REVANTH REDDY: రేవంత్ దర్బార్.. సీఎం ప్లాన్ మామూలుగా లేదుగా..!

ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి రెండో రోజే ప్రజాదర్భార్ ప్రారంభించారు. జనం నుంచి తానే స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఉదయం ఆరింటి నుంచే క్యూలో నిలబడ్డారు జనం. సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా తమ బాధలను వివరించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 8, 2023 | 05:55 PMLast Updated on: Dec 08, 2023 | 5:55 PM

Revanth Reddy Plans To Make Improvement In Praja Dharbar

REVANTH REDDY: మేం పాలకులం కాదు.. ప్రజా సేవకులం అన్న తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం వేదిక మీద నుంచే ప్రజాదర్బార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శుక్రవారం నుంచి మొదలైన ఈ దర్బార్‌ను అందుకే ఆషామాషీగా తీసుకోదలుచుకోలేదు. ఇక్కడికి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు రేవంత్. జనం ఫిర్యాదులు స్వీకరించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులు సెక్రటరియేట్‌లో రోజుకి కొంత టైమ్ కేటాయించేవారు.

REVANTH REDDY: రేవంత్‌ సర్కార్‌లో కోదంరామ్‌కు కీలకస్థానం.. ఆయనకు ఇవ్వబోయే పదవి ఇదే..

స్వయంగా పాల్గొనే అవకాశం లేకపోతే.. కనీసం అక్కడ అధికారులతో ఓ వ్యవస్థ అయినా పనిచేసేది. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పదేళ్ళల్లో ఏ ఒక్కనాడూ జనాన్ని కలుసుకుందీ లేదు. ఫిర్యాదులు స్వీకరించిందీ లేదు. అటు ప్రగతి భవన్.. ఇటు సెక్రటరియేట్.. ఎక్కడికీ జనాన్ని లోపలికి అడుగు పెట్టనీయలేదు. అందుకే ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి రెండో రోజే ప్రజాదర్భార్ ప్రారంభించారు. జనం నుంచి తానే స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఉదయం ఆరింటి నుంచే క్యూలో నిలబడ్డారు జనం. సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా తమ బాధలను వివరించారు. హైదరాబాద్ నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా వినతి పత్రాలతో జనం ప్రజాదర్బార్‌కు వచ్చారు. ప్రజాభవన్‌లో ఇక నుంచి ప్రతి రోజూ ప్రజాదర్బార్ ర్వహించబోతున్నారు. జనం ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రతి రోజూ ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే తప్పనిసరిగా ఉంటారు. మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు ఫిర్యాదులు స్వీకరించారు. తర్వాత విద్యుత్, ఆర్టీసీ సమీక్ష కోసం సెక్రటరియేట్‌కు వెళ్లడంతో ఫిర్యాదులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క స్వీకరించారు.

గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ల కోసం 15 డెస్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి వినతిపత్రాన్ని ఆన్‌లైన్లో ఎంట్రీ చేసి.. దానికి గ్రీవెన్స్ ఐడీ నెంబర్ కేటాయించారు. ప్రింటెడ్ అకనాలెడ్జ్‌మెంట్ కూడా ఇచ్చారు. పిటిషన్ దారులకు ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా ఎకనాలెడ్జ్ మెంట్ పంపారు. జనం కూర్చోవడానికి 320 కుర్చీలు వేశారు. బయట కూడా క్యూలైన్లు ఏర్పాటయ్యాయి. ఫిర్యాదుదారులు ఎండలో ఇబ్బంది పడకుండా.. క్యూలైన్లపైన నీడ కల్పిస్తున్నారు. జనానికి తాగు నీరు, ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ప్రజాదర్బార్‌కు వచ్చే ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి జరుగుతున్న చర్యలను పర్యవేక్షించేందుకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించబోతున్నారు. అలాగే జిల్లాకు ఓ టీమ్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఫిర్యాదుకీ ఓ పరిష్కారం చూపించాలన్నది రేవంత్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇన్నాళ్ళూ బీఆర్ఎ్ ప్రభుత్వం చేయలేని పనిని చేసి చూపిస్తున్నారు కొత్త సీఎం రేవంత్ రెడ్డి.