్లతోపాటు, సంబంధిత ప్రజా ప్రతినిధులు, అధికారులు విధిగా పాల్గొనాలి. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను పరిశీలించి, వాటికి ప్రత్యేక నెంబర్ కేటాయించాల్సి ఉంటుంది. అన్నింటినీ కంప్యూటరైజ్ చేయాలి.