Revanth Reddy: కాంగ్రెస్ గెలిచేది లేదని రేవంత్ డిసైడ్ అయ్యారా.. ఢిల్లీ వెళ్లే ప్లాన్ ఉందా.. తన దారి తాను చూసుకుంటున్నారా?
తెలంగాణ రాజకీయాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయ్. పాలిటిక్స్ ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో అర్థం కాని పరిస్థితి. అధికారం తమదే అని పార్టీలన్నీ ఎవరి వారు ధీమా వ్యక్తం చేస్తుంటే.. హంగ్ అని దూరంగా వినిపిస్తున్న ఓ మాట.. రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. దీంతో ఎన్నికలకు ఆరు నెలల ముందే.. రాజకీయం రంజుగా మారింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుస్తాయని ఒకరు.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే హంగ్ ఏర్పడితే అసలు రంగు బయటపడుతుందని మరొకరు.. ఇలా రకరకాల సమీకరణాలు, అంచనాలు తెరమీదకు వస్తున్నాయ్. ఇలాంటి పరిణామాల మధ్య అన్ని పార్టీలు మాత్రం జనాల్లోనే కనిపిస్తున్నాయ్ ఇప్పుడు ! ప్రతీ ఓటర్‌ను కలుసుకుంటున్నాయ్. ఓటు కోసం కష్టపడుతున్నాయ్. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత మొదలైంది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేల మీద.. జనాలు కూడా గుర్రుగా ఉన్నారు చాలాచోట్ల ! దీన్ని ఆయుధంగా మార్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయ్. కమలం పార్టీతో కంపేర్ చేస్తే కాంగ్రెస్‌కు బలం ఎక్కువ. ఐతే కేడర్‌ను నడిపించే సరైన నాయకుడు లేకుండా పోయాడు ఆ పార్టీలో !
ఇలాంటి పరిస్థితుల మధ్య అధికారం దక్కించుకోవడం అంటే కష్టమే అనే చర్చ జరుగుతోంది. ఇదే అనుమానం రేవంత్‌కు వచ్చిందనుకుంటా బహుశా ! తన దారి తాను చూసుకుంటున్నారనే ప్రచారం జోరు మీద సాగుతోంది. బీజేపీ దెబ్బకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవుతోంది. నెగ్గాలంటే తగ్గక తప్పదు అని డిసైడ్ అయ్యే పరిస్థితిలో కనిపిస్తోంది హస్తం పార్టీ. అది తెలంగాణకు కూడా వర్తిస్తుంది. రాష్ట్రంలో హంగ్ పరిస్థితులు వస్తే.. బీఆర్ఎస్‌తో కలిసేందుకు పెద్దగా వ్యతిరేకించే అవకాశాలు ఉండవ్. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. రేవంత్‌కు కనీసం మొహం కూడా చెల్లదు. హంగ్ వస్తే.. కాంగ్రెస్‌లో కొందరు ఎమ్మెల్యేలను కేసీఆర్ లాగేసే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే హస్తం పార్టీలో చాలామంది నేతలు.. గులాబీ పార్టీతో టచ్‌లోకి వెళ్లారు. కొందరికి కేసీఆర్ స్వయంగా ఫండింగ్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా చూసినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని రేవంత్ డిసైడ్ అయ్యారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. అందుకే మళ్లీ ఢిల్లీ వెళ్లేందుకే ప్లాన్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్‌కు ఎలక్షన్స్ జరుగుతాయ్. నవంబర్‌లో సంగతి తేలిపోతుంది కాబట్టి.. మేలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా ఢిల్లీ వెళ్లాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారట. ఈలోపే ఆర్థికంగా బలపడాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
వివాదాలను తెరమీదకు తీసుకొచ్చేది.. కాంట్రాక్టుల గురించి పదేపదే ప్రస్తావించేది.. ఒక్కో రూపాయి వెనకేసుకునే ప్రాసెస్‌లో భాగమే అన్నది ఇంకొందరి విమర్శ. ఐతే ఇదే నిజంగా జరగొచ్చు.. నిజం కావొచ్చు. ఏం జరిగినా.. కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపులు చూడడం ఖాయం. అక్కడి ఫలితాలు.. ఇక్కడ రాజకీయాన్ని డిసైడ్ చేస్తాయ్. కన్నడనాట కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆ ఇంపాక్ట్ ఇక్కడా కనిపిస్తుంది. దూరం అయినవాళ్లను దగ్గర చేస్తుంది.. దూరం కావాలనుకున్న వాళ్లని భయపెడ్తుంది. వేరే పార్టీకి దగ్గరయ్యేవాళ్లను హెచ్చరిస్తుంది. ఇప్పుడు రాజకీయం సరికొత్త మలుపులు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.