Revanth Reddy: ఎన్నికల కోసం అదిరిపోయే వ్యూహం రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా ?

తెలంగాణలో ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉండటంతో.. బలం పుంజుకునేందుకు కాంగ్రెస్ చాలా కష్టపడుతోంది. ఆ పార్టీ నేతలు టికెట్ల కోసం పోటీ పడటం తప్ప.. పార్టీని బలోపేతం చేయడం ఎలా అనే దానిపై ఫోకస్ చేయడం లేదనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. కీలక నేతలు నుంచి.. నియోజకవర్గ స్థాయి నేతలు కూడా ఇదే ధోరణితో కనిపిస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 10, 2023 | 12:51 PMLast Updated on: May 10, 2023 | 1:17 PM

Revanth Reddy Political Strategy

దీంతో పార్టీని బలోపేతం చేసేందుకు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయ్. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు గ్రామీణ ఎన్నికల బృందాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ప్రతి మండలంలో కనీసం 25మంది సభ్యులతో ఎన్నికల టీమ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో 40శాతం మంది మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలతో పాటు 50 ఏళ్లలోపు వారు ఉంటారు. మే నెలాఖరులోగా రూరల్‌ ఎన్నికల టీమ్‌లు అన్నీ అందుబాటులోకి రానున్నాయ్. ముందస్తు ప్రచార శిక్షణ తరగతుల తర్వాత.. ఆ టీమ్‌లు గ్రామాల్లో ప్రచారం చేస్తారు.

తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. ప్రతీ నియోజవకర్గంలో 5 మండలాలు ఉన్నాయ్. అంటే మొత్తం 6వందల మండలాలు, 12వేల 769 గ్రామ పంచాయతీలు ఉన్నాయ్. ప్రతీ గ్రామంలో సిసలైన కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తిస్తున్నామని.. కనీసం ఒకరు లేదా ఇద్దరు కార్యకర్తలు ఎన్నికల బృందంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కార్‌ వైఫల్యాలను వీరంతా జనాల్లోకి తీసుకెళ్తారు. ఐతే కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన కమిటీలు వేయడం మంచిదే అయినా.. వాటి పనితీరును పరిశీలించేది ఎవరనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.

ఎప్పుడూ గ్రూపులతో, వర్గ విభేదాలతో సతమతమయ్యే కాంగ్రెస్ పార్టీ.. ఈ కమిటీల కూర్పులో ఇదే రకంగా వ్యవహరిస్తుందనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.అదే జరిగితే.. ఈ కమిటీలు కూడా మరోసారి వర్గ విభేదాలకు దారి తీయడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. ఎన్నికల మూడ్‌లోకి రాష్ట్రం వెళ్లిపోయిన వేళ.. ఓ అడుగు పడడం హస్తంపార్టీకి మంచి పరిణామమే అనే చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు వేరు.. కాంగ్రెస్‌లో రాజకీయాలు వేరు. ఇలా ఉంటుంది ఆ పార్టీలో తీరు. బలం ఉన్నా.. దాన్ని సమర్థంగా వినియోగించుకోలేని పరిస్థితి. ప్రతీ దానికి పుల్ల అడ్డు వేసే నేతలకు పార్టీలో కొదువ లేదు. నిజానికి విలేజ్ కమిటీలు అనేది మంచి కాన్సెప్ట్ అయినా.. వాటిని లీడ్ చేసేందుకు కూడా కొట్టుకుంటారు చాలామంది పార్టీలో. దీంతో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. రేవంత్ గట్టిగా ఓ ప్లాన్ అయితే చేశారు కానీ.. దాని ప్రయాణం ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న.